Monday, March 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఏ తల్లిదండ్రులు అనాధలుగా మిగిలిపోకూడదు

ఏ తల్లిదండ్రులు అనాధలుగా మిగిలిపోకూడదు

- Advertisement -

పోషణ, పర్యవేక్షణ బిల్లు వారికి రక్షణ కవచం : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన శాసనసభ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఏ తల్లిదండ్రులు అనాధలుగా మిగిలి పోకూడదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. ”తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారి తనం, పర్యవేక్షణ బిల్లు-2026” కు రాష్ట్ర శాసనసభ ఆదివారం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తినంతా ధారపోస్తారనీ, పిల్లలు మాత్రం రెక్కలొచ్చాక తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం లేదని అన్నారు. జీవితపు చరమాంకంలో వృద్ధ తల్లిదండ్రులకు రక్షణ కవచంగా నిలవాలనే ఈ చట్టం తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. ”మనిషులు బంధాలు… అనుబంధాలను మర్చిపోయి చివరికి పేగు బంధాలను కూడా విస్మరించారు. భౌతిక సుఖాలు, ఆర్థిక ప్రయోజనాలు, సంపద కోసం పాకులాటల్లో మునిగిపోయారు. సమాజం తలదించుకునేలా కొందరు పిల్లలు వ్యవహరిస్తున్నారు. ఆత్మీయతకు సంబంధించిన అంశంపై చట్టం తీసుకురావడం బాధాకరం.

తల్లిదండ్రుల యోగక్షే మాలు చూడని వ్యక్తిని సొసైటీ బహిష్కరించాలి. కన్నవారిని చూసుకోలేనివాడు సమాజంలో బతకడానికి వీల్లేదు. తల్లిదండ్రుల పట్ల భక్తి లేని వారికి భయం కలిగించేందుకే ఈ చట్టాన్ని ఎంతో బాధ్యతతో, భావోద్వేగంతో ఆలోచన చేసి తీసుకువస్తున్నాం” అని సీఎం అన్నారు. చూపు లేని తల్లి దండ్రుల చివరి కోరిక అయిన పుణ్యక్షేత్ర దర్శనానికి కావిడిలో కూర్చోబెట్టుకుని తన భుజాలపై తీసుకెళ్లిన శ్రవణ కుమారుడు నేటి సమాజానికి ఆదర్శమన్నారు. రేమండ్స్‌ కంపెనీ చైర్మెన్‌, పద్మభూషణ్‌ అవార్డు గ్రహిత విజరు పథ్‌ సింఘానియా తాను సంపాదించిన రూ.1,000 కోట్ల ఆస్తిని కొడుకుకు ధారపోసి, అతను చేసిన ద్రోహంతో అనామికుడిగా తనువు చాలించారని ఆవేదన వ్యక్తం చేశారు. ”పిల్లలకు సర్వస్వం ఇచ్చి తప్పు చేశాను. నేను చేసిన తప్పు ఏ తల్లిదండ్రులు చేయకూడదని ఆయన తన ఆత్మకథ ”ఇన్‌ కంప్లీట్‌ లైఫ్‌”లో చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. శ్రవణ కుమారుడి గాథ అజరామరమైతే… వేల కోట్లు సంపాదించినా కన్న వారి ఆదరణలేక అనామకుడిగా కన్నుమూసిన విజయ్ పథ్‌ సింఘానియా ఉదంతం ఆధునిక సమాజపు చీకటి కోణాన్ని ఆవిష్కరించింది” అని సీఎం అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకే కాదు.. ప్రజా ప్రతినిధులను కూడా ఈ చట్టం పరిధిలోకి తెచ్చామని పేర్కొన్నారు. కొడుకులతో పాటు ఉద్యోగం చేసే కూతుళ్లకు కూడా ఈ చట్టం వర్తిసుందన్నారు. కుటుంబం అంటే కొడుకైనా, కూతురైనా ఇద్దరూ సమానమేనన్నారు. ఆడబిడ్డలకు తల్లిదండ్రులపై ప్రేమ ఉన్నా… మెట్టినింటి బాధ్యతలతో ఏమీ చేయలేకపోతున్నారనే దృష్టితోనే చట్టాన్ని రూపొందించామని వివరించారు. ఈ చట్టంతో వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించేందుకు బలమైన ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. చట్టం తమ ఇంటి మెట్టెక్కకుండానే కన్న వారిని పిల్లలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. వృద్ధుల పోషణ, పర్యవేక్షణ బిల్లు సామాజిక పరివర్తన క్రమంలో మైలురాయని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మన్‌ కుమార్‌ అన్నారు. ఈ బిల్లును సభ్యులందరూ ఎకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. అనంతరం బిల్లుకు బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులు మద్దతు తెలపడంతో సభ ఏక గ్రీవంగా ఆమోదించింది.

పరిహారం పెంచడం సాధ్యం కాదు
వృద్ధుల పోషణ, పర్యవేక్షణ బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు కూనంనేని సాంబశివరావు, పాయల్‌ శంకర్‌, జాఫర్‌ హుస్సేన్‌, ఆదినారాయణ చేసిన సవరణలు, ప్రతిపాదనలపై ఈ సందర్భంగా సీఎం వివరణ ఇచ్చారు. వద్ధుల కోసం కేంద్రం 2007లో ఒక చట్టం తెచ్చిందనీ, ఆ చట్టం ప్రకారం తల్లిదండ్రులకు రూ.10 వేలకు మించి ఇచ్చే అవకాశం లేదన్నారు. కేంద్రం చేసిన చట్టానికి భిన్నంగా వ్యవహరిస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఈ కొత్త చట్టం ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని వ్యాఖ్యానించారు. అయితే మన అభిప్రాయాలను, ఆలోచనలను సభ ద్వారా కేంద్రానికి విన్నవిద్దామని సీఎం పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -