నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చందుపట్ల గ్రామంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బీఎస్సీ నాలుగో సంవత్సరం విద్యార్థులు సహకార సంఘం గోదాం ఆవరణలో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన నిర్వహించారు. ఈ ముఖ్యఅతిథిగా వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్ అసోసియేట్ డీన్ డాక్టర్ ఎన్ గోవర్ధన్ మాట్లాడుతూ రైతులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తారంగా వినియోగించాలన్నారు. తద్వార పెట్టుబడి తగ్గడమే కాకుండా అధిక దిగుబడులు, రాబడిని పొందవచ్చన్నారు. వ్యవసాయంలో ఆధునిక యంత్ర పరికరాల వినియోగం వల్ల ఖర్చు తగ్గడమే గాక సమయం వృధా కాదన్నారు. శ్రమ తక్కువగా ఉండి ఉత్పత్తి మరియు లాభం పెరుగుతుందన్నారు.
సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్.బి సునీత మాట్లాడుతూ సౌరశక్తి కంచెను (సోలార్ ఫెన్సింగ్)పంట చుట్టూ ఏర్పాటు చేయడం ద్వారా పంటలను కోతుల, అడవి పందుల బెడద నుండి పరిరక్షించుకోవచ్చా న్నారు. మొక్కల ఆరోగ్య నిర్వహణ విభాగం శాస్త్రవేత్త జ్యోతి పంట ఉత్పత్తులను గిడ్డంగుల్లో నిలువచేసి రుణాన్ని పొందే విధానాన్ని తెలిపారు.
రైతు సదస్సులో రైతుల సందేహాలను ప్రధాన శాస్త్రవేత్తలైన డా.డి.శ్రీలత, డా.బి.అనిల్ కుమార్ నివృత్తి చేశారు.జిల్లా అటవీ శాఖాధికారి పద్మజా రాణి,అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రేవతి రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
రైతు సదస్సుకు విచ్చేసిన శాస్త్రవేత్తలు, అధికారులు వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్ విద్యార్థినులు ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. అధిక సాంద్రత ప్రత్తి సాగు,సమీకృత వ్యవసాయం ,బిందు సేద్యము , జంటసాల్ల మొక్కజొన్న , వానపాముల ఎరువు తయారీ అంశాలపై విద్యార్థినిలు నమూనాలను ప్రదర్శించారు.ఈ సదస్సులో కోరమండల్ ఇంటర్నేషనల్ మేనేజర్ ప్రసాద్, ఇఫ్కో మేనేజర్ సాయికృష్ణ, రంగా ప్రవీణ్, రంగా కృష్ణయ్య లు వారి ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రమణారెడ్డి, యాక్షన్ ఎయిడ్ ఎన్.జి.ఓ మేనేజర్ డాక్టర్ ఇర్ఫాన్, బ్రహ్మకుమారి సంస్థ, బీబీనగర్ నుండి విచ్చేసిన గీతా, స్వాతి, అభ్యుదయ రైతులు జడల యషీల్ గౌడ్, డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, కంచి మల్లయ్య సిద్ధా రెడ్డి, కృష్ణా రెడ్డి, ముకుంద రెడ్డి, చందుపట్ల, తాజ్ పూర్, మోటకొండూర్, బొమ్మాయిపల్లి , ముత్తిరెడ్డిగూడెం, భువనగిరి గ్రామ రైతులు పాల్గొన్నారు.