ఢిల్లీలోనే క్యాపిటల్స్ హోమ్ మ్యాచ్‌లు
నవతెలంగాణ-హైదరాబాద్
ఐపీఎల్, మహిళల ప్రపంచకప్, మహిళల సిరీస్‌లతో గత ఏడాది నుంచి విశాఖపట్నంలో క్రికెట్ సందడి కనిపిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలోనూ ఓ అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన విశాఖపట్నం.. ఐపీఎల్ 2026 మ్యాచ్‌లకు వేదికగా నిలిచే అవకాశం కనిపించటం లేదు. ఐపీఎల్ ప్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని జిఎంఆర్ ఉత్తరాంధ్రకు చెందిన వారు. దీంతో గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు హోమ్ మ్యాచ్‌లను విశాఖలో నిర్వహించారు.
ఆ రెండింటా, ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొందింది. లక్నోపై 1 వికెట్ తేడాతో, సన్‌రైజర్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది సీజన్‌ను ఘనంగా మొదలెట్టింది. ఈ సీజన్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ఒకట్రెండు హోమ్ మ్యాచ్‌లకు వైజాగ్ వేదిక అవుతుందని భావించినా… క్యాపిటల్స్ ఆతిథ్య మ్యాచ్‌లన్నీ ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లలోనే జరుగనున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ రెండు హోమ్ మ్యాచ్‌లను రాయ్ పూర్‌లో, పంజాబ్ కింగ్స్ 3 హోమ్ మ్యాచ్‌లను ధర్మశాలలో, రాజస్తాన్ రాయల్స్ 3 హోమ్ మ్యాచ్‌లను గువహటిలో ఆడతాయని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ మ్యాచ్‌లన్నీ న్యూఢిల్లీలోనే జరుగనుండటంతో ఇక్కడి క్రికెట్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.



