Friday, February 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనెతన్యాహూతో నిర్ణయాత్మక ఒప్పందం కుదరలేదు

నెతన్యాహూతో నిర్ణయాత్మక ఒప్పందం కుదరలేదు

- Advertisement -

ఇరాన్‌తో చర్చలు కొనసాగుతాయి : ట్రంప్‌
వాషింగ్టన్‌లో ఇరువురు నేతల భేటీ


వాషింగ్టన్‌ : ఇరాన్‌ విషయంలో ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూతో సుమారు మూడు గంటల పాటు చర్చించానని, అయితే నిర్ణయాత్మక ఒప్పందమేదీ కుదరలేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. అయినప్పటికీ ఒప్పందానికి వచ్చేలా ఇరాన్‌తో సంప్రదింపులు కొనసాగిస్తామని ఆయన చెప్పారు. ఇరువురు నేతలు వాషింగ్టన్‌లో ముఖాముఖి చర్చలు జరిపారు. గత ఏడాది ట్రంప్‌ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత నెతన్యాహూతో భేటీ కావడం ఇది ఏడోసారి. సమావేశం తర్వాత ప్రధాన నిర్ణయాలు వెలువడతాయని అందరూ ఆశించినప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదని ట్రంప్‌ అన్నారు. ‘ఒప్పందం పూర్తయినా కాకపోయినా ఇరాన్‌తో చర్చలు కొనసాగించాలని నేను నొక్కి చెప్పాను.

అంతకుమించి ఈ సమావేశంలో సాధించిందేమీ లేదు’ అని తెలిపారు. తన వైఖరిని నెతన్యాహూ సమర్ధించిందీ లేనిదీ ఆయన వెల్లడించలేదు. ‘పోయినసారి ఒప్పందానికి ఇరాన్‌ విముఖత ప్రదర్శించింది. ఫలితంగా అర్థరాత్రి సమయంలో దాడిని చవిచూసింది. ఇప్పుడు వారు సహేతుకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నా. గాజాలోనూ, మధ్యప్రాచ్యంలోనూ సాధించిన పురోగతిపై ఇద్దరం చర్చించాం. ఆ ప్రాంతంలో ఇప్పుడు శాంతి నెలకొంది’ అని ట్రంప్‌ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌తో వివరించారు. కాగా అణు కార్యక్రమానికి మించి ఇరాన్‌తో విస్తృత స్థాయిలో చర్చలు జరపాలని ట్రంప్‌పై నెతన్యాహూ ఒత్తిడి తెస్తారని అందరూ భావించారు. అయితే ట్రంప్‌ తన డిమాండ్లను అంగీకరించిందీ లేనిదీ నెతన్యాహూ చెప్పలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -