Monday, September 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎటూ తేల్చుతలే!

ఎటూ తేల్చుతలే!

- Advertisement -

బోధన్‌ ఎన్‌ఎస్‌ఎఫ్‌పై ప్రభుత్వం సైలెంట్‌ : శ్రీధర్‌బాబు చైర్మెన్‌గా కమిటీ వేసినా ముందడుగు లేదు
ఎన్నికల ప్రచారాస్త్రంగానే షుగర్‌ఫ్యాక్టరీ
పాదయాత్ర చేపట్టి తర్వాత పట్టించుకోని ఎంపీ అరవింద్‌
పునరుద్ధరణకు కేంద్రం నుంచి పైసా నిధులు తీసుకురాని వైనం

నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘ఫ్యాక్టరీ పరిసరాల్లో చెరుకు లోడ్‌తో ఎడ్లబండ్లు, లారీలు. చుట్టుపక్కల కార్మికుల కదలికలు. ఫ్యాక్టరీ సముదాయంలో నిగనిగలాడుతూ చక్కెర రాశులు. పనుల కోసం వచ్చి వెళ్లే వారితో, వారి కోసం ఏర్పడ్డ దుకాణ సముదాయాలతో బోధన్‌ పట్టణం కళకళలాడుతుండేది’. గతం ఎంతో ఘనం అన్నట్టు.. షుగర్‌ ఫ్యాక్టరీకి లే ఆఫ్‌ ప్రకటించిన నాటి నుంచి వెలవెలబోతోంది. ఇప్పటికీ ఫ్యాక్టరీ కొనసాగితే.. బోధన్‌ పట్టణంతో పాటు నిజామాబాద్‌ జిల్లా స్థాయి వేరేలా ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఎన్నికల సమయంలో హామీలు గుప్పించిన బీజేపీ, బీఆర్‌ఎస్‌.. తమ పదవీకాలంలో దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం తిరిగి తెరిపిస్తామని ప్రకటించి ఓ కమిటీ సైతం వేసింది.

ప్రారంభంలో హడావుడి చేసి తర్వాత సైలెంట్‌ కావడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లోని నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా పేరుగాంచింది. దీని పరిధిలో 16 వేల ఎకరాలు బోధన్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేది. క్రషింగ్‌ ప్రారంభించిన తర్వాత నిత్యం 3600 టన్నులు క్రషింగ్‌ చేసేవారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ప్రయివేటీకరించేందుకు నష్టాలనే సాకును ముందుకు తీసుకొచ్చి 2002లో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంగా జాయింట్‌వెంచర్‌లోకి వెళ్లింది. అంత వరకు 2000 మంది కార్మికులు పని చేస్తుండగా.. ఒక్కసారిగా కార్మికులను 300 వరకు కుదించారు. చివరకు 2015 డిసెంబర్‌ 23వ తేదీన కార్మికులు, రైతుల ఆశలను తుంచుతూ లే ఆఫ్‌ ప్రకటించారు.

ఫ్యాక్టరీని వాడుకుంటూ రాజకీయాలు
బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీ బంద్‌ అయినా దాని పేరుతో రాజకీయం మాత్రం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్‌.. అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడిపిస్తామని చెప్పగా.. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే లే ఆఫ్‌ ప్రకటించడం గమనార్హం. అయినా ప్రారంభించేందుకు తీసుకున్న చర్యలు శూన్యమే. ఎంపీ అరవింద్‌ 2018లో ఏకంగా ‘చెరుకు రైతుల పరిరక్షణ’ పేరిట పది రోజుల పాటు పాదయాత్ర చేపట్టారు. ఎంపీగా గెలిచిన నాటి నుంచి ఫ్యాక్టరీని పట్టించుకున్న పాపాన పోలేదు. రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచినప్పటికీ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్రం నుంచి నయా పైసా తీసుకొచ్చిన దాఖలాలు లేవని రైతులు ఆరోపిస్తున్నారు.

కమిటీ పేరుతో కాలయాపన
2024 ఎన్నికల సమయంలో ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి రాగానే ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు చైర్మెన్‌గా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల భాగస్వామ్యంతో 2024 ఫిబ్రవరి 4వ తేదీన కమిటీని ప్రకటించింది. ఆ కమిటీ అదే నెల 25వ తేదీన బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీని సందర్శించి రైతులతో మాట్లాడారు. ఆ సమయంలో సైతం శ్రీధర్‌బాబు ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని ప్రకటించారు. తదనంతరం 2025 జనవరి 4వ తేదీన ఎడపల్లిలో ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, భూపతిరెడ్డి, కలెక్టర్‌, అధికారులు చెరకు రైతులతో సమావేశం నిర్వహించారు. సాగుకు రైతులు ముందుకు వస్తే ఫ్యాక్టరీని ప్రభుత్వం పునరుద్ధరించనున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఫ్యాక్టరీ కోసం ఎలాంటి చర్యలూ తీసుకున్న దాఖలాలు లేవు.

భరోసా కల్పిస్తే సాగుకు రైతులు సిద్ధమే
ఫ్యాక్టరీ 2015 నుంచి పూర్తిగా మూసివేసి ఉండటంతో మిషిన్లు తుప్పు పట్టాయి. గట్టిగా పట్టుకొని లాగితే ఊడివచ్చేలా ఇనుము తుప్పు పట్టి ఉంది. తిరిగి క్రషింగ్‌ చేసేందుకు పనికివచ్చే స్థితిలో లేవు. రైస్‌మిల్‌ ఏర్పాటు చేసేంత స్థలంలో చెరుకు ఫ్యాక్టరీని నడిపించేలా ప్రస్తుత టెక్నాలజీతో అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వ్యయం కూడా తక్కువే అయ్యే అవకాశం ఉంది. చెరకు సాగుకు నాణ్యమైన సీడ్‌ ఇవ్వడంతో పాటు సబ్సిడీలు ప్రకటించి, సాగు చేసిన రైతులకు ప్రోత్సాహాకాలు ప్రకటిస్తే మేలు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకొని భరోసా కల్పిస్తే చెరకు సాగు చేసేందుకు రైతులు సైతం సిద్ధంగా ఉన్నారు. విధానపర నిర్ణయం తీసుకోకుండా ముందు సాగుచేయాలని చెప్పి తర్వాత పట్టించుకోకుంటే తమ పరిస్థితి ఏమి కావాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.

చిరస్థాయిలో నిలిచే అవకాశం
కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి కృషి చేసి చెరకు ఫ్యాక్టరీని పునరుద్దరిస్తే ఆయన కీర్తి చిరస్థాయిలో నిలిచే అవకాశం ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఫ్యాక్టరీ మూత తో బోధన్‌ ప్రాభవం కోల్పోయిందని.. తిరిగి తెరిస్తే.. వన్నె తెచ్చే వారవుతారని నియోజకవర్గ వాసులు అంటున్నారు.

మెట్‌పల్లి ఫ్యాక్టరీ నడిపిస్తే రైతులకు భరోసా: కేపీ శ్రీనివాస్‌రెడ్డి, రైతు
బోధన్‌ చుట్టుపక్కల చెరకు సాగుకు అనువైన భూములున్నాయి. బోధన్‌లో ఉన్న ఫ్యాక్టరీ ఇప్పుడు తెరిపిం చినా క్రషింగ్‌ చేసేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో దీని పరిధిలోని మెట్‌పల్లి ఫ్యాక్టరీని ప్రారం భిస్తే రైతులకు భరోసా కల్పించినవారవుతారు. అలా చేస్తే ఇక్కడి రైతులు చెరకు సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రైతులు సైతం వరికి ప్రత్యామ్నాయంగా చెరకు సాగు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -