Sunday, November 2, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఆటల్లేవ్‌… పాటల్లేవ్‌

ఆటల్లేవ్‌… పాటల్లేవ్‌

- Advertisement -

పీడీలు లేరు..పీరియడ్‌లూ లేవు
పాఠశాలలతోనే ఆటలకు ఫుల్‌స్టాప్‌
కార్పొరేట్‌ బాటలో ప్రభుత్వ కళాశాలలు
యాంత్రిక చదువులతో విద్యార్థుల కుస్తీ
మానసిక, శారీరక రుగ్మతలతో సతమతం

నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
ఫిజికల్‌ డైరెక్టర్‌లు లేరు… పీరియడ్‌లు లేవు.. ఆటల్లేవు.. పాటల్లేవు… పాఠశాలల స్థాయిలోనే ఆటలుకు ఫుల్‌స్టాప్‌ పడుతోంది. కార్పొరేట్‌ కళాశాలల మాదిరిగానే ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు యాంత్రికంగా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ముఖ్యంగా ఇంటర్‌లో ఆటల కంటే చదువుపైనే దృష్టి పెట్టడంతో పోస్టుల భర్తీకి సుముఖత చూపడం లేదని తెలిసింది. దీనికితోడు విద్యార్థులు శారీరకంగా, మానసికంగా బలహీనంగా మారుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 450 పోస్టులు ఏండ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. 13 మంది మాత్రమే ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఏ ఒక్క కళాశాలలోనూ పీడీలు లేరు. దీంతో పీరియడ్‌లను తొలగించారని తెలుస్తోంది.

ఒకటో తరగతి నుంచి 10 వరకు పాఠశాలల్లో ఆటలు ఆడిన విద్యార్థులు ఇంటర్‌లో ఆటలు ఆగిపోవడంతో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. శారీరక శ్రమ లేక మానసికంగా ఉత్తేజంగా ఉండటం లేదు. చదువుతోపాటు ఆటలు ఉంటేనే విద్యార్థులు ఆరోగ్యంంగా ఉంటారు. సమాజంలో నేడు ఆటలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, చెస్‌ వంటి ఆటలు నేడు అంతర్జాతీయ క్రీడలుగా మారిపోయాయి. ఈ ఆటల్లో రాణించిన వారు అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదుగుతారు. ముఖ్యంగా ఏ ఉద్యోగానికి వెళ్లినా.. క్రీడలకు సంబంధించిన కోటా ఉంటుంది. క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగం సులువుగా వస్తుంది. కానీ కళాశాలల్లో ఆటలను తీసేసి ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థులతో బట్టీ చదువులు చదివిస్తున్నారు. దాంతో మానసికోల్లాసం వారిలో లేకుండా పోతోందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇంకా సంగీతం, విలువిద్యలు, పాటలు, నృత్యాలు ఇలా అనేక కళలలో రాణించే అవకాశాలు ఉన్నాయి. కానీ, ఏండ్ల తరబడి పీడీల పోస్టులను భర్తీ చేయాలన్న ఆలోచన పాలకులకు లేకుండా పోయింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా పోస్టుల భర్తీపై దృష్టి సారించడంలేదు.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. మొదటి సంవత్సరంలో 2290 మంది విద్యార్థులు, రెండో సంవత్సరంలో 1761 మంది విద్యార్థులు చదువుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 15 జూనియర్‌ కళాశాలలు, మొదటి సంవత్సరానికి 4775 మంది, రెండో సంవత్సరానికి 3,658 మంది విద్యార్థులు చదువుతున్నారు. వనపర్తి జిల్లాలో 12 కళాశాలలు ఉన్నాయి. 2074 మంది మొదటి సంవత్సరానికి 1496 మంది రెండో సంవత్సరానికి చదువుకుంటున్నారు. నారాయ ణపేట జిల్లాలో 10 కళాశాలలు ఉన్నాయి. 1784 మంది మొదటి సంవత్సరం, రెండో సంవత్సరంలో 1232 మంది చదువుకుంటున్నారు. గద్వాల జిల్లాలో 8 కళాశాలలున్నాయి. వీటిలో ఇంటర్‌ మొదటి సంవత్సరం 1858 మంది, రెండో సంవత్సరం 1375 మంది చదువుకుంటున్నారు.

పీడీల్లేరు..
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 62 పీడీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏండ్ల తరబడి వీటి భర్తీపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. కళాశాలల్లో మైదానాలు సైతం లేకుండా పోయాయి. బాలికలు, ఖోఖో, హాకీ లాంటి ఆటలు ఆడుతారు. ప్రభుత్వం ఆటలపై దృష్టి సారించకపోవడం వల్ల విద్యార్థులు ఆటలతోపాటు స్పోర్ట్స్‌ ఉద్యోగాలకు సైతం దూరం అవుతున్నారు.

మైదానాలు లేవ్‌..
ఉమ్మడి జిల్లాలో 61 కళాశాలలు ఉన్నా.. వాటిలో పీడీలే కాదు.. ఆట స్థలాలు కూడా లేవు. ఇరుకు ప్రదేశంలో ఉండే కళాశాలలకు ఆట స్థలాలు లేకపోవడం చేత ఆటలు సాగడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పీడీ పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

ప్రతి కళాశాలకూ రూ.10 వేలు
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కళాశాలకూ రూ.10 వేలు మంజూరు చేసింది. ఈ డబ్బులతో ఆట వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంది. రింగ్‌బాల్‌, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, చెస్‌ ఇటువంటివి కొనుగోలు చేయాల్సింది. అయితే ఆటలు ఆడించేవాళ్ల్లే లేకుండా ఆట వస్తువులకు నిధులు ఇస్తే.. ఎలా నేర్చుకోవాలని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

అవగాహన ఉన్న వారితో ఆటలాడిస్తున్నాం
నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా 16 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఎక్కడా ఫిజికల్‌ డైరెక్టర్‌ లేడు. ఆటలపై అవగాహన ఉండి నేర్పరితనం ఉన్న కళాశాల లెక్చరర్లతోనే ఆటలు ఆడిస్తున్నాం. ప్రతి శనివారం మెడిటేషన్‌, యోగాతో పాటు ఇతర ఆటలు ఆడిస్తున్నాం. ఇటీవల ప్రతి కళాశాలకూ ఆటల విభాగానికి చెందిన పరికరాల కోసం ప్రభుత్వం నుంచి రూ.10 వేలు వచ్చాయి. వీటిని కళాశాలలకు అందించి ఆట వస్తువులు కొనుగోలు చేయాలని చెప్పాం.
-వెంకటరమణ డీఐఓ, నోడల్‌ అధికారి నాగర్‌కర్నూల్‌ జిల్లా

పీడీలను నియమించాలి
చదువులతో పాటు ఆటల్లోనూ విద్యార్థులు ముందుండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ కళాశాలల్లో కొంత కాలంగా పీడీల నియామకం చేయలేదు. విద్యార్థులు మానసికంగా ఒత్త్తిడికి గురవుతూ పరీక్షల మందు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కార్పొరేట్‌ కళాశాలల మాదిరిగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు పరిస్థితి మారుతోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి పీడీలను నియమించాలని కోరుతున్నాం.
ఎస్‌ఎఫ్‌ఐ మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యదర్శి భరత్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -