Wednesday, October 1, 2025
E-PAPER
Homeజాతీయంతొమ్మిది మంది వలస కార్మికులు మృతి

తొమ్మిది మంది వలస కార్మికులు మృతి

- Advertisement -

ఎన్నూర్‌ ఎస్‌ఈజెడ్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణ స్థలంలో ప్రమాదం

చెన్నై : తమిళనాడు పొన్నేరి సమీపంలోని ఎన్నూర్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (ఎస్‌ఈజెడ్‌) థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లోని నిర్మాణ స్థలంలో జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది వలస కార్మికులు మృతి చెందారు. మంగళవారం పవర్‌ ప్రాజెక్ట్‌లోని నిర్మాణ స్థలంలో స్కాఫోల్డింగ్‌ కూలిపోవడంతో అసోంకు చెందిన తొమ్మిది మంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. 1,320-మెగావాట్ల ఎన్నూర్‌ ఎస్‌ఈజెడ్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్ల కోసం కాంక్రీట్‌ ఆర్చ్‌ నిర్మిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఆవడి పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఆర్చ్‌ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఇనుప స్కాఫోల్డింగ్‌ కూలిపోయినప్పుడు వారు 20 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో పనిచేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.తోటి కార్మికులు వెంటనే గాయపడిన వారిని రక్షించటానికి సత్వరమే ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు.

అయితే వారిలో తొమ్మిది మంది మార్గమధ్యలోనే మరణించారు. గాయపడిన ఒక కార్మికుడు ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై కాత్తూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన తొమ్మిది మందిలో మున్నకెంప్రాల్‌, విద్యామ్‌ ప్రవోత్షా, సుమోన్‌ కరికాప్‌, దీపక్‌ రైజియుంగ్‌, సర్బోనిట్‌ థౌసేన్‌, ప్రాంటో సోరోంగ్‌, పబన్‌ సోరోంగ్‌, ఫైబిట్‌ ఫోంగ్లో, బిమరాజ్‌ థౌసేన్‌లుగా గుర్తించారు.వీరందరూ అసోం నుంచి పోట్టకూటికోసం వచ్చిన వలస కార్మికులే కావటం విశేషం. తమ వాళ్లను కోల్పోయామని తెలిసిన వెంటనే కుటుంబసభ్యులు రోదనలతో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.తమిళనాడు విద్యుత్‌ పంపిణీ సంస్థ చైర్మెన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జె. రాధాకృష్ణన్‌, సీనియర్‌ విద్యుత్‌ అధికారులతో కలిసి చికిత్సపోందుతున్న క్షతగాత్రుడ్ని పరామర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -