ఆసియా కప్‌పై బోర్డులో చర్చ జరుగలేదు
బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా
నవతెలంగాణ-ముంబయి :
ఆసియా కప్ నుంచి భారత్ వైదొలిగిందని వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవాజిత్ సైకియా స్పష్టత ఇచ్చారు. 2025 మహిళల, పురుషుల ఆసియా కప్ ఆతిథ్య హక్కులు బీసీసీఐ సొంతం. వచ్చే నెలలో శ్రీలంక వేదికగా జరుగనున్న మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌కు భారత్ దూరమైందని, ఇదే విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు బీసీసీఐ తెలియజేసిందని వార్త కథనాలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా వివరణ ఇచ్చారు. ‘ఆసియా కప్ నుంచి భారత్ వైదొలగటం అవాస్తవం. ఆ వార్తలో ఎటువంటి నిజం లేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ టోర్నమెంట్లపై బీసీసీఐలో ఎటువంటి చర్చ జరుగలేదు. బీసీసీఐ ప్రస్తుతం ఐపీఎల్18, ఇంగ్లాండ్ సిరీస్‌పై దృష్టి సారించింది. ఆసియా కప్‌పై బీసీసీఐ ఆలోచన చేసి, చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటే ఆ విషయాన్ని మీడియాకు తెలియజేస్తుందని’ సైకియా తెలిపారు. పురుషుల 2025 ఆసియా కప్ సెప్టెంబర్‌లో జరగాల్సి ఉంది. ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మెన్‌గా కొనసాగుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మెన్ మోషిన్ నక్వీ ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఆ వార్తల్లో నిజం లేదు
- Advertisement -
- Advertisement -