అమెరికా కోర్టు రూలింగ్
వాషింగ్టన్ : అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం బాండ్ లేకుండా వలసదారుల నిర్బంధాన్ని కొనసాగించవచ్చునని ఐదవ సర్క్యూట్ కోర్డ్ ఆఫ్ అప్పీల్స్‌లోని ప్యానల్ న్యాయమూర్తులు రూలింగ్ ఇచ్చారు. ఇమ్మిగ్రేషన్ బాండ్ అంటే… అక్రమ వలసదారుల పేరుతో అమెరికా అధికారులు విదేశీయులను అదుపులోకి తీసు కుంటున్న విషయం తెలిసిందే. అయితే విచారణకు హాజరవుతామని హామీ ఇస్తే తాత్కాలికంగా వారిని విడుదల చేస్తారు. ఇందు కోసం కొంత మొత్తాన్ని పూచీకత్తుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఒక రకమైన బెయిల్ వంటిది. విచారణ కాలంలో వలసదారులు సక్రమంగా హాజరైతే అది ముగిసిన తర్వాత వారికి బాండ్ సొమ్ము వాపసు చేస్తారు.
ఒకవేళ కోర్టుకు హాజరు కాకపోయినా లేదా నిబంధనలను పాటించకపోయినా బాండ్ సొమ్మును జప్తు చేస్తారు. దేశవ్యాప్తంగా అరెస్టయిన వలసదారుల బాండ్ విచారణలను నిరాకరించాలని హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం నిర్ణయించింది. దీనిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్యానల్ న్యాయమూర్తులు శుక్రవారం తోసిపుచ్చారు. హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగానికి, ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టానికి అనుగుణంగానే ఉన్నదని తీర్పు చెప్పారు. దీని ప్రకారం… వలసదారులు ఎంత కాలం అమెరికాలో నివసిస్తున్నారన్న దానితో నిమిత్తం లేకుండా బాండ్‌పై విడుదల చేసేందుకు అనుమతించరు.
కేసు పూర్వాపరాలు
మెక్సికోకు చెందిన ఇద్దరు వ్యక్తులు అమెరికాలో పది సంవత్సరాలకు పైగా నివసిస్తున్నారు. వారిపై ఎలాంటి తీవ్రమైన కేసులు లేవు. క్రిమినల్ రికార్డు కూడా లేదు. అయినప్పటికీ వారిద్దరినీ గత సంవత్సరం కొన్ని నెలల పాటు జైలులో నిర్బంధించారు. చివరికి టెక్సాస్ కోర్టు వారికి బాండ్ బెయిల్ మంజూరు చేసింది. గతంలో అమెరికాను పాలించిన డెమొక్రాట్, రిపబ్లికన్ ప్రభుత్వాలు 30 సంవత్సరాల పాటు బాండ్ విధానాన్ని అమలు చేశాయి. అయితే ట్రంప్ ప్రభుత్వం దీనిని అటకెక్కించింది. గత జులైలో వలసదారుల నిర్బంధాన్ని తప్పనిసరి చేసింది. కాలిఫోర్నియాలోని జిల్లా కోర్టు గత నవంబరులో దీనిని కొట్టివేసింది. అయితే తాజాగా 2-1 మెజారిటీతో అప్పీల్స్ కోర్టు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది.



