Friday, February 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమే మొదటి వారంలో కొత్త పార్టీ

మే మొదటి వారంలో కొత్త పార్టీ

- Advertisement -

పార్టీ మదర్‌ బోర్డ్‌ తెలంగాణే
బోధన్‌, సిద్దిపేట సహా ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మే మొదటి వారంలో మంచి ముహుర్తం చూసుకుని రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందనీ, పార్టీకి మదర్‌బోర్డుగా కూడా తెలంగాణే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌ లోని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తాను బోధన్‌, సిద్దిపేట సహా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చన్నారు. ప్రజల సమస్యలను బలంగా లేవనెత్తుతున్న ప్రతిపక్షం తామేననీ, పెద్దపల్లి మున్సిపాలిటీలో తామే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ క్రమేణా కనుమరుగువుతుందన్నారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జీహెచ్‌ఎంసీ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నాటికి తమ పార్టీ గుర్తు వచ్చే అవకాశం ఉందనీ, ఆ గుర్తుపైనే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులు చాలా మంది తనతో టచ్‌లో ఉన్నారనీ, సందర్భం వచ్చినప్పుడు వివరాలు వెల్లడిస్తానని ఆమె తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు 50 కమిటీలు వేసి లోతుగా చర్చిస్తున్నామనీ, పార్టీని సైద్ధాంతికంగా బలోపేతంగా మార్చనున్నట్టు చెప్పారు. రాజకీయ పార్టీల స్థాపన – వైఫల్యాలపై చర్చ జరిగేటప్పుడు జెండర్‌ ఆధారంగా మీడియా చర్చించడం సరికాదన్నారు. పార్టీలు స్థాపించిన చిరంజీవి, దేవందర్‌ గౌడ్‌ విఫలం కాలేదా? అని ఆమె ప్రశ్నించారు. ప్రజల కోణంలో సామాజిక తెలంగాణ లక్ష్యంగా పార్టీ ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది తమ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్‌ చేశారు. టీజీఎస్‌ఆర్టీసీ విక్టిమ్స్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి డి.రాజేందర్‌తో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మెఘా కృష్ణారెడ్డికి ఆర్టీసీని అప్పగించే కుట్ర జరుగుతోందని కవిత ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రద్దైన యూనియన్లను పునరుద్ధరిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సంస్థలో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. మహాలక్ష్మి పథకం వచ్చాక ఆర్టీసీకి ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం రిలీజ్‌ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఈ నెల 24న ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన చలో సచివాలయం ఆందోళనకు జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమె ఆర్టీసీ కార్మికులతో 16 నుంచి 18 గంటలు పనిచేయిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. మహాలక్ష్మి పథకం తర్వాత ఆక్యుపెన్సీ పెరిగిందనీ, దీంతో ఆర్టీసీకి ప్రతి నెలా రూ.600 కోట్లు చెల్లించాలని కవిత డిమాండ్‌ చేశారు. కేంద్రం నుంచి వస్తున్న గ్రాంట్స్‌ను ఆర్టీసీకి ఇవ్వాలనీ, బస్సుల సంఖ్య పెంచాలనీ, ఎలక్ట్రిక్‌ బస్సుల్లో ఆర్టీసీ ఉద్యోగులనే కొనసాగించాలని కోరారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఎర్రవెల్లిలో మంత్రివర్గ సమావేశాలు జరిగితే, కాంగ్రెస్‌ హయాంలో ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారని ఆమె విమర్శించారు. సచివాలయంలోనే మంత్రివర్గ సమావేశాలు జరగాలన్నారు. ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకుని ఉద్యమం గురించి కేటీఆర్‌ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -