– హోదా ఏదైనా భవబంధాలే మిన్న
– మంత్రి తుమ్మల బాల్యాన్ని గుర్తు చేసిన బామ్మ
నవతెలంగాణ – అశ్వారావుపేట
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బాల్య స్మృతుల్లో ఓ ఆప్యాయ క్షణం. “స్థాయి ఏదైనా పునాదే బలం… హోదా ఎంచుకున్నా బంధం మిన్న…” అనే మాటలను నిజం చేస్తూ, తుమ్మల నాగేశ్వరరావు జీవితంలో ఓ హృద్యమైన సంఘటన చోటుచేసుకుంది. శనివారం, దమ్మపేట మండలం గండుగులపల్లి లోని తన స్వగృహంలో ఈ సంఘటన జరిగింది. బాల్యంలో తనను భుజాలపై మోసి పెంచిన అచ్చెమ్మ ను మంత్రి అనుకోకుండా కలుసుకున్నారు.
ఆమెను చూసిన వెంటనే మంత్రి తుమ్మల భావోద్వేగంతో “అచ్చెమ్మ అత్తా… బాగున్నావా?” అని ఆప్యాయంగా పలకరించారు. దానికి అచ్చెమ్మ కూడా అంతే ఆప్యాయంగా సమాధానం ఇచ్చింది. “ఏం పని లేదు బాబు… నిన్ను చూసి చాలా కాలం అయింది. చూడాలనిపించింది… అందుకే వచ్చాను.” ఇద్దరి మధ్య ఆ క్షణం మాటల్లో చెప్పలేనంత అనుబంధాన్ని చూపించింది. మంత్రి తుమ్మల కూడా ఆప్యాయంగా ఆమెతో కూర్చొని బాల్య స్మృతులను గుర్తు చేసుకుంటూ కొంతసేపు సరదాగా గడిపారు.
నేపథ్యం ఏమిటంటే..
తుమ్మల నాగేశ్వరరావు దీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్ మంత్రివర్గాల్లో సేవలందించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కూడా మంత్రి గా కొనసాగుతున్నారు.
నేరుగా చెప్పాలంటే…
ఇది సాధారణ సంఘటన ఏమీ కాదు. పదవులు, రాజకీయాలు, అధికారాలు అన్నీ పక్కనపెడితే…మనిషిని నిలబెట్టేది సంబంధాలే అన్న దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇలాంటి క్షణాలు ప్రజాదరణ తో పాటు ఆయా వ్యక్తుల అంతర్గత వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేస్తాయి.



