వరి పంటలో పంజాబ్‌ను దాటిన తెలంగాణ
రెండేండ్లుగా స్థిరంగా వ్యవసాయ రంగం వృద్ధి
రైతు సంక్షేమానికి రూ.లక్ష కోట్లకు మించి ఖర్చు
ప్రజా ప్రభుత్వంలో అగ్రికల్చర్ రైజింగ్
నవతెలంగాణ -హైదరాబాద్
ప్రజాప్రభుత్వ సుస్థిర పాలన, రైతులకు లాభం చేకూర్చే విధానాలు, విస్తరణ ఫలితాలతో రాష్ట్రంలో వ్యవసాయం ఏటేటా విస్తరిస్తోంది. రికార్డులను నెలకొల్పుతూ వరి సాగులో పంజాబ్‌ను దాటేసింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో వ్యవసాయం వాటా 6.7 శాతం పెరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగం వాటా 2023-24లో రూ.1,00,004 కోట్లు నమోదు కాగా..2024-25 అంచనాల ప్రకారం రూ.1,06,708కు చేరింది. 2023-24 సీజన్‌లో 209.62 లక్షల ఎకరాల్లో అన్ని పంటలు సాగు చేయగా..296.17 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చింది. 2024-25 సీజన్‌లో సాగు విస్తీర్ణం ఏకంగా 220.77 లక్షలకు పెరిగింది. పంట దిగుబడి 320.62 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. ప్రధాన పంటైన వరి సాగు 2023-24లో 118.11 లక్ష్లల ఎకరాలు కాగా…2024-25లో అది 127.03 లక్షల ఎకరాలకు పెరిగింది. ధాన్యం దిగుబడి 260.88 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి.. ఈ ఏడాది వానాకాలం, యాసంగిలో కలిపి 284.16 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. పత్తి సాగు విస్తీర్ణం ఇంచుమించుగా రెండేండ్లు ఒకే తీరుగా ఉన్నప్పటికీ ఉత్పత్తి 3.89 లక్షల టన్నులు పెరిగింది. రెండేండ్ల పాలనను పురస్కరించుకుని ప్రజాప్రభుత్వం వ్యవసాయంపై ఒక డాక్యుమెంటరీ విడుదల చేసింది.
రైతు సంక్షేమమే ధ్యేయంగా…
రెండేండ్లు గా ప్రజాప్రభుత్వం రైతుల సంక్షేమం కోరుతూ భారీ బడ్జెట్‌ను కేటాయిస్తున్నది. తెలంగాణ రైతులను దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలనే సంకల్పంతో రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసింది. రూ.54280 కోట్లతో వివిధ పథకాలను అమలు చేసింది. దేశంలోనే తొలిసారిగా రైతులకు ఒకేసారి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. దీని ద్వారా 25,35,964 రైతు కుటుంబాలు రుణ విముక్తి పొందాయి. రైతులకు ఉచిత విద్యుత్ కోసం ఏటా రూ.10,444 కోట్లు సబ్సిడీగా చెల్లిస్తున్నది. సీఎంగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఎకరానికి రూ.12 వేల చొప్పున రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధులు పంపిణీ చేసింది. మొత్తం 1,57,51,000 ఎకరాలకు 69,86,548 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు జమ చేసింది. కేవలం 9 రోజుల్లోనే రూ.8744 కోట్లు జమ చేసింది. ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే రూ. 5 లక్షల బీమా పరిహారం ఆ బాధిత కుటుంబానికి అందిస్తోంది. 42.16 లక్షల మంది రైతుల కుటుంబాల పేరిట ప్రభుత్వం జీవిత బీమా కంపెనీకి రైతు బీమా ప్రీమియం చెల్లించింది. గతంలో ఒక్కో రైతుకు రూ.3400 చొప్పున చెల్లించిన ప్రీమియాన్ని ఎల్‌ఐసీతో సంప్రదింపులు చేసి ఈసారి రూ.3225కు తగ్గించింది. పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించింది. వ్యవసాయానికి సంబంధించి గత ప్రభుత్వం నిలిపేసిన 16 కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది.
సన్నాలకు బోనస్ రూ.314 కోట్ల చెల్లింపు
దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను పెంచి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నది. రైతులు నెలలకొద్దీ ఎదురుచూడకుండా డబ్బులను వేగంగా చెల్లించి రికార్డు నెలకొల్పింది. ప్రస్తుత సీజన్లో 8380 కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటికే 38.72 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇప్పటివరకు (డిసెంబర్ రెండో తేదీ) దాదాపు రూ.10162 కోట్ల ధాన్యం కొనుగోలు చేసింది. సెంటర్లలో ధాన్యం అమ్మిన రైతులకు రెండు రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తోంది. ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లకు రూ.500 బోనస్ ప్రకటించింది. ఈ సీజన్లో ఇప్పటికే సన్నాలు అమ్మిన రైతులకు రూ.314 కోట్ల బోనస్ చెల్లించింది.
నాణ్యమైన విత్తనాలను అందించేందుకు తెలంగాణ సీడ్ యాక్టు
రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ప్రత్యేకంగా తెలంగాణ సీడ్ యాక్ట్‌ను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. మేలోనే ఈ బిల్లు ముసాయిదా తయారీకి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మెరుగైన విత్తనాలను పండించడం, స్థానిక అవసరాలకు వాడుకొని, మిగిలిన వాటిని ఎగుమతి చేసే స్థాయికి రైతులు ఎదిగేలా ఈ బిల్లు ఉపయోగపడనుంది.
పంట నష్టపోయిన రైతులకు అండగా…
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెనుకాడలేదు. గత ఏడాది మార్చి, సెప్టెంబర్లో వడగండ్లు, వర్షాలతో నష్టపోయిన 94,462 మంది రైతులకు రూ.95.39 కోట్ల పరిహారం అందించింది. ఇటీవల మార్చి, ఏప్రిల్లో వచ్చిన భారీ వర్షాలకు నష్టపోయిన 36,449 మంది రైతులకు రూ.44.19 కోట్ల పరిహారం అందించింది.
పాలనాపరంగానూ కీలక నిర్ణయాలు
గత ప్రభుత్వం హయంలో రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ధరణి వెబ్ పోర్టల్‌ను ప్రజా ప్రభుత్వం రద్దు చేసింది. రైతులకు భూములపై హక్కులు కల్పించే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో చాలామేరకు భూ సమస్యలు, వివాదాలు పరిష్కారమయ్యాయి. రైతులకు అవసరమైన సలహాలు సూచనలు అందించేందుకు, అధికారులు నేరుగా క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకునేందుకు రైతు నేస్తం పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. 1600 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను అమర్చనుంది. అన్ని మండలాల్లో వ్యవసాయ అధికారులు ఉండేలా టీజీపీఎస్సీ ద్వారా 144 మంది వ్యవసాయ అధికారుల నియామకాలు చేపట్టింది. ఉద్యానవన శాఖలో 18 మంది హార్టికల్చర్ ఆఫీసర్లను నియమించింది.
ఆయిల్ పామ్ కస్టమ్స్ సుంకం సంబంధించిన సమస్యలు పరిష్కరించటం ద్వారా ఆయిల్ పామ్ రైతులకు టన్నుకు రూ.2000 అదనపు లబ్ది చేకూరనున్నది. రైతుల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కరించేందుకు రాష్ట్ర సర్కారుకు సూచనలిచ్చేందుకుగానూ కోదండరెడ్డి నేతృత్వంలో వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
సాగులో సరికొత్త రికార్డులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



