Saturday, January 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌పై యుద్ధం వద్దు

ఇరాన్‌పై యుద్ధం వద్దు

- Advertisement -

రంగంలోకి దిగిన గల్ఫ్‌దేశాలు, టర్కీ
ఒత్తిడితో వెనక్కి తగ్గిన అమెరికా?
పరిస్థితులను గమనిస్తున్నామన్న అధ్యక్ష భవనం

వాషింగ్టన్‌ : ఇరాన్‌పై అమెరికా దాడికి తెగబడితే అది మధ్యప్రాచ్యంలో ప్రధానమైన, తీవ్రమైన ఘర్షణకు దారితీస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గల్ఫ్‌ దేశాలు, టర్కీ రంగంలోకి దిగాయి. ఇరాన్‌పై వైమానిక దాడులు చేయవద్దని అమెరికాను కోరాయి. అమెరికాను శాంతపరచేందుకు సౌదీ అరేబియా, ఖతార్‌, టర్కీ నేతలు ప్రయత్నాలు చేపట్టారు. సౌదీ అరేబియా ఓ అడుగు ముందుకు వేసి దాడులకు తన గగనతలాన్ని ఉపయోగించు కునేందుకు అమెరికాకు అనుమతి నిరాకరించింది. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి, రాకుమారుడు ఫైసల్‌ బిన్‌ ఫర్హాన్‌ గురువారం ఇరాన్‌, ఒమన్‌, టర్కీ నేతలతో టెలిఫోన్‌ సంప్రదింపులు జరిపి తాజా పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ అరబ్‌ దేశాలలో పర్యటిస్తూ వాటితో సంబంధాలను మెరుగుపరచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలావుండగా ఇరాన్‌పై దాడి చేయాలన్న నిర్ణయం నుంచి ట్రంప్‌ తాత్కాలికంగా వెనక్కి తగ్గారని తెలుస్తోంది.

ఇరాన్‌లో నిరసనకారులపై మారణకాండను ఆపేశామని, ఎవరినీ ఉరితీయాలని అనుకోవడం లేదని తనకు హామీ లభించిందని ఆయన చెప్పారు. బుధవారం రాత్రి శ్వేతసౌధంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ఇరాన్‌లో హత్యాకాండ ఆగిపోయిందని మాకు చెప్పారు. ఉరితీతలు కూడా జరగడం లేదు’ అని అన్నారు. అయితే ఈ వార్తలను ధృవీకరించుకోవాల్సి ఉన్నదని తెలిపారు. కాగా అరబ్‌ దేశాల నుంచి వచ్చిన ఒత్తిడులు, ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ అభ్యర్థన కారణంగా ట్రంప్‌ వెనక్కి తగ్గారని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియాలోని అనేక అమెరికా భాగస్వామ్య దేశాలు కూడా ట్రంప్‌ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి. అయితే సైనిక చర్యను తోసిపుచ్చలేమని అధ్యక్ష భవనం అంటోంది. ‘ఏం చేయాలో అధ్యక్షుడికి మాత్రమే తెలుసు. సలహాదారుల బృందం అన్ని విషయాలను పరిశీలిస్తోంది. ఇరాన్‌లో క్షేత్ర స్థాయి పరిస్థితులను ట్రంప్‌ గమనిస్తున్నారు’ అని అధ్యక్ష భవనం ప్రెస్‌ సెక్రెటరీ కరోలిన్‌ లీవిట్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -