Saturday, November 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం36 ఏండ్లుగా ఎన్నికల్లేవ్‌..

36 ఏండ్లుగా ఎన్నికల్లేవ్‌..

- Advertisement -

తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలి
లేదంటే అన్ని సంఘాలకు గుర్తింపు హోదా ఇవ్వాలి : టీజీయూఈఈయూ హెచ్‌ 1828 రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వి.గోవర్ధన్‌

నవతెలంగాణ-సిటీబ్యూరో
”ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1989లో ఏపీఎస్‌ఈబీగా ఉన్న రోజుల్లో తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో గుర్తింపు ఎన్నికలు జరిగాయి. కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌ ప్రకారం రెండేండ్లకోసారి గుర్తింపు ఎన్నికలు జరగాల్సి ఉంది.. అయినా 36 ఏండ్లుగా జరగడం లేదు..” అని టీజీయూఈఈయూ హెచ్‌ 1828 రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వి.గోవర్ధన్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో రెగ్యులర్‌, ఆర్టిజన్‌ కార్మికుల సమస్యలు ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈపీఎఫ్‌ టూ జీపీఎఫ్‌ పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని ఏండ్ల తరబడి కార్మికులు కోరుతూనే ఉన్నారని గుర్తు చేశారు.

2023లో జేఎల్‌ఎం ఉద్యోగులకు ఈపీఎఫ్‌పై సీలింగ్‌, పీఆర్సీ అమలు కాకపోవడం, సర్వీసులకు తగ్గ నియామకాల్లేక పని భారంతో కార్మికులు సతమతమవుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలపై ప్రత్యక్ష పోరాటం చేసే సంఘాల్లేకుండా పోయాయని పేర్కొన్నారు. కొన్ని సంఘాలు తామే గుర్తింపు సంఘం అని ప్రకటించుకుని కార్మికుల సమస్యలపై మాత్రం పోరాడటం లేదన్నారు. యాజమాన్యాలు కూడా నచ్చిన వారికి అనధికార గుర్తింపు ఇస్తున్నాయని ఆరోపించారు. కొన్ని సంఘాలు వర్గ దృక్పథాన్ని మరిచి యాజమాన్యం సేవలో పరితపిస్తున్నాయన్నారు. 36 ఏండ్లుగా ఎన్నికల్లేకున్నా.. యాజమాన్యం కొన్ని సంఘాలను మాత్రమే అధికారికంగా చర్చలకు పిలవడం విడ్డూరంగా ఉందన్నారు.

తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో ఏ యూనియన్లు, ఏ సంఘాలను గుర్తించారో.. అందుకు సంబంధించి జారీ చేసిన టీఓఓలు కావాలని ఆర్‌టీఐ చట్టం ప్రకారం టీజీయూఈఈయూ (సీఐటీయూ) అడిగినట్టు తెలిపారు. కానీ యాజమాన్యం కుంటి సాకులు చెప్పి సమాచారం ఇవ్వకుండా దాట వేసిందని, దీని ఆంతర్యమేంటని ప్రశ్నించారు. సింగరేణి, ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ, కేంద్ర సంస్థ డీఆర్‌డీఓ ఇలా చాలా సంస్థల్లో ఎన్నికలు జరిగా యని, ఈ విధానం విద్యుత్‌ సంస్థలకు ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. గుర్తింపు సంఘం అనే పేరుతో ఆయా యూనియన్‌ అగ్ర నాయకులు అసలు ఆఫీసుకు వెళ్లకుండానే ఒకటో తారీకు వేతనం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ మధ్యనే ఒక సంఘం నాయకుడి బండారం బయటపడి తీసుకున్న వేతనం కూడా రికవరీ చేశారని గుర్తు చేశారు.

అరాచకాలు అన్నీ ఇన్ని కావు
కరీంనగర్‌ సర్కిల్‌ ఆఫీస్‌ ప్రాంగణంలో సంస్థ కార్మికులు నివసించడానికి క్వార్టర్లు నిర్మించారని.. కానీ, అవి ఆయా యూనియన్ల ఆక్రమణలో ఉన్నాయని వి.గోవర్ధన్‌ ప్రకటనలో తెలిపారు. ఒక్క యూనియన్‌కు రెండు, మూడు క్వార్టర్లు కూడా ఉన్నాయని, ఇదేమని అడిగితే సమాధానం చెప్పే నాధుడే లేడని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు కార్మికుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్టే భావించాలన్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే చొరవ చేసి విద్యుత్‌ సంస్థల్లో ఎన్నికలు జరపాలని, లేదా అన్ని సంఘాలకు గుర్తింపు హౌదానైనా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -