Saturday, March 14, 2026
E-PAPER
Homeజాతీయంమహిళల నెలసరి సెలవుల పిటిషన్‌కు నో

మహిళల నెలసరి సెలవుల పిటిషన్‌కు నో

- Advertisement -

కొట్టివేసిన సుప్రీంకోర్టు… వారి ఉపాధిపై తీవ్ర ప్రభావం

న్యూఢిల్లీ : మహిళలకు తప్పనిసరి నెలసరి సెలవుల పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ చట్టం మహిళల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని, మహిళలను ఎవరూ నియమించుకోరని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పనిచేసే మహిళల్లో ఈ చట్టం తాము పురుషుల కంటే తక్కువ అనే మానసిక భయం లేదా అభిప్రాయాన్ని కలిగిస్తుందని తెలిపారు.

మహిళలకు తప్పనిసరి రుతుక్రమ సెలవులు మంజూరు చేసేందుకు అవసరమైన నిబంధనలను రూపొందించాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు పైవిధంగా స్పందించింది. అవగాహన కల్పించడం, పరిశుభ్రత గురించి తెలియజేయడం వేరు కానీ.. సెలవులను తప్పనిసరి చేస్తూ చట్టం చేస్తే మహిళలను ఎవరూ నియమించుకోరని పిటిషనర్‌ను సుప్రీం హెచ్చరించింది. మహిళలను తక్కువ చేసి మాట్లాడతారని, రుతుక్రమాన్ని చెడుగా పేర్కొంటారని తెలిపింది.

2013లో విజయన్‌ ప్రభుత్వం కేరళలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లోని మహిళా విద్యార్థులకు నెలసరి సెలవులు మంజూరు చేసిందని సీనియర్‌ న్యాయవాది ఎం.ఆర్‌.షంషాద్‌ హైలెట్‌ చేశారు. ఈ నిర్ణయం లింగ-సమసమాజాన్ని సాకారం చేసుకోవాలనే నిబద్ధతలో భాగమని విజయన్‌ తెలిపారన్నారు. ప్రయివేట్‌ కంపెనీలు కూడా ఇటువంటి సడలింపులు ఇచ్చాయని ఎం.ఆర్‌.షంషాద్‌ పేర్కొన్నారు. అయితే ఇవి స్వచ్ఛంద చర్యలు అని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు. మీరు చట్టంలో తప్పనిసరి అని పేర్కొన్న వెంటనే మహిళలకు ఎవరూ ఉద్యోగాలు ఇవ్వరని తెలిపారు. ఎవరూ వారిని న్యాయవ్యవస్థ లేదా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోరని, వారి కెరీర్‌ ముగుస్తుందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -