జనజీవనస్రవంతిలో కలవండి
తెలంగాణ గడ్డపై హింసకు తావులేదు
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కండి : మావోయిస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
శాంతియుత మార్గమే మన విధానం
ఆయుధాలతో సహా సీఎం సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మావోయిస్టులు అజ్ఞాతం వీడి, జనజీవనస్రవంతిలో కలిసి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మావోయిస్టులకు పిలుపునిచ్చారు. తెలంగాణ గడ్డపై హింసకు ఎలాంటి తావులేదని చెప్పారు. హింసాత్మక చర్యల ద్వారా ఏమీ సాధించలేమన్నారు. బుల్లెట్ ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారానే సమస్యలకు పరిష్కారముందని స్పష్టం చేశారు. శాంతియుత మార్గమే మన విధానమని తెలిపారు. ఇప్పటికైనా అజ్ఞాతంలో ఉన్న ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతితో సహా మిగతా మావోయిస్టులందరూ జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డీజీపీ శివధర్‌రెడ్డి, ఎస్‌ఐబీ ఐజీ సుమతి, గ్రేహౌండ్స్ ఏడీజీ అనిల్‌కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయకుమార్‌తోపాటు పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో 130 మంది మావోయిస్టులు, తమ ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఈ సందర్భంగా మావోయిస్టులు సరెండర్ చేసిన 123 ఆయుధాలను సీఎం పరిశీలించారు. ఒక్కొక్కరికి రూ. 25వేల చొప్పున చెక్కులు అందజేశారు. అనంతరం లొంగిపోయిన మావోయిస్టులనుద్దేశించి మాట్లాడుతూ భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయేలా పోలీసులు కృషి చేశారని అభినందించారు. లొంగిపోయిన మావోయిస్టులు మంచి జీవితం గడిపేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసురావాలని సూచించారు. మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ, ఆయన మిత్రబృందం కొన్ని ప్రతిపాదనలను తన ముందు ఉంచిందన్నారు. తమ సమస్యలు పరిష్కరిస్తే లొంగిపోతామని చెప్పారనీ, దానికి ప్రభుత్వపరంగా ఏం చేయాలో అన్నీ చేస్తామన్నారు. మావోయిస్టు నేతల డిమాండ్లను కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించినట్టు ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. లొంగిపోయిన వారి మెరుగైన జీవితానికి హామీ ఇవ్వాలని అమిత్ షా సూచిం చారు. ఆయనతో చర్చల తర్వాత మావోయిస్టు నేతలతో మళ్లీ చర్చించామన్నారు. ఆ ఫలితంగానే ఒకేసారి 130 మంది మావోయిస్టులు లొంగిపోయారని గుర్తు చేశారు. అహింసా పద్ధతిలోనే బ్రిటీషర్లపై పోరాడి స్వాతంత్య్రం తెచ్చుకున్న చరిత్ర మనకు ఉందన్నారు. హింస, ఆయుధాలతో పోరాటం ఒక్కటే సమస్యలకు పరిష్కారం కాదన్నారు. అణ్వాయుధాలు ఉన్న దేశాలు కూడా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటున్నాయని గుర్తు చేశారు. ఒకేసారి ఇంతమంది మావోయిస్టులు ఏ రాష్ట్రంలోనూ లొంగిపోలేదన్నారు.
కేసుల తీవ్రతను బట్టి ఎత్తివేస్తాం
మావోయిస్టులపై నమోదై…రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేసులను ఎత్తివేసే అవకాశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. తీవ్రమైన నేరాలు ఉంటే ప్రభుత్వాలు ఎత్తివేసినా.. కోర్టులు ఊరుకోబోవన్నారు. వ్యక్తులు, వారిపై ఉన్న నేరాల తీవ్రతను బట్టి పరిశీలిస్తామని చెప్పారు. లొంగిపోయిన వాళ్లు రాజకీయాల్లోకి వస్తామంటే తాము స్వాగతిస్తామన్నారు. కొందరు ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చి.. ప్రజాప్రతినిధులు అయ్యారని గుర్తు చేశారు. సీతక్క లాంటి నాయకులు రాష్ట్ర మంత్రి కూడా అయ్యారని తెలిపారు. సెంట్రల్, స్టేట్ కమిటీలో ఉన్నవాళ్లు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని సూచించారు. అందరూ కలిసి వస్తే, తెలంగాణను పునర్నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. గూడేలు, తండాల్లో ఉన్న వారి మెరుగైన జీవితానికి కృషి చేస్తామన్నారు. ఆదివాసీ, గిరిజనుల ఆర్థిక స్థోమత పెరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్‌లోకి వచ్చే వాళ్లు పీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ను గాంధీభవన్‌లో కలవాలని సూచించారు.
సాయం చేస్తాం-సీఎం
స్వగ్రామాల్లో ఇల్లు కట్టుకునే మావోయిస్టులకు సర్కారు సాయం చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి మావోయిస్టులకు హామీ ఇచ్చారు. మెరుగైన పరిహారం, ఆరోగ్యకార్డులు కల్పించడంతోపాటు నిమ్స్‌లో ఉచిత చికిత్స అందిస్తామన్నారు. ఇంటిస్థలం, ఇంటి నిర్మాణానికి సాయం చేస్తామన్నారు. మూడెకరాల వ్యవసాయ భూమి ఇచ్చే అంశంపై సమీక్షిస్తామన్నారు. రివార్డు సొమ్మును పెంచే అంశంపై చర్చించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కమిటీ నిర్ణయంమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఇప్పటి వరకు 721 మంది మావోయిస్టులు లొంగిపోయి 250 ఆయుధాలను సరెండర్ చేశారని తెలిపారు. డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ మావోయిస్టులు లొంగిపోవడంలో ఎస్‌ఐబీ, ఇంటెలిజెన్స్ వర్గాలు త్రికరణశుద్దితో పని చేశాయని అభినందించారు. సీఎం రేవంత్‌రెడ్డి పిలుపుమేరకు వారు స్పందించారని తెలిపారు. వారి క్షేమం, భద్రత, ఆరోగ్య విషయాలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఛత్తీస్‌గడ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు సొంతూర్లకు పోతామంటే పంపిస్తామన్నారు.
సీఎంకు మీడియా ప్రశ్నలు
-మావోయిస్టులపై నిషేధం ఎత్తేస్తారా?
సీఎం – ప్రస్తుతం వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమయంలో నిషేధం ఎత్తివేయాలనే చర్చకు తావు లేదు.
-తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు లొంగిపోతున్నారు?
-రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ది, నిబద్ధత, విశ్వాసం వంటి కారణాలతోనే మావోయిస్టులు ఇక్కడ లొంగిపోతున్నారు. అంత మాత్రానా ఇతర రాష్ట్రాల్లో లొంగిపోవడం లేదనేది కాదు. వేరే రాష్ట్రాల్లోనూ లొంగిపోతున్నారు.
-గాదె ఇన్నయ్య, వరవరరావుపై కేసులు ఎత్తివేస్తారా? అన్న ప్రశ్నకు సీఎం సానుకూలంగా స్పందించారు.
-మావోయిస్టుల రాజకీయ ప్రవేశానికి అవకాశం ఉందా?
-వ్యక్తిగత స్వేచ్చ వారికి ఉంది. ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. చట్ట పరిధి లో పని చేయవచ్చు. ఏ పార్టీలోనైనా చేరవచ్చు. కాంగ్రెస్‌లో చేరాలనుకుంటే, గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ను కలవొచ్చు.
-మావోయిస్టులు లొంగిపోయేందుకు మార్చి 31 గడువు అని కేంద్రం ప్రకటించింది కదా? దాన్ని పొడిగించమని కేంద్రాన్ని కోరతారా?
-ఆ విషయం మా పరిధిలో లేదు. కేంద్ర ప్రభుత్వాన్నే అడగండి.
-మావోయిస్టుల మూలంగా చనిపోయిన కుటుంబాలకు భరోసా ఇస్తారా?
-ఆ సమయంలో నిబంధనల ప్రకారం పరిహారం ఇచ్చారు. స్వాతంత్య్రం కోసం ఎంతో మంది చనిపోయారు. 1993 సరెండర్ పాలసీ ప్రకారం పరిహారం ఇస్తున్నాం. దాన్ని పెంచే అంశాన్ని పరిశీలిస్తాం.
బుల్లెట్ వద్దు..బ్యాలెట్ ముద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



