•ప్రధానోపాధ్యాయులు లచ్చిరాం
నవతెలంగాణ-మర్రిగూడ
వారం రోజులుగా బడికి రాకుండా పొలానికి వెళుతున్న మండలంలోని భీమనపల్లి గ్రామానికి చెందిన ప్రైమరీ స్కూల్ ఓ విద్యార్థిని మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మరో ఉపాధ్యాయుడు వెంకట్ తో కలిసి పొలం వద్దకు వెళ్లి విద్యార్థికి నచ్చజెప్పి బడికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమం తప్పకుండా బడికి హాజరుకాని విద్యార్థులను గుర్తించి, వారి తల్లిదండ్రులతో సంప్రదించడం జరుగుతుందని తెలిపారు.
తల్లిదండ్రులు స్పందించని సందర్భాలలో స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి విద్యార్థులు నిత్యం బడికి రావాల్సిన అవసరాన్ని వివరించి అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు పొలం బాట కాదు బడి బాటే పట్టాలి అని సూచించారు. విద్యే భవిష్యత్తుకు బాట వేస్తుందని, పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని వివరించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సేవలను గ్రామస్తులు అభినందించారు.



