Wednesday, July 30, 2025
E-PAPER
Homeబీజినెస్ఐటి పరిశ్రమలో ఇక కోతలే..!

ఐటి పరిశ్రమలో ఇక కోతలే..!

- Advertisement -

– సాంప్రదాయ నైపుణ్యాలకు కాలం చెల్లుతోంది
– కొత్తగా స్కిల్స్‌ పెంచుకోవాల్సిందే
– నాస్కామ్‌ హెచ్చరిక
న్యూఢిల్లీ :
భారత ఐటి రంగంలో మరిన్ని ఉద్వాసనలు చోటు చేసుకోనున్నాయని ఐటి సేవల కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే నాస్కామ్‌ అంచనా వేసింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పరిశ్రమలో పెను మార్పులు వస్తున్నాయని పేర్కొంది. ఈ దశలో రాబోయే నెలల్లో మరిన్ని ఉద్యోగ కోతలు జరిగే అవకాశం ఉందని నాస్కామ్‌ మంగళవారం ఓ రిపోర్ట్‌లో హెచ్చరించింది. దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) ప్రపంచ వ్యాప్తంగా 2 శాతానికి సమానమయ్యే 12,000 మందిపై వేటు వేస్తోన్న నేపథ్యంలో నాస్కామ్‌ ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఐటి పరిశ్రమకు ఇది ఓ మలుపు సమయని పేర్కొంది.
”ప్రపంచవ్యాప్తంగా క్లయింట్‌లు ఐటి సేవల నుండి వేగవంతమైన, సౌలభ్యమైన, ఆవిష్కరణాత్మక ఫలితాలను డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఐటి కంపెనీలు కృత్రిమ మేధా (ఎఐ), ఆటోమేషన్‌పై దృష్టి పెడుతున్నారు. కొన్ని సాంప్రదాయ నైపుణ్యాలకు కాలం చెల్లుతోంది. ఉద్యోగులు కెరీర్‌ మార్పులు లేదా నైపుణ్య అభివృద్ధి దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. టిసిఎస్‌ ఇటీవల 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించడం ఈ ధోరణికి ఉదాహరణ. ఇతర ఐటి కంపెనీలు కూడా ఇలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.” అని నాస్కామ్‌ తెలిపింది.
ఎఐ ప్రధానంగా మారుతోన్న నేపథ్యంలో నిర్దిష్ట నైపుణ్యాలు, అత్యంత ప్రత్యేక నైపుణ్యాల కోసం నియామకాలపె కంపెనీలు దృష్టి సారిస్తాయని నాస్కామ్‌ పేర్కొంది. ఈ మార్పులు స్వల్పకాలిక ఉద్యోగ నష్టాలకు దారితీసినప్పటికీ, కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించబడుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆటో పరిశ్రమ ఎఐ, ఆటోమేషన్‌ ద్వారా గణనీయమైన మార్పులకు లోనవుతోంది. ఇది స్వల్పకాలంలో ఉద్యోగ కోతలకు దారితీసినప్పటికీ, నిరంతర అధ్యయనం, నైపుణ్యాభివృద్ధి ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించబడుతాయని.. ఈ క్రమంలో ఐటి నిపుణులు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తమ స్కిల్స్‌ను ఎప్పటికప్పుడు పెంచుకోవాలని నాస్కామ్‌ సూచించింది.
టిసిఎస్‌లో సీనియర్‌ నియామకాలు నిలిపివేత..
దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) సీనియర్ల నియామకాలను నిలిపేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు వార్షిక వేతనాల పెంపును ఆపేసినట్లు రిపోర్టులు వస్తోన్నాయి. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకొందని సమాచారం. ఇప్పటికే 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు టిసిఎస్‌ సిఇఒ కె కృతివాసన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -