Sunday, June 22, 2025
E-PAPER
Homeచైల్డ్ హుడ్కొత్త సిలబస్‌

కొత్త సిలబస్‌

- Advertisement -

కలలో కొడుకు అడిగిన ప్రశ్నలకి ఉన్నట్టుండి నిద్రలోనే ఉలిక్క పడ్డట్టు మెలుకువ వచ్చింది. లేచి కూర్చున్నాను. నుదిటి మీద చేయి వేసి చూసుకుంటే నిజంగానే చెమటలు పట్టి ఉన్నాయి. ప్రక్కకి తిరిగి చూశా. వాళ్ళ అమ్మ పడుకొని ఉంది. వాళ్ళ అమ్మ పక్కన వాడు లేడు. తెలియకుండానే తల దగ్గర ఉన్న సెల్‌ ఫోన్‌ తీసి టైమ్‌ చూశా. ఉదయం నాలుగు గంటల ఐదు నిమషాలు అయింది. వీడు లేచి స్టడీ రూమ్‌కి వెళ్ళి ఉంటాడనిపించింది.
నెమ్మదిగా అక్కడనుంచి లేచి బెడ్‌రూమ్‌ డోర్‌ తెరిచి స్టడీ రూమ్‌ వైపు చూశా. వేసి ఉన్న లైట్‌ కాంతి డోర్‌ కింద నుంచి కనబడుతూ నా మనసును కొంచం కుదట పడిచింది. నెమ్మదిగా స్టడీ రూమ్‌ డోర్‌ తెరిచాను. వాడు మంచం మీద ఒక మూలన రెండు గోడల కార్నర్‌లో కూర్చొని ఒడిలో తలగడ పెట్టుకొని తలగడ మీద పుస్తకం, పుస్తకంమీద తల పెట్టుకొని పడుకొని ఉన్నాడు.
వాడిని చూస్తే జాలేసింది. వయసు ఇప్పుడే పదహారు సంవత్సరాలు వచ్చాయి. వచ్చే ఒకటో తారీఖు నుండే ఇంటర్‌ బోర్డు పరీక్షలు. మేమెప్పుడూ వాడిని ఉదయాన్నే లేపేస్తాం. ఉదయం చదివితే బాగా మెదడుకి ఎక్కుతుందని. వాడుకూడా ఎప్పుడూ చదువు విషయంలో మా మాట కాదు అనేవాడు కాదు. చిన్నప్పటి నుండి వాడి తెలివితేటలు గూర్చి మా చుట్టాలు బంధువుల ఇళ్ళళ్లో వాడి ముందే గొప్పగా చెప్పుకుంటుంటారు. వాడి గురించి ఆలోచించి నప్పుడల్లా నాకు ఎప్పుడూ కాసింత గర్వంగానే ఉండేది. కాని మొదటిసారి ఈ రోజు వాడిని ఇలా చూసి మొదట కాస్తా జాలేసినా ఇప్పడు మరలా ఆ కల గుర్తొచ్చి భయం వేసింది.
”నాన్నా నాకు మంచి మార్కులు వస్తే గుడికి తీసుకొస్తానని అమ్మ దేవుడుకి మొక్కుకుంటుంది. మంచి మార్కులు అంటే ఎన్ని నాన్న? నాకు మంచి మార్కులు రాకపోతే వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర నువ్వు తల ఎత్తుకోలేక పోయావని అమ్మ నా వలన బాధ పడదు కదా నాన్న. నువ్వు ఎప్పటిలానే నన్ను మీ కొడుకులానే చూసుకుంటావు కదా నాన్నా?” అని కలలో ఒకటే ఏడుపు వాడు. వాడు అడిగన ప్రశ్నలకి సమాదానం నా దగ్గర లేదు.
నాకప్పుడు మెలుకువ రాకపోయింటే ఇంకేమి అడిగే వాడో అని మనసులోనే అనుకుంటూ కూర్చొని పడుకొని ఉన్న వాడి దగ్గర శభ్దం వస్తే లెగిసిపోతాడేమోనని నెమ్మదిగా వాడి పక్కన నా తలపైకి లేపి గోడకి ఆనుకొని కూర్చున్నాను. అంతే వాడు సడన్‌గా భయపడి తల లేపి పుస్తకం చదువుతున్నాడు. ఎదురుగా నన్ను చూచి ఆశ్చర్యపోయాడు. ఏరా భయపడ్డావా అన్నాను. నా కళ్ళలోకి చూసి కళ్ళలో నీళ్ళు తిప్పుకున్నాడు. నా వైపు కొంచం దగ్గరగా జరిగి నా ఒడిలో తల పెట్టుకొని ఒకటే వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. మార్కులే జీవితం కాదని తెలుసుకున్న నేను, వాడికైతే అర్దం అయ్యేటట్టు చెప్పి ఓదార్చాను గాని, సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్న మా లాంటి తల్లిదండ్రులకు ఎవరు అర్దం అయ్యేటట్టు చెప్పి ఓదార్చుతారు.
మార్కులే జీవితం కాదనే చదువులు ఈ సమాజపు బడిలో కొత్త సిలబస్‌గా ఎవరు చేర్చుతారు. మార్కులు సరిగా రాకపోయినంత మాత్రాన బిడ్డ మన బిడ్డ కాదా అనే సత్యాన్ని పాఠ్యాంశంగా ఎవరు భోదిస్తారు.
– తిప్పాన హరి రెడ్డి,
94938 32412

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -