ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఫుట్‌బాల్ టీమ్
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు వ్యాఖ్యలపై ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు ఘాటుగా స్పందించింది. 2026 ఫిఫా ప్రపంచకప్‌ను అమెరికాతో కలిసి కెనడా, మెక్సికో సంయుక్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో ఫిఫా ప్రపంచకప్ కోసం తమ జట్టు అమెరికాకు వెళ్లబోదని ఇరాన్ క్రీడా మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించిన తెలిసిందే. తాజాగా ఫిఫా ప్రపంచకప్‌లో ఇరాన్ ప్రాతినిథ్యంపై ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ‘ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు ఫిఫా ప్రపంచకప్ కోసం ఇక్కడికి వస్తే వారి భద్రత, ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని’ ట్రంప్ అన్నారు.
దీంతో ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు ఘాటుగా స్పందించింది. ‘ఫిఫా ప్రపంచకప్ చారిత్రక, అంతర్జాతీయ టోర్నమెంట్. దీన్ని స్వతంత్ర ఫిఫా నడిపిస్తోంది. ఇందులో వ్యక్తులు, దేశాలకు సంబంధం లేదు. 2026 ప్రపంచకప్‌కు ముందుగా అర్హత సాధించిన అతి కొద్ది జట్లలో ఇరాన్ ఒకటి. ప్రపంచకప్ నుంచి ఇరాన్‌ను ఎవరూ తప్పించలేరు. ఆతిథ్య జట్టు టైటిల్‌తో, ఆతిథ్య జట్టకు భద్రత కల్పించలేని దుస్థితిలో ఉన్న అమెరికానే టోర్నీ నుంచి తప్పించాలి’ అని ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి స్పందించింది. ప్రపంచకప్‌లో ఇరాన్ భద్రతకు ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్‌ఫాంటినో హామీ ఇవ్వగా.. డొనాల్డ్ ట్రంప్ సైతం స్వరం మార్చాడు. యునైటెడ్ స్టేట్స్‌లో ప్రపంచకప్ ఆడేందుకు ఇరాన్ ఫుట్‌బాల్ జట్టును స్వాగతిస్తామని అన్నాడు.



