కొన్ని సభ్యదేశాలు భాగస్వాములుగా ఉండడమే కారణం : విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ : ఇరాన్ యుద్ధంపై బ్రిక్స్ ఏకాభిప్రాయం సాధించలేకపోయింది. సంయుక్త ప్రకటనను విడుదల చేయడంలో విఫలమైంది. కొన్ని సభ్యదేశాలు యుద్ధంలో భాగస్వాములైనందునే బ్రిక్స్ ఉమ్మడి వైఖరిని తీసుకోలేకపోయిందని విదేశాంగశాఖ తెలిపింది. అయినప్పటికీ సభ్య దేశాలతో సంప్రదింపులు జరుపుతామని చెప్పింది. ‘కొన్ని సభ్య దేశాలు పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిలో భాగస్వాములుగా ఉన్నాయి. అందుకే ప్రస్తుత ఘర్షణపై అవి ఒక ఉమ్మడి వైఖరిని తీసుకోలేకపోతున్నాయి.
బ్రిక్స్‌కు అధ్యక్షత వహిస్తున్న దేశంగా షెర్పా ఛానల్ ద్వారా సభ్య దేశాలతో భారత్ చర్చలు జరుపుతోంది’ అని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శనివారం విలేకరులకు తెలియజేశారు. యుద్ధంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధమున్న ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలు బ్రిక్స్‌లో అదనపు సభ్యులుగా కొనసాగుతున్నాయి. ఈ నెల 12న బ్రిక్స్ షెర్పా సమావేశం వర్చువల్‌గా జరిగినప్పటికీ వేర్వేరు వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్న కారణంగా సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. భారత్ అధ్యక్షత వహిస్తున్న బ్రిక్స్ ప్రస్తుత ఘర్షణపై సంయుక్త ప్రకటనను విడుదల చేయలేకపోయింది.



