చలిగాలులు…దట్టమైన పొగమంచు
ఉత్తర భారతానికి ఐఎండీ హెచ్చరిక
తెలంగాణలోనూ తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ : దేశంలోని అనేక ప్రాంతాలలో శీతల వాతావరణం కన్పిస్తోంది. దీంతో భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) శనివారం హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని ఉత్తర, తూర్పు, మధ్య ప్రాంతాలలోని అనేక రాష్ట్రాలలో చలిగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని, పొగమంచు దట్టంగా కమ్ముకుంటుందని, ఫలితంగా ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. జార్ఖండ్, బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పగటి వేళలలో కూడా చలిగాలులు వీస్తాయి. ఉత్తరద్రేశ్‌లోని తూర్పు ప్రాంతాలలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. దట్టమైన పొగమంచు, మబ్బుల కారణంగా పగటి వేళ కూడా చల్లగా ఉంటుంది. తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్‌కు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్‌కు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు.
సబ్-హిమాలయన్ (హిమాలయ పర్వత శ్రేణికి సమీపంలో ఉన్న ప్రాంతం) పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిషా సహా ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిషా, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్‌లో దట్టమైన పొగమంచు అలముకుంటుంది. బీహార్, హర్యానా, చండీగఢ్, న్యూఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో రాత్రి వేళ, ఉదయం దట్టంగా పొగమంచు కన్పిస్తుంది. ఈ కారణంగా రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతున్నాయి. పిల్లలు, పెద్దలు చలికాలంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
న్యూఇయర్..బీ కేర్‌ఫుల్
- Advertisement -
- Advertisement -



