Monday, February 16, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకొత్తవి రావు..పాతవి పెరగవు

కొత్తవి రావు..పాతవి పెరగవు

- Advertisement -

‘ఆసరా’ కోసం ఎదురు చూపులు
25లక్షల దరఖాస్తులు పెండింగ్‌
రెండేండ్లలో 2లక్షల పింఛన్ల రద్దు
ఆఫీసుల చుట్టు కాళ్లరిగేలా తిరుగుతున్న దరఖాస్తుదారులు
పట్టించుకోని అధికారులు
నిర్ణయం తీసుకోని ప్రభుత్వం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం రెండేండ్లుగా పేదలు ఎదురు చూస్తున్నారు. కొత్తవి రావడం లేదు.. పాత పింఛన్లు పెరగడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా ఆసరా చేయూత అడుగు ముందుకు పడట్లేదు. ఎన్నికలకు ముందు పింఛన్లు పెంచుతామని కాంగ్రెస్‌పార్టీ ప్రకటించింది. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా 2024, 2025లో రెండు దఫాలుగా కొత్తగా 24.85 లక్షల దరఖాస్తులను స్వీకరించారు. వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు అర్హులను ఎంపిక చేయలేదు. పాత పింఛన్ల పెంపు, కొత్త పింఛన్ల మంజూరు ఇప్పటి వరకు జరగలేదు. దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వివిధ కారణాలతో దాదాపు రెండు లక్షల పింఛన్లను రద్దు చేశారు. రాష్ట్రంలో 2023-24 లెక్కల ప్రకారం 44,49,767 మంది ఆసరా పింఛన్‌దారులు ఉన్నారు.

వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, వ్యాధిగ్రస్తులు, చేనేత, గీత కార్మికులు మొదలగు 11 రకాల వారికి ఈ పథకం కింద ప్రతి నెల ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నది. వికలాంగులకు రూ.4,116, మిగతా 10 కేటగిరిల్లోని వారికి రూ.2,116 అందిస్తున్నారు. అయితే 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఆసరా పింఛన్‌ దారుల సాయాన్ని రూ. 4 వేలకు పెంచుతా మనీ, కొత్తగా అర్హులను గుర్తిస్తామని ప్రకటించింది. ఆ ప్రకారం రెండు దఫాలుగా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా 24.85 లక్షల దరఖాస్తులను స్వీకరించారు. వాటిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల జాబితాను ప్రభుత్వానికి పంపినా, ఇప్పటికీ అవి పట్టాలెక్కలేదు. ఆసరా పింఛన్ల కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులను కూడా పూర్తి స్థాయిలో ఖర్చు చేయకుండా దారి మళ్లిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆసరా కోసం రూ.14628.91 కోట్లు కేటాయించింది.

ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి రూ.10, 514.32 మాత్రమే ఖర్చు చేశారు. 2024 అక్టోబర్‌ నాటికి 11 కేటగిరిల్లో రూ.44,49,767 లక్షల మందికి పింఛన్లు వస్తే 2025 మార్చి నాటికి 42,51,331లక్షల మందికే వస్తోంది. సర్కార్‌ చెబుతున్న లెక్కల ప్రకారమే 2025 మే వరకు 1,98,426 మంది ఆసరా పింఛన్లు రద్దయ్యాయి. వీటిలో రెండు రకాల ఫించన్లు తీసుకుంటున్నవారు, మరణించిన వారు, వలసలు వెళ్లినవారు ఉన్నారని ప్రభుత్వం చెప్తుంది. 2024 అక్టోబర్‌ నాటికి 5,14,422 మంది వికలాంగులకు పింఛన్లు వస్తే 2025 మార్చి నాటికి 4,90,044 మందికి వస్తున్నాయి. ఐదు నెలల కాలంలో 24,378 మంది వికలాంగుల పింఛన్లు రద్దయ్యాయి. చనిపోయిన వారి పింఛన్లను రద్దు చేసిన సర్కార్‌ వారిపై ఆధారపడ్డ వారికి కొత్తగా ఇవ్వడం లేదు. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు సిఫారసు చేసిన దాదాపు 5 వేల మందికి మాత్రమే కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరయ్యాయి. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేదలు కొత్త పింఛన్ల మంజూరు కోసం, పాత వారు రూ.4 వేల పెంపు కోసం ఎదురు చూస్తున్నారు.

పింఛన్లు వెంటనే పెంచాలి : యం అడివయ్య, ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికలకు ముందిచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఆసరా వికలాంగుల పింఛన్లను రూ.6,116కు, మిగతా పింఛన్లను రూ.4,116కు పెంచాలి. అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా సర్కార్‌ తనకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నది. జీవో నెంబర్‌ 17ను తెరపైకి తెచ్చి ఆదాయ పరిమితి పేరిట పింఛన్లను తగ్గిస్తే సహించేది లేదు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ ఆసరా పింఛన్లు ఇవ్వాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -