నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రానికి ఆరవ డీజీపీగా నియమితులైన ఆయన, బుధవారం ఉదయం లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముందు ఆయన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పండితుల నుంచి ఆశీర్వచనం తీసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మాకు బలమైన జట్టు ఉంది. క్షేత్రస్థాయిలో సాంకేతికతను వినియోగించుకుంటాం. పోరాట మార్గం వీడేందుకు సిద్ధమని ఇటీవల నక్సల్స్ నేత లేఖ రాశారు. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని వారిని కోరుతున్నాం. మావోయిస్టుల సిద్ధాంతాలు ఆచరణలో విఫలమయ్యాయని భావిస్తున్నాం. లొంగిపోయిన వారికి అన్ని రకాలుగా అండగా ఉంటాం. రాష్ట్రంలో పోలీసుస్టేషన్ల సంఖ్య కంటే పోలీసుల్లో నైపుణ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. పోలీసు శాఖ ప్రత్యేక విభాగాల్లోని ఖాళీలను నిపుణులతో భర్తీ చేస్తాం’’ అని డీజీపీ తెలిపారు.