రూ.70 లక్షలతో ఆలయముఖ ద్వారం పనులు ప్రారంభం
40 ఫీట్ల వెడల్పు సీసీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మాణం
ముస్తాబవనున్న వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాలు
నవతెలంగాణ – వనపర్తి
జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ముఖద్వారం, ఆలయ పరిసర ముందు భాగం ప్రాంతాలన్నీ సీసీ రోడ్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణంతో అందంగా ముస్తాబ్ అవుతోంది. ఆలయ ముఖద్వారం నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం కోసం 70 లక్షల నిధులను వినియోగిస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు తోడి మేఘారెడ్డి సన్నిహితుడు, స్థానిక వ్యాపారి ఎస్ ఎల్ ఎన్ రమేష్ ఈ నిధులను సమకూర్చి పనులను ప్రారంభించారు. ఈ పనులు ప్రారంభించి రెండు నెలలుగా పనులు కొనసాగుతున్నాయి. వెంకటేశ్వర ఆలయానికి నలువైపులా సర్వాంగ సుందరంగా సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మాణం అవ్వనుండడంతో ఇకపై ఆలయానికి వచ్చి వెళ్లే భక్తులకు ఇబ్బందులు తీరని ఉన్నాయి.
ఇటీవల వనపర్తికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు తన చిన్ననాటి పాఠాలు బోధించిన గురువు ఆలయం రఘునాథ చార్జీల విజ్ఞప్తి మేరకు గుడి మరమ్మతుల కోసం కోటి రూపాయలు మంజూరు చేయాలని కోరడంతో వెంటనే నిధులను మంజూరు చేయించారు. ఆ నిధులతో ఆలయంలోని అంతర్గత మరమ్మతులు చేపట్టేందుకు టెంటర్లు పూర్తి చేశారు.
ఆలయ ముఖ ప్రధాన ద్వారానికి ఎదురుగా భారీ హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఆలయంలోకి ప్రవేశించే ముఖద్వారాలను 40 అడుగుల పొడుగున ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే చర్యలు చేపట్టారు. దాంతోపాటు ఆలయ ముఖ ద్వారా ప్రాంతాలను కనివిందు చేసేలా ప్రణాళికలు రచించి ఏర్పాట్లు చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పై భారీ తొట్లు ఏర్పాట్లు చేసి పర్యావరణంతో కళకళలాడేలా పుష్పాలంకరణతో కనువిందు చేసేలా పూల మొక్కలను నాటేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వెంకటేశ్వర ఆలయ పరిసరాలన్నీ భక్తులను నూతన శోభతో కనువిందు చేయనున్నాయి.
కొనసాగుతున్న సైడ్ డ్రైనేజీ పనులు
కొద్దికాలంగా నిలిచిపోయిన సిసి రోడ్ల నిర్మాణానికి సైడ్ డ్రైనేజీ పైప్లైన్ పనులు మూడు రోజులుగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు పైపులు పరచిన తర్వాత ఛాంబర్ల ఏర్పాటు పనులు కొనసాగులున్నాయి. వారం రోజుల్లో సైడ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ సిసి నిర్మాణం పూర్తి కానుంది. అండర్ గ్రౌండ్ సిసి పైపుల నిర్మాణం పూర్తయితే తప్ప ప్రస్తుతం ఉన్న బిటి రోడ్డున తొలగించి దాదాపు రెండున్నర మీటర్లకు పైగా మట్టి వేసిన తర్వాత సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
పెండింగ్ లోనే ముఖద్వారం
వెంకటేశ్వర స్వామి ఆలయానికి నూతనంగా నిర్మాణం చేపట్టనున్న ముఖద్వారం పనులు పెండింగ్లోనే ఉన్నాయి. ప్రస్తుతం సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయితే తప్ప ఆలయ నూతన ఆర్చి పనులు ప్రారంభమయ్యే అవకాశం లేదు. కాబట్టి ఈ పనులు పూర్తయ్యేసరికి దాదాపు నెల రోజులు సమయం పట్టే అవకాశం లేకపోలేదు.