ఖాట్మాండు : నేపాల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. ఆ దేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జెన్-జీ మద్దతున్న రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్పీ) విజయం దిశగా వెళ్తోంది. గురువారం పోలింగ్ ముగియగా.. శుక్రవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలను బట్టి బాలేంద్ర షా నాయకత్వంలోని ఆర్‌ఎస్పీ మెజార్టీ స్థానాల్లో విజయం వైపు దూసుకెళ్తోంది. ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకారం… ఆ పార్టీ మొత్తం 110 స్థానాల్లో ముందంజలో ఉంది. నేపాలీ కాంగ్రెస్, ఇతర పార్టీలు ప్రభావాన్ని చూపట్టలేకపోయాయి. కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచి, 10 చోట్ల ఆధిక్యంలో ఉంది. కమ్యూనిస్ట్ అభ్యర్థులు ఏడు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నేపాల్‌లో మొత్తం 165 స్థానాలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 67 పార్టీలు పోటీచేశాయి. గతేడాది జెన్-జీ ఆందోళనలతో కేపీ శర్మ ఓలీ నాయకత్వంలోని నేపాల్ ప్రభుత్వం కూలిపోయిన విషయం విదితమే. దీంతో అక్కడ ఎన్నికలు అనివార్యమయ్యాయి.పొరుగుదేశమైన నేపాల్‌లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలను భారత్ నిశితంగా గమనిస్తోంది. జెన్-జీ ఉద్యమంతో నేపాల్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడటం, తాజా ఫలితాలను బట్టి చూస్తే అక్కడ స్థిరమైన ప్రభుత్వం కొలువుదీరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘పరస్పర ప్రయోజనం కోసం మా రెండు దేశాలు, ప్రజల మధ్య బలమైన బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి నేపాల్ కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మేము ఎదురుచూస్తున్నాం” అని అన్నారు.
ఎవరీ బాలేంద్ర షా?
స్ట్రక్చరల్ ఇంజినీర్ అయిన బాలేంద్ర షా ర్యాపర్ సింగర్‌గా గుర్తింపు పొందారు. తన కచేరీల ద్వారా అవినీతి, అసమానతలు, యువత సమస్యలను లేవనెత్తుతారు. ఇవే యువతలో ఆయనకు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండటంతో జెన్-జీ యువత ఆయన పట్ల ఆకర్షితమైంది. ఖాట్మాండు మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఘన విజయం అందుకున్నారు. మేయర్‌గా ఆయన తీసుకున్న నిర్ణయాలు యువతను మరింత ప్రభావితం చేశాయి. తమ సమస్యల పరిష్కారానికి ఆయనను ఒక నాయకుడిగా చూశారు. అదే జెన్-జీ యువతలో షా పట్ల ఆకర్షణను పెంచిందని అక్కడి రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.రాష్ట్రీయ స్వతంత్ర పార్టీని స్థాపించిన బాలేన్.. ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. నేపాల్ అనేక ఏండ్లుగా పాతుకుపోయిన పార్టీల పునాదులను ఆయన పెకిలించారు. ఈ ఎన్నికల్లో దాదాపు 10 లక్షల కొత్త జెన్-జీ ఓటర్లు చేరడం ఆయన కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఝపా-5 నియోజకవర్గం నుంచి పోటీచేసిన బాలెన్.. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీపై భారీ గెలుపు దిశగా సాగుతున్నారు.నేపాల్‌లో 275 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో 165 మంది సభ్యులు ఎఫ్‌పీటీపీ వ్యవస్థ ద్వారా ఎన్నుకోబడతారు. 110 సీట్లు దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ద్వారా భర్తీ అవుతాయి. ఈనెల 9 నాటికి ఎన్నికల కౌంటింగ్ పూర్తవుతుందని ఆ దేశ ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
నేపాల్ ఎన్నికల్లో కొత్త పార్టీ ప్రభంజనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



