ఈ-పంచాయతీ ఆపరేటర్లకు అందని వేతనాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామ పంచాయతీల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గత 12 ఏళ్ల క్రితం ఈ -పం చాయతీ ఆపరేటర్లను నియమించారు. వీరంతా గ్రామ పంచాయతీల్లో ధ్రువీకరణ పత్రాలు, పంచాయతీ ఆదాయం,వ్యయం, పన్నుల వసూళ్లు,ప్రభుత్వ పథకాలకు సంబంధించిన గృహ నిర్మాణాలకు అనుమతులు, తదితర పనులను కంప్యూటర్ ఆపరేటర్లు నిర్వర్తిస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో 248 గ్రామ పంచాయతీలకు గాను క్లస్టర్ పంచాయతీ కేంద్రాలను విభజించి మొత్తం 24 మంది ఆపరేటర్లను నెలకు రూ.19,500 వేతనాల చొప్పున చెల్లించేలా నియమించారు.
ఒక్కో మండలంలో ముగ్గురు లేదా నలుగురు వరకు ఆపరేటర్లు రాత్రి, పగలు తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ వేతనాలు ఎప్పుడు అందుతాయో తెలియని పరిస్థితి ఉంది. ప్రస్తుతం గత నాలుగు నెలలుగా అంటే గతేడాది అక్టోబర్ నుంచి నేటి వరకు వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో మార్చి నుంచి ఆం దోళనబాట పట్టాలని యూనియన్ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
ఆర్థిక సంక్షోభంలో ఆపరేటర్లు..
గత పన్నెండేళ్లుగా సేవలు అందిస్తున్న ఆపరేటర్లకు వేతనాలు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ సంగతి దేవుడెరుగు..కనీసం గుర్తింపు ఇచ్చినా చాలు అన్నట్లుగా ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం వేతనం వస్తే చాలు అన్నట్లుగా తమను చూస్తున్నారని,గుర్తింపు, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆపరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఫిబ్రవరితో కలిపి ఐదు నెలల వేతనాలను ప్రభుత్వం చెల్లించలేని పక్షంలో మార్చిలో సమ్మె చేపట్టేందుకు సమాయత్తమవుతున్నట్లుగా సమాచారం.
ఆర్థికంగా చితికిపోతున్నాం: చింతకింది రమేష్ ఈ-పంచాయతీ జిల్లా అధ్యక్షుడు
ప్రతి నెలా వేతనాలు రాక ఆర్థికంగా చితికిపోతున్నాం. గుర్తింపుతో పాటు భద్రత కరువైంది. ఎన్టీఓ ద్వారా వేత నాలు సక్రమంగా అందించాలి. ఫిబ్రవరిలో అయినా పెండింగ్ వేతనాలు అందించ కుంటే రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ముందుకు సాగుతాం.



