నియామక మార్గదర్శకాలను ఉపసంహరించుకోవాలి
ఈ తిరోగమన చర్యను వ్యతిరేకించాలి : సీఐటీయూ డిమాండ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రయివేట్ వ్యక్తుల నియామక మార్గదర్శకాలు ఉపసంహరించుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. క్యాబినెట్ కమిటీ సవరించిన మార్గదర్శకాలను ఖండించింది. శనివారం సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ), నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో నిర్వహణ స్థానాలను ప్రయివేట్ వ్యక్తుల నియామకానికి కేంద్ర మంత్రివర్గం అక్టోబర్ 4న సవరించిన మార్గదర్శకాలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలనీ, జాతీయ సంస్థల ప్రజా స్వభావాన్ని నిలబెట్టాలని సీఐటీయూ కోరుతోందని వివరించారు. ఈ మార్గదర్శకాలు దశాబ్దాలుగా దేశ ప్రజల ఆర్థిక వ్యవస్థతో నిర్మించిన ప్రభుత్వ ఆర్థిక సంస్థల భద్రత, సమగ్రతకు కలిగించే తీవ్రమైన ముప్పు గురించి సీఐటీయూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుందని పేర్కొన్నారు.
క్యాబినెట్ కమిటీ ఏకీకృత మార్గదర్శకాలతో ప్రయివేట్ రంగ ఎగ్జిక్యూటివ్‌లను మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హౌల్ టైమ్ డైరెక్టర్, చైర్‌పర్సన్ పదవులకు పరిగణించడానికి అనుమతించడం పార్లమెంట్ రాజ్యాంగ అధికారాలను తీవ్రంగా ఉల్లంఘించే మార్గమేనని వివరించారు. జాతీయ ప్రయోజనాలను, ప్రజలను పణంగా పెట్టి ప్రయివేట్ కార్పొరేట్ వర్గాల ప్రయోజనాలకు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించడానికి, ఉపయోగించుకోవడానికి మార్గం సుగమం చేస్తుందని విమర్శించారు. ఈ ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం-1955తో ప్రజల సార్వభౌమ సంకల్పాన్ని వినియోగించి పార్లమెంట్ రూపొందించిన చట్టాలతో స్థాపించిన చట్టబద్ధమైన సంస్థలని పేర్కొన్నారు. బ్యాంకింగ్ కంపెనీల (సముపార్జన మరియు అండర్‌టేకింగ్‌ల బదిలీ) చట్టాలు -1970, 1980, ఎల్‌ఐసీ చట్టం-1956ల్లో ఉన్నత పదవులకు నియామకాలను ఏర్పాటు చేసే పద్ధతులు ఉన్నాయని గుర్తు చేశారు.
ఈ పారదర్శక జవాబుదారీ ప్రభుత్వ నియామక ప్రక్రియను రద్దు చేస్తే, ప్రయివేట్ వ్యక్తులు/రంగానికి అనుకూలంగా ఉంటాయని అన్నారు.ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు చేసిన పోరాట ఉద్యమం కారణంగా నిరాశ చెందిన మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయివేట్ రంగానికి ఉన్నత పదవులను ఇవ్వడానికి ఈ ప్రమాదకరమైన, తిరోగమన చర్యతో ముందుకు వచ్చిందని విమర్శించారు. నయా ఉదారవాద విధానాలకు అనుగుణంగా దేశీయ, విదేశీ కార్పొరేట్‌లకు ప్రయోజనం చేకూర్చడానికి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ.. ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల విధ్వంసక దేశ వ్యతిరేక ప్రయత్నాన్ని ఇది స్పష్టం చేస్తుందని ఆయన వివరించారు. ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల రక్షణకు ఈ సవరించిన ఏకీకృత మార్గదర్శకాలను వ్యతిరేకించే ఉద్యోగులకు సీఐటీయూ తన మద్దతు, సంఘీభావాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ తిరోగమన చర్యలను తీవ్రంగా వ్యతిరేకించాలని సీఐటీయూ కార్మిక వర్గ ఉద్యమానికి పిలుపునిస్తుందని వివరించారు.