పీఎం-కేర్స్, పీఎం ఎన్‌ఆర్‌ఎఫ్, ఎన్‌డీఎఫ్‌లపై పీఎంఓ : లోక్‌సభ సెక్రెటేరియట్‌కు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడి
నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చని స్పష్టీకరణ
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి సహాయ నిధి (పీఎం-కేర్స్), ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ ఆర్‌ఎఫ్), జాతీయ రక్షణ నిధి (ఎన్‌డీఎఫ్)లకు సంబంధించి లోక్‌సభలో ప్రశ్నలు అడగడం అనుమతించదగినది కాదని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) స్పష్టం చేసింది. ఈ విషయాన్ని లోక్‌సభ సెక్రెటేరియట్‌కు తెలిపింది. ఈ మేరకు కొన్ని నిబంధనలను పేర్కొంది. పీఎంఓ నిర్ణయంపై సర్వత్రా చర్చకు దారితీస్తున్నది. ఇది అందరిలోనూ పలు అనుమానాలు కలిగిస్తున్నది. లోక్‌సభ విధి విధానాలు, నిర్వహణ నియమావళిలోని నిబంధనల ప్రకారం ఈ మూడు నిధులకు సంబంధించిన ప్రశ్నలు ఆమోదయోగ్యం కావని వివరించింది. గతనెల 30న లోక్‌సభ సెక్రెటేరియట్‌కు పీఎంఓ దీనిని తెలియజేసినట్టు ఓ ఆంగ్ల వార్త కథనం పేర్కొన్నది.
కేంద్రం పేర్కొన్న నిబంధనల ప్రకారం… భారత ప్రభుత్వ ప్రధాన బాధ్యతకు సంబంధించినవి కాని విషయాలపై ప్రశ్నలు అడగరాదు. అలాగే ప్రభుత్వం ప్రధానంగా బాధ్యత వహించని సంస్థలు లేదా వ్యక్తుల నియంత్రణలో ఉన్న అంశాలపై ప్రశ్నలు అనుమతించ రాదు. ఈ నిబంధనల ఆధారంగా పీఎంకేర్స్, పీఎంఎన్‌ఆర్‌ఎఫ్, ఎన్‌డీఎఫ్ నిధులు ప్రభుత్వం నేరుగా నిర్వహించే నిధులు కావనీ, అందువల్ల వీటిపై పార్లమెంటు ప్రశ్నలు అనుమతించలేమని పీఎంఓ వాదించింది. ఈ మూడు నిధుల మూలధనం (కార్పస్) పూర్తిగా ప్రజల స్వచ్ఛంద విరాళాలతోనే ఏర్పడిందనీ, కేంద్ర సమీకృత నిధి నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని పీఎంఓ.. లోక్‌సభ సెక్రెటేరియట్‌కు వివరించింది.
భవిష్యత్తులో ఈ నిధులకు సంబంధించి ప్రశ్నలు, జీరో అవర్ నోటీసులు, ప్రత్యేక ప్రస్తావనలు వచ్చినట్టయితే… ఈ నిబంధనలను అనుసరించి వాటి అనుమతిపై నిర్ణయం తీసుకోవచ్చని కూడా పీఎంఓ సూచించింది. కాగా ఈ అంశంపై సదరు ఆంగ్ల వార్త సంస్థ పీఎంఓకు ఈమెయిల్ పంపింది. దీనిపై ప్రధాన మంత్రి కార్యాలయం స్పందించలేదు. అలాగే లోక్‌సభ సెక్రెటేరియట్‌లోని మీడియా అండ్ పబ్లిక్ రిలేషన్ శాఖ జాయింట్ సెక్రెటరీ ముకేశ్ కుమార్ శర్మ కూడా దీనిపై స్పందించలేదు. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి అందినట్టుగా తెలుస్తున్న ఈ సమాచారం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ నిధుల విషయంలో గోప్యత పాటించాల్సిన అవసరం ఏమిటనీ పలువురు ప్రశ్నిస్తున్నారు.
పీఎం-ఎన్‌ఆర్‌ఎఫ్
ఇది ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి. దీనిని 1948లో ఏర్పాటు చేశారు. దీనిని ప్రకృతి విపత్తులు, అల్లర్లు, ప్రమాదాల్లో మరణించినవారి కుటుంబాలకు తక్షణ సహాయం అందించేందుకు ఉపయోగిస్తారు.
జాతీయ రక్షణ నిధి (ఎన్‌డీఎఫ్)
సాయుధ దళాలు, పారామిలిటరీ దళాల సభ్యులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ఈ నిధిని ఉపయోగిస్తారు. ఈ నిధికి ప్రధాన మంత్రి చైర్‌పర్సన్‌గా ఉంటారు. రక్షణ, ఆర్థిక, హౌం మంత్రులు సభ్యులుగా ఉంటారు.
పీఎం-కేర్స్ ఫండ్
కోవిడ్ వంటి జాతీయ అత్యవసర పరిస్థితుల్లో సహాయ చర్యల కోసం నిధులు సమీకరించేందుకు 2020 మార్చి 27న పీఎం కేర్స్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. ఈ నిధి ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్‌గా నమోదు చేయబడింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చివరి నివేదిక ప్రకారం.. మార్చి 2023 నాటికి పీఎం కేర్స్ ఫండ్‌లో రూ.6283.7 కోట్లు నిల్వగా ఉన్నాయి. 2023లో ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌లో.. పీఎం కేర్స్ ఫండ్ రాజ్యాంగం లేదా పార్లమెంటు చేసిన చట్టం ద్వారా ఏర్పడినదికాదని స్పష్టం చేసింది. అలాగే అది సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి కూడా రాదని పేర్కొంది.



