ఉన్నత విద్యామండలి చైర్మెన్, ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ర్యాంకింగ్ ప్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్) వంటి జాతీయ ర్యాంకింగ్ వ్యవస్థలు విశ్వవిద్యాలయాలకు నిధుల లభ్యత, అక్రిడిటేషన్ ఫలితాలు, మొత్తం విద్యా నాణ్యత పెంపులో కీలక పాత్ర పోషిస్తాయని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మెన్, ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఎన్‌ఐఆర్‌ఎఫ్‌పై ఒక్కరోజు వర్క్‌షాపు నిర్వహించారు. అందులో రాష్ట్రంలోని 16 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నుంచి 50 మంది ఎన్‌ఐఆర్‌ఎఫ్ కోఆర్డినేటర్లు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. దాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ…తెలంగాణలోని కేంద్ర సంస్థలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు చురుకుగా ర్యాంకింగ్స్‌లో పాల్గొంటున్నాయని తెలిపారు. బోధనాభ్యాస విధానాలు, సమానత్వం, విస్తరణ కార్యక్రమాల్లో రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఉన్న బలాలను ప్రశంసించారు. పరిశోధన, సైటేషన్లు, పేటెంట్లు, నిధులు పొందిన ప్రాజెక్టులు, అకడమిక్ ప్రతిష్టను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ను కేవలం మూల్యాంకన సాధనంగా కాకుండా తెలంగాణ ఉన్నత విద్యకు దీర్ఘకాలిక, వ్యూహాత్మక అభివృద్ధికి మార్గదర్శకంగా చూడాలని సూచించారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ ప్రొఫెసర్ ఈ.పురుషోత్తం మాట్లాడుతూ.. ర్యాంకింగ్స్ విశ్వవిద్యాలయాల అభివృద్ధిపై చూపే ప్రభావంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్, కన్సల్టెంట్ అడ్వైజర్ డాక్టర్ కె.వీరాంజనేయులు మాట్లాడుతూ..ఉన్నత ప్రమాణాల జర్నల్స్‌లో పరిశోధనా ప్రచురణలు, పరిశోధన వాతావరణం బలోపేతం, అంతర్జాతీయ సహకారాలు వంటి అంశాలపై పలు సూచనలు చేశారు.ఇనిస్టిట్యూట్ ఆఫ్ అకడమిక్ ఎక్సలెన్స్ డైరెక్టర్ కె.వెంకటేశ్ మాట్లాడుతూ..ఎన్‌ఐఆర్‌ఎఫ్ ప్రేమ్‌వర్క్, డేటా మేనేజ్‌మెంట్‌పై ప్రజెంటేషన్ ఇచ్చారు. డేటా అప్‌లోడ్‌లో పాటించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ప్రతినిధులకు ధ్రువపత్రాలను బాలకిష్టారెడ్డి అందజేశారు.
విద్యా నాణ్యత పెంపులో ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ది కీలక పాత్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



