Thursday, February 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపని లేదు… మేం పోతాం

పని లేదు… మేం పోతాం

- Advertisement -

హెచ్‌ఎండీఏలో వింత పరిస్థితి .. డిప్యూటేషన్‌పై జీహెచ్‌ఎంసీకి వెళ్లేందుకు పైరవీలు
పనిలేని చోట ఉండలేమంటున్న సిబ్బంది
మరోవైపు ఉద్యోగుల సంఖ్య పెంపునకు జీహెచ్‌ఎంసీ కసరత్తు
హెచ్‌ఎండీఏ గ్రోత్‌ ప్రాంతం జీహెచ్‌ఎంసీలో కలవడమే కారణమా?
బిల్డింగ్‌ పర్మిషన్లూ, ఇతర పనులన్నీ అందులోకే
ఫైల్స్‌ రావడం లేదని ఉద్యోగుల వెల్లడి

నవతెలంగాణ-హైదరాబాద్‌ (హెచ్‌ఎమ్‌డీఏ )
హెచ్‌ఎండీఏలో వింత పరిస్థితి నెలకొంది. హెచ్‌ఎండీఏ వికేంద్రీకరణలో భాగంగా జోన్లు పెంచి, మరింత మంది అధికారుల పెంపునకు ఉన్నతాధికారులు ప్రయత్నం చేస్తుంటే.. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఇక్కడ తమకు పనిలేదని జీహెచ్‌ఎంసీ వైపు వెళ్లడానికి డిప్యూటేషన్ల కోసం పైరవీలు చేస్తున్నారు. ఇందుకు హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రోత్‌ కారిడార్‌ జీహెచ్‌ఎంసీలో కలవడంతో ఇక్కడి ఉద్యోగులకు పనిలేకుండా పోయింది. పనిలేనిచోట తాము ఉండలేమంటున్న ఉద్యోగులు ఇతర ప్రాంతాల వైపు చూస్తున్నారు. అయితే ఉన్నతాదికారులు మాత్రం డిప్యూటేషన్లకు తావు లేదని తేల్చి చెబుతున్నారు. హెచ్‌ఎండీఏ రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు 2 కిలో మీటర్లు దాటి విస్తరించింది. 11 జిల్లాలు, 104 మండలాలు, 1,355 గ్రామాల వరకు సుమారు 10 వేల చదరపు కిలో మీట్లర్లుకు హెచ్‌ఎమ్‌డీఏ వ్యాపించింది.

భవిష్యత్‌లో పాలన సౌలభ్యం కోసం ఉద్యోగుల పెంపునకు ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇద్దరు జాయింట్‌ కమిషనర్లను కూడా నియమించేందుకు నిర్ణయించింది. 6 జోన్లను మరో 6 జోన్లకు పెంచుతూ 12 జోన్లు చేసేందుకు నిర్ణయించింది. ఇందుకు తగిన సిబ్బందిని కూడా పెంచుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో హెచ్‌ఎమ్‌డీఏ అధికారులు డిప్యూటేషన్ల కోసం పైరవీలు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వారు ఇక్కడ పనిచేసేందుకు ఎందుకు సుముఖంగా లేరు అనే దానిపై హెచ్‌ఎండీఏ ఆరా తీసింది. హెచ్‌ఎమ్‌డీఏ గ్రోత్‌ కారిడార్‌ మొత్తం జీహెచ్‌ఎంసీలో విలీనం కావడమేనని తేలింది. ఓఆర్‌ఆర్‌ పరిధిలోని 27 మున్సిపాలిటీలు జీహెచ్‌ఎంసీలో విలీన మయ్యాయి. దీంతో హెచ్‌ఎమ్‌డీఏ అధికారులు తమకు పనిలేదు అంటున్నారు. ఐదారు ఫైల్స్‌ వస్తే ఎక్కువ అన్నట్టు ఉంది.

బిల్డింగ్‌ పర్మిషన్లూ జీహెచ్‌ఎమ్‌సీలోనే..
హైదరాబాద్‌లో నిర్మాణ రంగం మొత్తం ఓఆర్‌ఆర్‌ వెలుపల ఎక్కువగా ఉంటుంది. హైరైజ్‌ నిర్మాణాలు మొత్తం ఇక్కడే చేపడుతున్నారు. జీహెచ్‌ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మొత్తం గ్రోత్‌ కారిడార్‌ అంతా ఏ బిల్డింగ్‌కు పర్మిషన్లు ఇవ్వాలన్న జీహెచ్‌ఎంసీ ఇవ్వాల్సిందే. హెచ్‌ఎమ్‌డీఏ ప్రాంతం మొత్తం ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతలి భాగం కావడంతో ఇక్కడ నిర్మాణాలు చేపట్టడం లేదు. ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే కొంత నిర్మాణాలు ప్రారంభం అవుతున్నాయి. దాంతో హెచ్‌ఎమ్‌డీఏకు పర్మిషన్ల ఫైల్స్‌ తగ్గాయి. రెవెన్యూ కూడా తగ్గింది. హెచ్‌ఎమ్‌డీఏకు పూర్వ వైభవం తీసుకువస్తామని ఉన్నతాధికారులు అంటున్నారు.

ఉద్యోగులను కాపాడుకునే ప్రయత్నం
హెచ్‌ఎమ్‌డీఏలో ఉద్యోగులు డిప్యూటేషన్లు కోరుతున్న నేపథ్యంలో డిప్యూటేషన్లు ఇచ్చే అవకాశం లేదని ఉన్నతాధికారులు తేల్చిచెబుతున్నారు. హెచ్‌ఎండీఏ వికేంద్రీకరణలో భాగంగా ఉద్యోగులను పెంచుకోవాల్సి ఉందని, ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సిబ్బంది డిప్యూటేషన్ల కోరడం, ఉన్నతాధికారులు మరింత మంది అధికారులు కావాలని చెప్పడం హెచ్‌ఎండీఏలో వింత పరిస్థితికి అద్దం పడుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -