![]() |
నేటి నుంచి అంగన్వాడీలో బడిబాట
ఆరోగ్య వంతమైన పౌష్టికాహారం
నవతెలంగాణ – పెద్దవూర
మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అనుముల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 255 అంగన్వాడీ, కేంద్రాలలో సిబ్బంది ఆధ్వర్యంలో నేటి నుంచి 17 వతేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రయివేట్ స్కూల్ వద్దు అంగన్వాడి కేంద్రాలే ముద్దు అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలో ప్రచారం నిర్వహించనున్నారు. ప్రయివేట్ స్కూళ్లకు పిల్లలను పండించడం వల్ల తల్లిదండ్రుల పై ఆర్థిక భారం పడటమే కానీ సక్రమమైన విద్య అందదు. తెలంగాణ ప్రభుత్వం చిన్నారుల సంక్షేమం కోసం అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేసి చిన్నారులకు మంచి విద్యను అందించేందుకు కృషి చేస్తుంది. అంగన్వాడి కేంద్రాల్లో పౌష్టికాహారం అందిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. మీ పిల్లలను అంగన్వాడి కేంద్రాల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు.
అమ్మ మాట అంగన్వాడీ బాట : అమ్మ ఒడి అయిన అంగన్వాడీ బడిలో పిల్లలు అభివృద్ధికి అందించే అవకాశాలు పుష్కలం. పిల్లలు స్వేచ్చగా నేర్చుకనేందుకు రంగు రంగుల బొమ్మలు, కథల పుస్తకాలు, ఆట వస్తువులు, పిల్లల అభివృద్ధికి దోహదపడేటందుకు ప్రియదర్శిని సిలబన్ ద్వారా టీచర్ పిల్లలకు ఇంగ్లీష్ మరియు తెలుగు రైమ్స్, కథలు, వివిధ అంశాలపైన బోధన ఉంటుంది. సంభాషణ, ఆటలు, డ్రాయింగ్, కలరింగ్, ఆక్టివిటీ, పిల్లల ప్రగతిని తెలియజేసే పేరెంట్, టీచర్స్ మీటింగ్స్, పిల్లలను అమ్మలా జాగ్రత్తగా చూసుకునే టీచర్ మరియు ఆయమ్మ, ఆట పాటలతో కూడిన విద్యతో పాటు పిల్లల ఆరోగ్యం కొరకు ప్రతిరోజు పిల్లలకు ఉచితంగా ప్రొద్దున గుడ్డు మధ్యాహ్న భోజనం,సాయంత్రం స్నాక్స్ అందజేస్తున్నారు.