Sunday, June 15, 2025
E-PAPER
Homeఅంతరంగంప్లాస్టిక్‌ వద్దు

ప్లాస్టిక్‌ వద్దు

- Advertisement -

కారులోంచో, బస్సులోంచో వెళుతున్నప్పుడు గుట్టల్లా చెత్త పోగేసి కనిపిస్తోంటే చూడటానికి ఎలా ఉంటుంది? ఆ ప్రదేశాన్ని దాటే కొద్ది నిమిషాల్లో ఉక్కిరిబిక్కిరి అవుతాం. అయితే ప్లాస్టిక్‌ ఇలా వాసన రాదు. దుర్వాసన లేకపోయినా ఏండ్లపాటు భూమిలో కలవకుండా, వర్షాకాలంలో ఇవి పెట్టే ఇబ్బందులు అంతా ఇంతా కావు. అందుకే వేడుకలనీ, సెలవులనీ ప్రయాణాలు కడుతోంటే మీవంతుగా వాటికి అడ్డుకట్ట వేస్తే మంచిది.
అనవసర బరువని కొందరు బాటిల్‌ వెంట తీసుకెళతారు. కావాల్సినప్పుడల్లా వాటర్‌ బాటిల్‌ కొనుక్కొని తాగేస్తుంటారు. పూర్తవగానే బాటిల్‌ని పడేస్తారు. కానీ ఏటా కేవలం మన దేశంలోనే 1400 కోట్ల బాటిళ్లు అమ్ముడవుతున్నాయని ఓ అంచన. వాటిని తిరిగి ఉపయోగించేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండీ? అంటే అవన్నీ చెత్త రూపంలో భూమిపై మిగులుతున్నట్లేగా. దీనికి తేలికైన పరిష్కారం కూడా ఉంది. వెంట స్టీల్‌ లేదా రీయూజబూల్‌ బాటిల్‌ తీసుకెళ్లండి. దీంతో నీరు అయిపోయినప్పుడల్లా ఎక్కడైనా నింపుకోవచ్చు. ఒక బాటిల్‌ వెంట తీసుకెళితే ఎంతో ప్లాస్టిక్‌కి మనం అడ్డుకట్ట వేసినవాళ్లమవుతాం.
కార్లల్లో… ముఖ్యంగా పిల్లలున్న అమ్మలు బ్యాగుల్లో టిష్యూల ప్యాకెట్లు తప్పకుండా పెట్టుకుంటారు. పిల్లలు స్నాక్స్‌ తిన్నప్పుడు వాళ్ల ముఖం, చేతులు శుభ్రం చేయాలంటే అవి కచ్చితంగా అవసరమవుతాయి. అయితే టిష్యూలను వరుసగా వాడుతూనే ఉంటారు. దీని వల్ల కూడా చెత్త పేరుకుపోతుంది. అందుకే చిన్న న్యాప్కిన్లు ఇప్పుడు బోలెడు దొరుకుతున్నాయి. వాటిని దగ్గర పెట్టుకుంటే ఉపయోగించుకుంటే సరిపోతుంది. ప్రయాణంలో ఉన్నప్పటికీ బస చేసిన చోటైనా వాటిని శుభ్రం చేసుకొని తిరిగి వాడుకోవచ్చు. అక్కడ కుదరకపోతే ఇంటికి వచ్చిన తర్వాత అయినా ఉతుక్కోవచ్చు. దీని వల్ల కూడా మనం పర్యావరణాన్ని కాపాడినవాళ్లమవుతాం.
ప్రయాణాల్లో ఆకలేస్తుందని చాలామంది తినే పదార్థాలను ప్యాక్‌ చేసుకుని వెళతారు. లేదా పార్శిల్‌ తెప్పించుకుంటారు. ప్లాస్టిక్‌ డబ్బాలకు బదులుగా స్టీల్‌ వాటిని ఉపయోగించండి. కరిగి ఆహారం ద్వారా పొట్టలోకి వెళుతుందనే భయం ఉండదు. దీని వల్ల తినడం కూడా సులభమవుతుంది. ప్లాస్టిక్‌ పోగవకుండా ఉంటుంది. ఇవే కాకుండా స్పూన్లు, స్ట్రాల వంటివి దగ్గరుంచుకుంటే మంచిది.
నాలుగు రోజుల ప్రయాణం పెట్టుకుంటాం. ఈ మాత్రానికే బ్రష్‌, పేస్ట్‌, క్రీములు వంటివన్నీ మోసుకెళ్లడం ఎందుకూ అనిపిస్తుంది. కానీ ఒక్కసారి వాడి పడేసిన బ్రష్‌లు, షాంపూ ప్యాకెట్లతో ఎంత నష్టమో మనం ఊహించలేం. అలా అని చిన్న చిన్న కిట్లు కొనుగోలు చేసినా అవి కూడా పర్యావరణానికి నష్టమే. అందుకే తిరిగి వాడుకునే ట్రావెల్‌ కిట్‌లు దొరుకుతున్నాయి. వాటిని కొనుక్కోండి. బాడీవాష్‌, షాంపూ, కండిషన్‌… ఇలా అన్నింటినీ వాటిలో పోసుకోవచ్చు. తిరిగి కావల్సినప్పుడు శుభ్రం చేసుకుని వాడుకోవచ్చు. బరువు భయమూ ఉండదు. చెత్త చేర్చామన్న బాధా ఉండదు.
ఎక్కడికైనా వెళితే గుర్తుగా ఉంటుందని షాపింగ్‌ చేయడం చాలా మందికి అలవాటైనదే. ఒక్కోటీ కొనే చోట ఒక్కో కవరు చేతికొస్తుంది. ఏదో అవసరమొచ్చి మనమైనా కొనాల్సిందే. ఈ తిప్పలన్నీ ఎందుకు? చక్కగా వెంట ఓ క్లాత్‌ బ్యాగును తీసుకెళ్లండి. బరువు కూడా పెద్దగా ఉండదు. ఎక్కువ కాలం వస్తాయి. ముఖ్యంగా సమయానికి మనకు ఉపయోగపడుతుంది. తిరిగొచ్చేటప్పుడు కార్బన్‌ ఫుట్‌ ప్రింట్‌ వదల్లేదన్న సంతృప్తి మిగులుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -