Tuesday, September 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజాతీయ రహదారుల నిర్మాణంపై జాప్యం వద్దు

జాతీయ రహదారుల నిర్మాణంపై జాప్యం వద్దు

- Advertisement -

త్వరగా భూసేకరణ, పరిహారం పూర్తిచేయండి
అభివృద్ది కేంద్రంగా గ్రీన్‌ఫీల్డ్‌ హైవే
అటవీ భూములకు ప్రత్యామ్నాయం కల్పిస్తాం
అనుమతుల కోసం త్వరలో కేంద్ర మంత్రులతో భేటీ : సమీక్షా సమావేశంలో సీఎం ఏ రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి భూ సేకరణ, పరిహారం పంపిణీలో జాప్యం చేయకుండా, నిర్దేశిత సమయంలోనే పూర్తిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), జాతీయ రహదారుల విభాగం (ఎన్‌హెచ్‌), జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్‌), రహదారులు, భవనాల శాఖ, అటవీ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ రహదారుల కు నెంబర్ల కేటాయింపు విషయంలో సూత్రప్రాయ అంగీకారం తెలుపుతున్నా, ఆ తర్వాత ప్రక్రియలో ఆలస్యంపై ఆరా తీశారు. రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర నిర్మాణానికి సంబంధించి కేంద్రం లేవనెత్తిన ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తున్నా, మళ్లీ కొత్త సమస్యలు ఎందుకు లేవనెత్తుతున్నారంటూ ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను సీఎం ప్రశ్నించారు.

త్రిబుల్‌ ఆర్‌ను నార్త్‌, సౌత్‌ ప్రాజెక్టులుగా చూడొద్దనీ, ఏకకాలంలో రెండింటి పనులు ప్రారంభమయ్యేలా సహకరించాలని కోరారు. దానికి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సౌత్‌ అలైన్‌మెంట్‌కు వెంటనే ఆమోదముద్ర వేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా భారత్‌ ఫ్యూచర్‌ సిటీ-అమరావతి-మచిలీపట్నం 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు వెంటనే అనుమతులివ్వాలనీ, తాము అక్కడ డ్రైపోర్ట్‌, లాజిస్టిక్‌, ఇండిస్టియల్‌ పార్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రీన్‌ఫీల్డ్‌ హైవేతో రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య 70 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు, సరుకు రవాణా సులభతరం అవుతుందన్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు సమాంతరంగా రైలు మార్గం అడుగుతున్నామనీ, బెంగుళూర్‌-శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌-అమరావతి మధ్య రైలు మార్గం అవసరమనీ, వందేభారత్‌ సహా ఇతర రైళ్ల రాకపోకలకు అనువుగా ఉంటుందనీ, లాభసాటి మార్గమని సీఎం వివరించారు.

హైదరాబాద్‌-శ్రీశైలం మార్గంలో రావిర్యాల- మన్ననూర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌కు ఎన్‌హెచ్‌ఏఐ వెంటనే అనుమతులివ్వాలని కోరారు. శ్రీశైలం దేవస్థానం, శ్రీశైలం రిజర్వాయర్‌, టైగర్‌ ఫారెస్ట్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు రాకపోకలు సాగిస్తారని తెలిపారు. హైదరాబాద్‌-మన్నెగూడ రహదారిలో మర్రి చెట్ల తొలగింపునకు సంబంధించి ఎన్జీటీలో ఉన్న కేసు పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు. హైదరాబాద్‌-మంచిర్యాల-నాగ్‌పూర్‌ నూతన రహదారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమర్పించిన ప్రతిపాదనలను అంగీకరించాలని చెప్పారు. మంచిర్యాల-వరంగల్‌-ఖమ్మం-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-163జి), ఆర్మూర్‌-జగిత్యాల-మంచిర్యాల (ఎన్‌హెచ్‌-63), జగిత్యాల-కరీంనగర్‌ (ఎన్‌హెచ్‌-563), మహబూబ్‌నగర్‌-మరికల్‌-దియోసు గూర్‌ (ఎన్‌హెచ్‌-167) రహదారులకు సంబంధించి భూ సేకరణ, పరిహారం పంపిణీలో జాప్యంపై ఆయా జిల్లాల కలెక్టర్లను వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

జిల్లాల్లోని కేసులన్నింటిపై నివేదిక రూపొందించి వారంలోపు అడ్వకేట్‌ జనరల్‌తో చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు. పరిహారం పంపిణీలో ఆలస్యంపై సీఎం ప్రశ్నించగా సీఏఎల్‌ఏ(కాలా) నుంచి నిధుల విడుదలలో జాప్యం ఉందని కలెక్టర్లు వివరించారు. ఈ విషయమై ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు స్పందిస్తూ జాబితాలు అప్‌లోడ్‌ అయిన వెంటనే నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. భూసేకరణ, పరిహారం పంపిణీని అక్టోబరు నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో అలసత్వం చూపే కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లపై వేటు వేస్తామని హెచ్చరించారు. జాతీయ రహదారుల నిర్మాణంలో అటవీ, పర్యావరణ శాఖ పెడుతున్న కొర్రీలపైనా సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్షించారు. 2002 నుంచి 2022 వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అటవీ, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారనీ, అందుకే ప్రస్తుతం అనుమతులు ఇవ్వడం లేదని ఫారెస్ట్‌ సౌత్‌ రీజియన్‌ ఐజీ త్రినాధ్‌ కుమార్‌ తెలిపారు.

దానిపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలు సమర్పించాలని సీఎస్‌ను ఆదేశించారు. అటవీ భూములకు ప్రత్యామ్నాయ భూములు కేటాయిస్తామన్నారు. దీనిపై జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌లతో తానే స్వయంగా భేటీ అవుతానని తెలిపారు. నాన్‌ వైల్డ్‌ లైఫ్‌ ఏరియాల్లో వైల్డ్‌ లైఫ్‌ మిటిగేషన్‌ ప్లాన్‌కి అవసరమయ్యే వ్యయం భరించేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీలు వి.శేషాద్రి, కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వినరు కుమార్‌ రజావత్‌, ఎన్‌హెచ్‌ఏఐ సభ్యులు (ప్రాజెక్ట్స్‌) అనిల్‌ చౌదరి, మోర్త్‌ రీజినల్‌ ఆఫీసర్‌ కృష్ణ ప్రసాద్‌, ఎన్‌హెచ్‌ఏఐ రీజినల్‌ ఆఫీసర్‌ శివశంకర్‌, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్‌ నదీం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -