Sunday, June 22, 2025
E-PAPER
Homeమానవిషూరిటీలు వద్దు

షూరిటీలు వద్దు

- Advertisement -

పియ్రమైన వేణు గీతికకు
నువ్వు క్షేమంగా చేరి వుంటావని తలుస్తాను. నీ రాక సంతో షాన్ని కలిగిస్తే, తిరిగి వెళ్లిపోవడం మరింత బాధను కలిగిస్తుంది. అయినా తప్పదు కదా నాన్న. ఉద్యోగ బాధ్యతలు, తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి. మనసు రాయి చేసుకోవడం, మళ్ళా నువ్వు వచ్చే వరకు ఎదురు చూడటం. నాన్న నీకు కిందటి సారి రాసిన రెండు ఉత్తరాల్లో ఆర్ధిక ప్రణాళికల గురించి రాసాను. ఇంచుమించు దానికి సంబంధించినదే ఇది కూడా. ఇటువంటివి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పక ఎదురవుతాయి.
మనకు తెలిసిన వాళ్ళు, పరిచయమున్నవారు, బంధువులు, స్నేహితులు మొదలైన వారు ఉంటారు కదా! ఒక్కొక్క సారి మనతో వారికి ఉన్న పరిచయంతో నేరుగా డాక్యూమెంట్స్‌ పట్టుకొచ్చి వాటిమీద షూరిటీ సంతకాలు పెట్టమని అడుగుతుంటారు. అది లోన్లకు సంబంధించి కావచ్చు, వ్యాపార రీత్యా తీసుకుంటున్న లోన్‌ కావచ్చు, చిట్టికి సంబందించినది కావచ్చు. చదువుల నిమిత్తమో, విదేశాలకు వెళ్లేందుకో అయ్యి వుండొచ్చు ఇలా అనేక రకాలు ఉంటాయి.
ఎవరికైనా సరే ఇలాంటి షూరిటీ సంతకం చేయవద్దు. ఇలా ఉండి మన బంధువుల్లోనే ఒకరు ఐదు లక్షలకు పైగా కట్టవలసి వచ్చింది. ఎన్నో ఏండ్లుగా స్నేహితుడు కదా అని షూరిటీ పెట్టారు. పోల్ట్రీ వ్యాపారం మొదలు పెట్టి, నష్టం రావడంతో ఎవరికీ చెప్పకుండా దేశం వదిలి వెళ్ళిపోయాడు. అది షూరిటీ పెట్టిన వాళ్ళు కట్టవలసి వచ్చింది. ఈ మధ్య ఒక 70 ఏండ్ల వృద్ధురాలు చెప్తోంది.. పెద్ద ఇల్లు ఉండి అమ్ముకోవాల్సి వచ్చిందని. ఎందుకు అమ్మాల్సి వచ్చిందంటే వాళ్ళ ఆడపడుచు కొడుకు విదేశాల్లో చదువులకు వెళ్లాలని లోన్‌ తీసుకుని, షూరిటీ వీళ్ళను పెట్టమంటే పెట్టారట. అతను అక్కడికి వెళ్ళాడు కానీ, చదువుకున్నది లేకపోగా షూరిటీ ఉన్న పాపానికి కోట్లు విలువ చేసే ఇల్లు తప్పనిసరిగా అమ్మి ఆ అప్పు తీర్చాల్సి వచ్చింది.
మరి కొందరుంటారు.. మాకు డబ్బులు అవసరమున్నాయి, ఎవరైనా మీకు తెలిసిన వాళ్లు ఉంటే ఇప్పిస్తారా అని. లేకుంటే వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఉంటే చెప్పండంటారు. ఇంకొందరు కొత్తగా స్టార్టప్‌ కంపెనీ మొదలుపెట్టాము. ఎవరైనా పెట్టుబడి పెట్టె వాళ్ళు ఉంటే చెప్పండి అంటారు. ఇటువంటి వాటి జోలికి కూడా పోవద్దు. వీటి వల్ల గొడవలు మొదలవడమే కాక శత్రువులు తయారవుతారు. తీసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, ఎటొచ్చి చెప్పిన వాళ్ళు చెడ్డ వాళ్లవుతారు. అందుకే ముందు జాగ్రత్తగా చెబుతున్నాను. ఎప్పుడూ ఎవరికీ షూరిటీ ఇచ్చి, రోడ్డున పడే పరిస్థితులు తెచ్చుకోకు. అవతలి వారు ఎంత తెలిసిన వాళ్ళు అయిన సరే, బంధువులైనా సరే నిర్మొహమాటంగా చెప్పేయడమే మంచిది. వారికి కోపం వచ్చినా సరే నువ్వు అలాంటి పని మాత్రం చేయకు.. ఉంటాను

ప్రేమతో అమ్మ
హొ- పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -