Wednesday, February 11, 2026
E-PAPER
Homeజాతీయంలోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం

- Advertisement -

– 118 మంది ఎంపీల ప్రతిపాదన తీర్మాన నోటీసు ఇచ్చిన ప్రతిపక్షాలు
– స్పీకర్‌ ఓం బిర్లా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు
– సంతకం చేయని తృణమూల్‌ కాంగ్రెస్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చాయి. స్పీకర్‌ పక్షపాతంగా ప్రవర్తిస్తు న్నారని, ప్రతిపక్షాలకు అవకాశాలు ఇవ్వడం లేదని ఈ నోటీసులో పేర్కొన్నారు. కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు, డీఎంకే, ఎస్పీ, ఆర్జేడీ వంటి ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు చెందిన 118 మంది ఎంపీలు ఈ తీర్మానంపై సంతకం చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ సంతకం చేయలేదు. మంగళవారం పార్ల మెంటులో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే చాంబర్‌లో జరిగిన ప్రతిపక్ష పార్టీ నాయకుల సమావేశంలో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిం చాలనే నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్‌ పట్ల తమకు వ్యక్తిగతంగా ఎంతో గౌరవం ఉందని, అయితే ప్రతిపక్ష సభ్యులకు నిరం తరం అవ కాశాలు నిరాకరించడం పట్ల తాము చాలా బాధపడ్డామని తీర్మానంలో పేర్కొన్నారు.

ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఈ తీర్మానంపై సంతకం చేయలేదు. లోక్‌సభ స్పీకర్‌కు వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 94సీ కిందకు తీసుకువస్తారు. దీని ప్రకారం, ఏ ఎంపీ అయినా స్పీకర్‌కు వ్యతిరేకంగా నోటీసు ఇవ్వవచ్చు. సభ పరిశీలన దశలో యాభై మంది ఎంపీలు తీర్మానానికి మద్దతు ఇవ్వాలి. వివరణాత్మక చర్చ తర్వాత, తీర్మానంపై ఓటింగ్‌ జరుగుతుంది. మెజారిటీ ఎంపీలు తీర్మానానికి మద్దతు ఇస్తే, స్పీకర్‌ను బహిష్కరిస్తారు. తీర్మాన పరిశీలన సమయం లో డిప్యూటీ స్పీకర్‌ సభను నియంత్రించాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌ లేనందున, స్పీకర్ల ప్యానెల్‌ నుంచి ఎవరైనా సభా కార్యకలాపాలను నియంత్రిస్తారు. నోటీసు ఇచ్చిన 20 రోజుల తర్వాత సభ దానిని పరిశీలిస్తుంది. అందువల్ల, బడ్జెట్‌ సెషన్‌ రెండో దశలో ఈ తీర్మానాన్ని చర్చిస్తారు.

ఇవీ కారణాలు
– బీజేపీ సభ్యుడు నిషికాంత్‌ దూబేకు నెహ్రూ, ఇందిరా గాంధీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడానికి అవకాశం ఇచ్చారు. ప్రతిపక్షం అభ్యర్థించి నప్పటికీ, దూబేపై ఎలాంటి చర్య తీసుకోలేదు.

– సభలో నిరసన తెలిపినందుకు ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను అన్యాయంగా సస్పెండ్‌ చేశారు.


– ప్రతిపక్ష మహిళా ఎంపీలు ప్రధానమంత్రిపై దాడి చేయాలని ప్లాన్‌ చేశారని స్పీకర్‌ సభలో అవాస్తవ ప్రకటన చేశారు.


– లోక్‌సభలో మాట్లాడటానికి ప్రతిపక్ష నాయకుడికి అనుమతి నిరాకరణ.


ఓం బిర్లా కీలక నిర్ణయం
తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యే వరకు లోక్‌సభకు దూరంగా ఉండాలని ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్‌ పదవి నుంచి తొలగింపజేసేలా తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌కు ప్రతిపక్షాలు నోటీసు ఇవ్వటంతో ఆయన పై విధంగా స్పందించారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -