ఎకరాకు7 క్వింటాళ్ల పరిమితి సరిగాదు 
సీసీఐలో ఐదేండ్లుగా లేని నిబంధనలు ఇప్పుడెందుకు?
మిగతా పత్తిని రైతులు ఎక్కడ అమ్ముకోవాలి : కేంద్రానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ 
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి ఇప్పటికే పత్తిపై సుంకాలు ఎత్తేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా సీసీఐ ద్వారా పత్తికొనుగోళ్లపై ఆంక్షలు విధించడం సరిగాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేస్తామని పరిమితి విధించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మిగతా పత్తి పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని నిలదీశారు. ఐదేండ్లుగా లేని నిబంధనలు ఇప్పుడే ఎందుకు అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు పత్తి రైతుల పట్ల శాపాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 
రైతులు ఎంతో వ్యయప్రయాసలకోర్చి సీసీఐ పెట్టిన నిబంధనల ప్రకారం పత్తిని తీసుకువెళ్తుంటే ఇప్పుడు కొత్తగా ఎకరానికి ఏడు క్వింటాళ్ల పరిమితి అనడం కేంద్ర ప్రభుత్వం యొక్క ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విమర్శించారు. సబ్సిడీ దిగుమతులకు కేంద్రం అనుమంతించడం వలన మార్కెట్లో పత్తి రేటు రూ.6000 వరకు పడిపోయిందని తెలిపారు. సీసీఐ మీద భరోసాతో తీసుకొస్తున్న క్రమంలో సీసీఐ నుంచి రాష్ట్ర సర్కారుకు వచ్చిన లేఖ పత్తిరైతులకు ఆశనిపాతం లాంటిదేనని పేర్కొన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్ స్ట్రాటిస్టిక్స్ అంచనాల ప్రకారం తెలంగాణలో సరాసరి దిగుమతి 7 క్వింటాళ్లు కాబట్టి అంతే కొనుగోలు చేస్తామని ప్రకటించడం సహేతుకం కాదని తెలిపారు.
నల్లరేగళ్ల ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని గుర్తుచేశారు. మిగతా పత్తిని రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. ఇటువంటి నిబంధనలతో రైతాంగాన్ని గోస పెట్టడం సరికాదని హితవు పలికారు. వెంటనే సీసీఐ అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనను తీసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దిగుమతి సుంకాలు ఎత్తివేయడంపై పునరాలోచన చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ‘అమ్మ పెట్టాపెట్టదు, అడుక్కోనివ్వదు’ అన్న చందంగా కేంద్రం ఒకవైపు సుంకాలు ఎత్తివేసి, బహిరంగ మార్కెట్లో పత్తికి ధర పతనమయ్యేలా చేసిందీ, ఇంకోవైపు సీసీఐ ద్వారా సవాలక్ష కొర్రీలు పెట్టిందీ కేంద్రమేనని విమర్శించారు. తెలంగాణ పత్తి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎకరాకు 7 క్వింటాళ్ల నిబంధనను ఎత్తేసి పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలనీ, తేమశాతం 20 వరకు ఉన్నా పత్తిపంటను కొనుగోలు చేసేలా సీసీఐని ఆదేశించాలని డిమాండ్ చేశారు. జిన్నింగ్ మిల్లర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
పత్తి సేకరణపై ఆంక్షలొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

                                    

