మానవ హక్కుల సంరక్షణే ప్రథమ కర్తవ్యం
రెండ్రోజుల్లో తెలంగాణలో 109 కేసుల పరిష్కారం
లగచర్ల, హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్‌పై ప్రభుత్వ వివరణ కోరాం :
జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ వి.రామసుబ్రమణియన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ)కు రాజకీయాలతో గానీ, రాజకీయ పార్టీలతో గానీ సంబంధం లేదనీ, మానవ హక్కుల సంరక్షణే తమ ప్రథమ కర్తవ్యమని జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ వి.రామసుబ్ర మణియన్ అన్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, సివిల్ సొసైటీ సభ్యులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కమిషన్ రెండు బెంచ్‌లుగా ఏర్పడి రెండు రోజుల పాటు ఓపెన్ హియరింగ్ నిర్వహించి పలువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు తెలంగాణలో నమోదైన 109 కేసులను పరిష్కరించినట్టు తెలిపారు. 9 కేసుల్లో కమిషన్ సిఫారసు చేసిన రూ.49.65 లక్షల పరిహారంలో రూ.22.50 లక్షలు ఇప్పటికే చెల్లించారనీ, మిగతా రూ. 27.15 లక్షలు చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించామని వెల్లడించారు. ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాల కారణంగా పిల్లల మరణం, నివాస ప్రాంతాల్లో వీధికుక్కల బెడద, పులుల దాడి కేసులు, గిరిజన మహిళల అక్రమ రవాణా, సామాజిక బహిష్కరణ, ప్రాథమిక సౌకర్యాల నిరాకరణ, మహిళలపై లైంగిక దాడులు, పోలీసు దౌర్జన్యాలు మొదలగు కేసులు తెలంగాణలో ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో 48 మంది విద్యార్థులు మరణించడంతో పాటు 886 ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలకు సంబంధించిన కేసుల్లో మొత్తం ఐదు గురుకుల పాఠశాలల కార్యదర్శులను నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. లగచర్లలో పోలీసుల లాఠీచార్జి, అరెస్ట్ కేసులో పర్యావరణ అనుమతితో పాటు ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి అన్ని పత్రాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించామన్నారు. డీఆర్‌డీవో రాకెట్ యూనిట్‌లో జరిగిన పేలుడులో నలుగురు వ్యక్తులు మరణించిన ఘటనలో నాలుగు కుటుంబాలకు మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించినట్టు తెలిపారు. హైదరాబాద్ నగరంలో కుక్కల బెడద పెరుగుతున్నట్టు ఐదో తరగతి విద్యార్థి సమర్పించిన కేసులో, వాటిని అరికట్టడానికి నివేదిక రూపొందించి కమిషన్‌కు సమర్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. గిరిజన మహిళల అక్రమ రవాణా కేసులో తప్పు చేసిన కానిస్టేబుల్‌ను సర్వీసు నుంచి తొలగించామని చెప్పారు. మహిళలు, పిల్లలు ఇతర వర్గాలు ఎదుర్కొంటున్న వివక్ష, దాడులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు, డీజీపీ జితెందర్‌తో పాటు సీనియర్ అధికారులు, ఎన్‌జీవోలు, సివిల్ సొసైటీలకు అవగాహన కల్పించినట్టు తెలిపారు. హక్కుల పరిరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. మానవ హక్కుల ఉల్లంఘనలపై తీసుకున్న చర్యల నివేదికను ఎప్పటికప్పుడు కమిషన్‌కు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
34,685 కేసులు పెండింగ్…
జాతీయ మానవ హక్కుల కమిషన్ వద్ద 34,685 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పారు. ఇందులో పోలీసుల దాడులకు సంబంధించిన కేసులు 285 వరకు ఉన్నాయన్నారు. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ వద్ద 780 పెండింగ్ కేసులున్నాయని తెలిపారు. ఇందులో నాలుగు పోలీస్ మరణాలు కాగా, 36 జ్యుడీషియల్ కస్టడీ కేసులని చెప్పారు. బాధితుల ఫిర్యాదుతో పాటు సోషల్ మీడియా, న్యూస్ పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగా 2021 నుంచి 2025 వరకు 305 ఫిర్యాదులను సుమోటోగా స్వీకరించినట్టు తెలిపారు. బీహార్‌లోని మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన బాలిక అపహరణ కేసును ఛేదించి మూడు రోజుల్లో వారి తల్లిదండ్రులకు అప్పగించినట్టు తెలిపారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కమిషన్ పని చేస్తోందని చెప్పారు. సమావేశంలో ఎన్‌హెచ్‌ఆర్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి, విజయ భారతి సయాని. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్, ఎన్‌హెచ్‌ఆర్సీ సెక్రెటరీ జనరల్ భరత్ లాల్, డైరెక్టర్ జనరల్ (దర్యాప్తు) ఆర్‌పీ.మీనా, రిజిస్ట్రార్ (లా) జోగిందర్ సింగ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
మానవ హక్కుల బలోపేతానికి కృషి :ఎన్‌హెచ్‌ఆర్‌సీకి సీఎస్ రామకృష్ణారావు వివరణ
రాష్ట్రంలో మానవ హక్కుల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎస్ కె.రామకృష్ణారావు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు వివరణ ఇచ్చారు. హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో మానవ హక్కులపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కమిషన్ చైర్మెన్ జస్టిస్ వి.రామసుబ్రమణియన్ సమీక్షించారు. హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి ఎలాంటి ఘటనలు జరిగినా సర్కార్ తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేస్తున్నదని సీఎస్ తెలిపారు. ప్రభుత్వ శాఖల వారీగా హక్కుల ఉల్లంఘన జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తెలంగాణ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్త, అదనపు డీజీపీ చారుసిన్హా, మహిళా శిశుసంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనితా రామచంద్రన్, ప్రధాన అటవీ సంరక్షణాధికారి సి.సువర్ణ, ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కె.శిథిజా, పాఠశాల విద్యా కమిషనర్ నవీన్ నికోలస్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి తమ విభాగాలకు సంబంధించి కమిషన్ అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చారు. సమావేశంలో ఎన్‌హెచ్‌ఆర్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి, విజయ భారతి సయాని. సెక్రెటరీ జనరల్ భరత్ లాల్, డైరెక్టర్ జనరల్ (దర్యాప్తు) ఆర్‌పీ.మీనా, రిజిస్ట్రార్ (లా) జోగిందర్ సింగ్, ఇంద్రజీత్, డా. ముఖేష్, ఎస్‌ఎస్‌పీ (ఇన్వెస్టిగేషన్) ఇలక్కియా కరుణాగరన్ తదితరులు హాజరయ్యారు.
రాజకీయాలకతీతంగా ఎన్హెచ్ఆర్సీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES