నదీ జలాలపై కూర్చొని మాట్లాడుకుందాం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
ఫార్మా రంగంలో తెలంగాణ నెంబర్ వన్
బల్క్ డ్రగ్స్ తయారీ 40 శాతం తెలంగాణలోనే
జర్మన్ టెక్నాలజీతో ఐవీ ఫ్లూయిడ్స్
రంగారెడ్డి జిల్లా ఈ-సిటీలో సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ ప్రారంభం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
నదీజలాల విషయంలో పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నదీ జలాలకు సంబంధించి పంచాయతీ కావాలా..! నీళ్లు కావాలా..! అని అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని కోరుకుంటామని చెప్పారు. కృష్ణా జలాల విషయంపై కూర్చొని మాట్లాడుకుందామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించొద్దని కోరారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల్‌లోని ఈ-సిటీలో నెలకొల్పిన సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉండకూడదనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు.
నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ది పొందాలన్న ఆలోచన కాంగ్రెస్‌కు లేదన్నారు. రాజకీయాలకతీతంగా పరిష్కారం కోసం అందరూ సహకరించాలని ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. మన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్టు ప్రకటించారు. ”పక్క రాష్ట్రాలతో తెలంగాణ వివాదాలను కోరుకోవడం లేదు. న్యాయస్థానాల ముందుకు లేదా మరెవరి వద్దనో పంచాయితీ పెట్టుకునే కన్నా కూర్చొని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి” అని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి, ఎస్‌ఎల్బీసీ, బీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాల వల్ల పర్యావరణం, సీడబ్ల్యూసీ నుంచి సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు, అనుమతులు కూడా రావడం లేదని, తద్వారా రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని చెప్పారు. రాజకీయ ప్రయోజనా లకన్నా ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచి స్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పోర్టు కనెక్టివిటీ లేని తెలంగాణకు మచిలీపట్నం పోర్టుతో కనెక్టివిటీ కోసం 12 లైన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే, రైల్వే కనెక్టివిటీతో సహా అనుమతి అడిగామని, ఆ కనెక్టివిటీని అభివృద్ధి చేయాలంటే పక్క రాష్ట్రం సహకారం అవసరమని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలంటే తెలంగాణ సహకారం అవసరం ఉంటుందని, పరస్పరం సహకరించుకుంటేనే సమస్యలు పరిష్కారమవు తాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలతో పరస్పర సహకారాన్ని మాత్రమే కోరుకుంటున్నామని చెప్పారు.
తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ మూడు భాగాలుగా అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశిస్తూ గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశామని వివరించారు. ఇందులో భాగంగా సుజెన్ మెడికేర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రపంచంలో జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూయార్క్‌తో పోటీ పడాలని సంకల్పించామని, అందులో భాగంగానే యువ పారిశ్రామిక వేత్తలు ప్రారంభించే పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఫార్మా రంగంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోందని, బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి దేశంలో తెలంగాణ నుంచి 40 శాతం ఉందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. జర్మన్ టెక్నాలజీతో దక్షిణ భారత దేశంలోనే ఐవీ ఫ్లూయిడ్స్ తయారీలో గొప్ప సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రపంచమే మనవైపు చూసేలా ఫార్మా రంగంలో రాణిస్తున్నామన్నారు.
1995 నుంచి 2025 వరకు 30 ఏండ్ల నిరంతర శ్రమ వల్ల హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడుతోందని ముఖ్యమంత్రి చెప్పారు. మన దగ్గర చదువుకుని వెళ్లిన వారు గ్లోబల్ కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ప్రయివేట్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ వల్ల ఇక్కడి భూముల ధరలు పెరుగుతాయని, అభివృద్ధికి అందరూ సహకరించాలని, సహకారం ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.



