Tuesday, March 31, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంప్రత్యక్ష చర్చల్లేవ్‌..

ప్రత్యక్ష చర్చల్లేవ్‌..

- Advertisement -

అమెరికావి అసంబద్ధమైన డిమాండ్లు స్పష్టం చేసిన ఇరాన్‌
పశ్చిమాసియాలో భీకర దాడులు..భయానక వాతావరణం
ఇరాన్‌ దాడిలో కువైట్‌ విద్యుత్‌ కేంద్రానికి భారీ నష్టం
తబ్రిజ్‌ పెట్రోకెమికల్‌ కేంద్రంపై అమెరికా వైమానిక దాడి
కొనసాగిన హిజ్బొల్లా దాడులు..మంటల్లో చిక్కుకున్న చమురు రిఫైనరీ

నవతెలంగాణ – సెంట్రల్‌ డెస్క్‌
”అమెరికాతో ప్రత్యక్ష చర్చలు ఏమీ లేవు. అవన్నీ మధ్యవర్తుల ద్వారా బయటకు వచ్చిన అసమంజసమైన డిమాండ్లు మాత్రమే. దౌత్యం విషయంలో అమెరికా తరచూ మాటమారుస్తోంది. మా వైఖరి మాత్రం స్పష్టంగా ఉంది. పాక్‌ మధ్యవర్తిత్వ ప్రణాళికలు వారి సొంతమే. వాటిలో మా ప్రమేయం లేదు. యుద్ధం ముగింపు కోసం ఇస్తున్న పిలుపు స్వాగతించదగినదే. కానీ యుద్ధాన్ని ప్రారంభించింది ఎవరో గుర్తుంచుకోండి” అని ముంబయిలోని ఇరాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ పేర్కొంది.ఇటీవల ఇస్లామాబాద్‌లో పాక్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌తో సౌదీ అరేబియా, ఈజిప్ట్‌, తుర్కియే మంత్రులు సమావేశమయ్యారు. ఇరాన్‌, ఇజ్రాయిల్‌- అమెరికా ఘర్షణల కారణంగా మిగిలిన దేశాలపై పడుతోన్న ప్రభావంపై చర్చించారు. పాక్‌లో జరగబోయే ఇరాన్‌-అమెరికా ప్రత్యక్ష చర్చలకు ఆ దేశాల మంత్రులు పూర్తి మద్దతు ఇచ్చారని ఇషాక్‌ ప్రకటించారు. ఈ విషయంలో ఇరాన్‌, యూఎస్‌ఏ యంత్రాంగంతో చర్చలు జరిపామని చెప్పారు. ఇప్పుడు ఈ ప్రయత్నాల్లో తమ ప్రమేయం ఏమీ లేదని ఇరాన్‌ చెప్పడం గమనార్హం.

భీకర దాడులు..భయానక వాతావరణం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నివారణకు ఓవైపు దౌత్యయత్నాలు కొనసాగుతుండగా మరోవైపు భీకర దాడులు జరుగుతూనే ఉన్నాయి. దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యంలో భయానక వాతావరణం నెలకొంది. గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాపైకి ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. కువైట్‌లోని ఓ విద్యుత్‌ కేంద్రంపై, వాటర్‌ డీశాలినేషన్‌ ప్లాంటుపై ఇరాన్‌ దాడులు జరిపింది. ఈ దాడిలో ప్లాంటుకు తీవ్ర నష్టం జరిగిందని, ఘటనా స్థలంలోని ఓ భవనం దెబ్బతిన్నదని ప్రభుత్వ మీడియా తెలిపింది. దాడులలో భారత్‌కు చెందిన ఓ కార్మికుడు మరణించాడు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ఇప్పటి వరకూ కనీసం ఎనిమిది మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం సాయంత్రం కువైట్‌ గగనతలంలో ప్రవేశించిన 14 క్షిపణులు, 12 డ్రోన్లను గుర్తించారు. వీటిలో అనేక డ్రోన్లు ఓ సైనిక శిబిరాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి.

ఈ దాడుల్లో పది మంది సిబ్బంది గాయపడ్డారు. బహ్రెయిన్‌పై కూడా ఇరాన్‌ విరుచుకుపడడంతో ప్రజలను అప్రమత్తం చేస్తూ సైరన్లు మోగించారు. సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాల్సిందిగా వారికి సూచించారు. క్షిపణులను అడ్డుకునే క్రమంలో దేశంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. జోర్డాన్‌ రాజధాని అమ్మన్‌లో ఆదివారం నుంచి ముమ్మరంగా దాడులు జరుగుతున్నాయి. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో అమెరికాకు చెందిన లాజిస్టిక్‌ సపోర్ట్‌ కేంద్రంపై దాడి జరగడంతో అక్కడ పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించాయి. బాగ్దాద్‌ విమానాశ్రయ కాంప్లెక్స్‌లోని ఇరాక్‌ సైనిక కేంద్రాన్ని 122 ఎంఎం గ్రాడ్‌ రాకెట్లు తాకాయి. బాగ్దాద్‌ శివారు నుంచి వీటిని ప్రయోగించారు. ఈ కాంప్లెక్స్‌లోనే అమెరికా ఎంబసీ ఉపయోగించుకుంటున్న డిప్లొమాటిక్‌ సపోర్ట్‌ సెంటర్‌ కూడా ఉంది. ఈ సెంటర్‌లో రాకెట్లు పడడంతో మంటలు వ్యాపించాయి. దాడిలో ఇరాక్‌ వైమానిక దళానికి చెందిన ఆంటోనోవ్‌-132 యుద్ధ విమానం దెబ్బతిన్నది. యూఏఈ, కువైట్‌ దేశాలపై బాంబులు, క్షిపణులతో వైమానిక దాడులు జరిగే అవకాశాలు ఉండడంతో సైరన్లు మోగించారు.

ఇరాన్‌ చమురును స్వాధీనం చేసుకుంటా : ట్రంప్‌ బీరాలు
ఇరాన్‌ చమురును స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బీరాలు పలికారు. ఖర్గ్‌ దీవిలోని చమురు ఎగుమతి కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామని చెప్పారు. ‘ఖర్గ్‌ను స్వాధీనం చేసుకోవచ్చు. చేసుకోకపోవచ్చు. మాకు అనేక మార్గాలు ఉన్నాయి. అంటే దీనర్థం మేము అక్కడికి చేరుకుంటాం. అక్కడ వారికి రక్షణ వ్యవస్థలు ఉన్నాయని నేను అనుకోవడం లేదు. కాబట్టి మేము తేలికగా దానిని స్వాధీనం చేసుకోగలం’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఆ ఇంటర్వ్యూను ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక సోమవారం ప్రచురించింది. కాగా రాబోయే వారంలో ఇరాన్‌తో ఒప్పందం కుదరవచ్చునని ట్రంప్‌ తెలిపారు. హార్ముజ్‌ జలసంధి మీదుగా చమురును రవాణా చేసేందుకు 20 నౌకలను అనుమతించడానికి ఇరాన్‌ అంగీకరించిందని అన్నారు.

ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో వాషింగ్టన్‌ వెళుతూ ఆయన ఆదివారం రాత్రి విలేకరులతో ముచ్చటించారు. ‘ప్రత్యక్షంగా, పరోక్షంగా జరుగుతున్న సంప్రదింపులలో మంచి పురోగతి కన్పిస్తోందని మాత్రం చెప్పగలను. కానీ ఇరాన్‌తో ఏం జరుగుతుందో మీకు ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే వారితో మేము చర్చలు జరుపుతాం. అలాగే వారిపై నిరంతరం దాడి చేస్తూనే ఉంటాం’ అని చెప్పుకొచ్చారు. అమెరికా ప్రతిపాదించిన పదిహేను సూత్రాల కాల్పుల విరమణ ప్రతిపాదనపై ఇరాన్‌ స్పందించిందా అని ప్రశ్నించగా ‘వారు స్పందించారు. వారు కొన్ని అంశాలను మా ముందు ఉంచారు. అలా ఎందుకు చేశారో?’ అని ఎదురు ప్రశ్న వేశారు. అయితే ఆ వివరాలను ఆయన వెల్లడించలేదు. ‘ప్రణాళికపై మాతో వారు అంగీకరించారు’ అని మాత్రం చెప్పారు.

అమెరికా-ఇరాన్‌ చర్చలకు ఆతిథ్యమిస్తా : పాకిస్తాన్‌
అమెరికా-ఇరాన్‌ మధ్య త్వరలోనే చర్చలు జరుగుతాయని, వాటికి తాను ఆతిథ్యమిస్తానని పాకిస్తాన్‌ తెలిపింది. ఆ రెండు దేశాలు తమపై నమ్మకం ఉంచాయని, అది తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని పాక్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ చెప్పారు. పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో తుర్కియే, ఈజిప్ట్‌, సౌదీ అరేబియా, పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రులు సమావేశమై మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించారు. ‘మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సైనిక చర్యల కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. చమురు ధరలు పెరుగుతుండడంతో ఇంధన భద్రతకు ముప్పు ఏర్పడుతోంది. ఈ పరిస్థితులలో చమురు సరఫరాలు, ఆహార భద్రత, సముద్రయానం వంటి అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని మేమంతా నిర్ణయించాం’ అని ఈజిప్ట్‌ మంత్రి ఓ ప్రకటనలో తెలియజేశారు.

ట్రంప్‌ను వివరణ కోరిన ఆస్ట్రేలియా ప్రధాని
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ లక్ష్యాలపై ట్రంప్‌ మరింత వివరణ ఇవ్వాలని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌ డిమాండ్‌ చేశారు. అసలు యుద్ధం లక్ష్యాలేంటి? ఉద్రికత్తలు తగ్గాలని మేం కోరుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

హైఫా చమురు రిఫైనరీలో మంటలు
ఇజ్రాయిల్‌ ఉత్తర ప్రాంతంలోని హైఫా నగరంలో ఉన్న నౌకా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని తమ దళాలు దాడి చేశాయని హెజ్బొలా తెలిపింది. అనేక అత్యాధునిక క్షిపణులతో ఈ దాడి జరిపినట్టు చెప్పింది. అంతకుముందు జరిగిన క్షిపణి దాడిలో హైఫాలోని చమురు రిఫైనరీలో మంటలు చెలరేగాయి. దాడి కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందా లేక శకలాలు పడడం వల్లనా అనేది తెలియలేదు. ఈ ఘటన కారణంగా రిఫైనరీలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.

టెహ్రాన్‌ విద్యుత్‌ కేంద్రంపై అమెరికా-ఇజ్రాయిల్‌ దాడి
అమెరికా-ఇజ్రాయిల్‌ సేనలు టెహ్రాన్‌, ఇతర నగరాలపై సోమవారం వైమానిక దాడులకు పాల్పడ్డాయి. టెహ్రాన్‌లోని విద్యుత్‌ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి జరగడంతో అక్కడ అనేక గంటల పాటు కారుచీకట్లు అలుముకున్నాయి. ఆ తర్వాత అధికారులు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. నగరంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. గ్రేటర్‌ టెహ్రాన్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతంలో భాగంగా ఉన్న రే నగరంలో కూడా పేలుడు సంభవించింది. గడిచిన 24గంటల కాలంలో కరజ్‌, షిరాజ్‌, క్వామ్‌, అబాదన్‌, తబ్రిజ్‌ ప్రాంతాలలో దాడులు జరిగాయి. తబ్రిజ్‌లోని పెట్రోకెమికల్‌ యూనిట్‌పై దాడి జరిగింది. మంటలు చెలరేగడంతో సిబ్బంది వెంటనే స్పందించి వాటిని ఆర్పేశారు. ఇజ్రాయిల్‌ సేనలు సైనిక స్థావరాలతో పాటు పాఠశాలలు, వైద్యశాలలు వంటి పౌర మౌలిక సదుపాయాలపై కూడా దాడులు చేశాయి. దాడులు జరుగుతున్నప్పటికీ ప్రజలు ఏ మాత్రం వెరవకుండా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించి ప్రభుత్వానికి సంఘీభావం తెలియజేశారు.

మధ్యవర్తుల ద్వారానే చర్చలు : ఇరాన్‌
అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగడం లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. కేవలం మధ్యవర్తుల ద్వారానే సంప్రదింపులు సాగుతున్నాయని ఇరాన్‌ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్‌ బాఘై చెప్పారు. తమకు పంపిన ప్రతిపాదనలలో చాలా వరకూ అవాస్తవంగా ఉన్నాయని, వాటిలో హేతుబద్ధత లేదని అన్నారు. శాంతి కోసం ప్రాంతీయ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను ఇరాన్‌ స్వాగతిస్తోందని అంటూ జరుగుతున్న పరిణామాలను వాస్తవికతతో అర్థం చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘భూతల దాడుల కోసం వచ్చే అమెరికన్‌ బలగాల కోసం ఇరాన్‌ వేచి చూస్తోంది. వారిని అంతమొందించి, వారి ప్రాంతీయ భాగస్వాములను శిక్షిస్తాం. ఇరాన్‌ లొంగిపోవాలని అమెరికా కోరుకుంటోంది, కానీ, అటువంటి అవమానాన్ని ఇరాన్‌ అస్సలు సహించదు’ అని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహ్మద్‌ బకర్‌ కాలిబఫ్‌ స్పష్టం చేశారు.

దుబారు ధ్వంసమవుతుంది… జాగ్రత్త : యూఏఈని హెచ్చరించిన అమెరికా ఆర్థికవేత్త
ఇరాన్‌, ఇజ్రాయిల్‌-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలు పెట్టవద్దని యూఏఈని అమెరికా ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్‌ ఇటీవల హెచ్చరించారు. యుద్ధంలో యూఏఈ చేరితే దుబాయి, అబూదాబీ వంటి ప్రధాన నగరాలకు ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. ప్రస్తుతం యూఏఈ అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని, అమెరికా-ఇజ్రాయిల్‌ దేశాలను అంటకాగితే పరిస్థితి మరింత విషమిస్తుందని ఏఎన్‌ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ‘యుద్ధంలో యూఏఈ భాగస్వామి అయితే దుబాయి, అబుదాబీ నగరాలను ఇరాన్‌ పేల్చేస్తుంది. ఈ నగరాలలో రిసార్ట్‌ ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అవి క్షిపణి రక్షణ ప్రాంతాలు కావు.

సంపన్నులు అక్కడ వేడుకలు చేసుకుంటూ డబ్బు ఖర్చు చేస్తుంటారు. ఇలాంటి వాతావరణంలో వార్‌ జోన్‌లో ప్రవేశించడం అంటే దుబాయి వంటి ప్రదేశాలను చేజేతులా నాశనం చేసుకోవడమే అవుతుంది’ అని వివరించారు. అబ్రహం ఒప్పందం ద్వారా అమెరికాకు భాగస్వాములుగా ఉండాలని గల్ఫ్‌ దేశాలు నిర్ణయం తీసుకోవడం అంటే కోరి విపత్తును ఆహ్వానించడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. అబ్రహం ఒప్పందం గల్ఫ్‌ దేశాలను అమెరికా రక్షణపై మరింతగా ఆధారపడేలా చేసిందని చెప్పారు. అందుకే దీనిని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిస్సింజర్‌ ‘ప్రాణాంతక స్నేహం’గా అభివర్ణించారని గుర్తు చేశారు. పరిస్థితిని అర్థం చేసుకొని దేశ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన యూఏఈకి హితవు పలికారు.

మొజ్తాబా తీవ్రంగా గాయపడ్డారు : ట్రంప్‌
ఇరాన్‌ నూతన సుప్రీంనేత అయతొల్లా మొజ్తాబా ఖమేనీ అత్యంత తీవ్రమైన క్లిష్ట పరిస్థితిలో ఉండి ఉండవచ్చునని ట్రంప్‌ తెలిపారు. ఆయన తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. ఇరాన్‌లో ఇప్పటికే నాయకత్వ మార్పును సాధించామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక మంది ఇరాన్‌ నేతలను సంప్రదిస్తున్నామని, ఇప్పుడు అక్కడ ఉన్నది భిన్నమైన ప్రజా సమూహమని అమెరికా అధ్యక్షుడు అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -