యావత్ వ్యవస్థ స్పందించాలన్న చీఫ్ జస్టిస్
న్యూఢిల్లీ : యాసిడ్ దాడులకు పాల్పడేవారిపై న్యాయస్థానాలు అస్సలు సానుభూతి చూపరాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గురువారం వ్యాఖ్యానించారు. వారికి వ్యతిరేకంగా ‘మొత్తంగా వ్యవస్థ’ స్పందించాలని అన్నారు.యాసిడ్ దాడి నుండి బయటపడిన షాహీన్ మాలిక్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. వికలాంగుల హక్కుల చట్టం, 2016 కింద యాసిడ్ దాడికి గురైనవారిని నిర్దిష్ట అంగవైకల్యం గలవారిగా గుర్తించాలని ఆమె కోరుతున్నారు.కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చీఫ్ జస్టిస్ అభిప్రాయంతో ఏకీభవించారు. బాధితుల పట్ల యాసిడ్ దాడికి పాల్పడినవారు ఎంత నిర్దాక్షిణ్యంగా, కర్కశంగా వ్యవహరించారో అదే రీతిలో వారు కూడా ఈ కర్కశత్వాన్ని ఎదుర్కొనాల్సి వుందని అన్నారు. ఇందుకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకువచ్చే విషయాన్నికేంద్రం పరిశీలించాలని చీఫ్ జస్టిస్ కోరారు.
దీనిపై మెహతా స్పందిస్తూ పిటిషనర్ల ప్రయోజనాలను ఎవరూ వ్యతిరేకించరని, వారిని కూడా వికలాంగులుగా గుర్తించాల్సి వుందని, చట్ట పరిధి కిందకు వారిని కూడా తీసుకురావాల్సి వుందన్నారు. మాలిక్ కేసు గత 16ఏండ్ల నుంచి పెండింగ్‌లో వుందని తెలుసుకుని న్యాయస్థానం దిగ్బ్రాంతికి గురైంది. దాడి జరిగేనాటికి ఆమె వయస్సు 26ఏండ్లు. ఎంబీఏ చదువుతోంది. తాను పనిచేస్తున్న ప్రదేశం వెలుపలే ఆమె దాడికి గురయ్యారు. ఆ తర్వాత ఆమెకు 25వరకు సర్జరీలు అయ్యాయి. ప్రత్యేకంగా యాసిడ్ దాడి కేసులను ఏ రోజుకారోజు విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని చీఫ్ జస్టిస్ ప్రతిపాదించారు. యాసిడ్ దాడి కేసుల్లో పెండింగ్‌లో వున్న విచారణలు వాటి వివరాలు, సంఖ్య అన్నీ తెలియచేయాల్సిందిగా రాష్ట్ర హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్స్‌ను కోర్టు ఆదేశించింది.



