Sunday, June 8, 2025
E-PAPER

కావు.. కావు..

- Advertisement -

తన దాకా వస్తే గానీ తత్వం బోధపడబోదని అంటారు పెద్దలు. అనుభవం అనేది అనేకం నేర్పుతుందనేది కూడా ఈ కోవలోని సామెతే. ఇటీవల ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌లో చోటు చేసుకున్న పలు పరిణామాలపై కూడా ఇవే కామెంట్లు వినబడుతున్నాయి. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రికి లేఖలు రాయటం, అవి లీకవటం… తదనంతర పరిణామాలన్నీ మనకు తెలిసినవే. అయితే గతంలో ఇదే మాదిరిగా అధినేతను ధిక్కరించి, ధిక్కార స్వరం వినిపించిన లేడీ సూపర్‌ స్టార్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతిని, మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి సాగనంపిన సంగతి అందరికెరుకే. వారిని పొమ్మనకుండా పొగబెట్టారంటూ అప్పట్లో నేతలు గుసగుసలాడుకున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. ఇప్పుడు కవిత ఎపిసోడ్‌ మరో ఎత్తు. రాములక్క, రాజేందరన్న మాదిరిగానే… ఇప్పుడు కూడా పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్న కవితక్కను కూడా ‘కారు దించేస్తారా?’ లేక ‘అలాగే ఎక్కించుకుని తిప్పుతారా?’ అనే సెటైర్లు వినబడుతున్నాయి. దీనికి కాలమే సమాధానం చెప్పాలం టున్నారు రాజకీయ పండితులు. అయినా బీఆర్‌ఎస్‌ బాస్‌… ఎప్పుడు, ఏ విషయంపై, ఎలా స్పందిస్తారనేది తమకే అంతుచిక్క దంటున్నారు ఆయన అభిమానులు, గులాబీ నాయకులు. వీటన్నింటిపై ఒక సీనియర్‌ నేతను కదిలించగా… అన్నమయ్య సినిమాలోని ‘కావు.. కావు…’ డైలాగును వల్లెవేశారాయన. ఆ సినిమాలో కాకులు ‘కావు..కావు…’ అనే ఎందుకరుస్తాయంటూ అన్నమయ్య భార్యలు ఆయన్ని అడుగుతారు. దానికాయన నింపాదిగా… ‘ఈ లోకంలో ఏవీ శాశ్వతం కావు.. కావు…’ అంటూ అవి మానవాళికి హితోపదేశం చేస్తున్నాయని చెబుతారు. ఇదే విధంగా ఈ తండ్రీ తనయల పగలు, ఫ్రస్టేజీలు, కోపాలు, తాపాలు.. అన్నీ శాశ్వతం ‘కావు.. కావు…’ తర్వాతర్వాత అన్నీ సర్దుకుంటాయంటూ ముక్తాయింపునిచ్చారు సదరు లీడరు.
-బి.వి.యన్‌.పద్మరాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -