Sunday, January 18, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినోబుల్‌ ప్రైజ్‌ - డోనాల్డ్‌ ట్రంప్‌

నోబుల్‌ ప్రైజ్‌ – డోనాల్డ్‌ ట్రంప్‌

- Advertisement -

అది స్విట్జర్‌లాండ్‌ నేషనల్‌ బ్యాంకు. సాధారణంగా ఆ బ్యాంకు వద్ద అతితక్కువ మంది ఖాతాదారులు ఉంటారు. ఐతే వారంతా దేశ, విదేశాల నుండి వచ్చిన వారు. అత్యంత ధనవంతులూ ఉంటారు. కానీ ఇపుడు బ్యాంకు ముందు ఉన్నవాళ్లలో ధనవంతులు లేరు. బాగా మేధావులు, శాస్త్రవేత్తలు ఎక్కువగా ఉన్నారు. అందరూ లోపలికి వెళ్లటానికి ప్రయత్నిస్తున్నారు. కాని అక్కడున్న గార్డులు అనుమతించటం లేదు. బయట జరుగుతున్న వ్యవహారాన్ని బ్యాంకు మేనేజరు గమనించాడు. ఎపుడూ లేనిది ఇంతమంది ఖాతాదారులు రావటాన్ని చూసి ఆయున ఆశ్చర్యపోయాడు. గేటువద్ద ఉన్న గార్డుకు ఫోను చేసి విషయం ఏమిటో కనుక్కోమన్నాడు! బాసు ఆర్డరు ప్రకారం గార్డు ”మీరంతా ఎందుకు వచ్చారు?” అని అడిగాడు అక్కడ గుమిగూడిన వారిని. గుంపులో నుండి ఒక పెద్దాయన ముందుకు వచ్చాడు.

”మీరు..ఖాతాదారులతో ఇలాగే మాట్లాడతారా?” గద్దించాడు. గార్డు బిత్తరపోయి మేనేజర్‌కి విషయం తెలియచేశాడు. మేనేజరుకు అది నిజమేనన్పించింది! వాళ్లంతా తన ఖాతాదారులేనేమో! వేల కోట్ల డాలర్లు తమ బ్యాంకులో డిపాజిట్‌ చేసిన వారితో ఇలా వ్యవహరించటం తనదే పొరబాటది గుర్తించి, అందరిని లోపలికి పంపమన్నాడు. గేటు బయట గార్డు ఒక్కొక్కరినీ లోపలకు పంపుతున్నాడు. వాళ్ల వద్ద పెద్ద బ్రీఫ్‌కేసులు లాంటివేమీ లేవు. అందరివద్దా చిన్న బ్యాగులు మాత్రమే ఉన్నాయి. ఆ బ్యాగులు స్కాన్‌ చేస్తుంటే మేనేజరు ముందున్న టీవీలో బ్యాగ్‌లోని వస్తువులు కనబడుతు న్నాయి. బ్యాగులోని వస్తువులను టీవీలో చూస్తుంటే మేనేజర్‌కి నీరసం వచ్చింది ఒక్కరి బ్యాగులో కూడా డబ్బులు కట్టలు గాని, బంగారు బిస్కట్లుగాని కనబడలేదు. కాబట్టి, డిపాజిటు చేయడానికి రాలేదని నిర్ణయించుకున్నాడు. మరి ఒకేసారి ఇంతమంది తమ డిపాజిట్లు విత్‌ డ్రా చేసుకుంటే ఎలా అనే డౌటు మేనేజరును తొలుస్తున్నది. బ్యాగుల్లో చిన్న మెడల్స్‌, ఇంకా సర్టిఫికెట్స్‌ల లాంటివి మాత్రే స్కాన్‌లో కనబడ్డాయి.

ఈలోగా అందరూ లోపలికి వచ్చారు. అందర్నీ మర్యాదగా ఆహ్వానించి కూర్చోబెట్టారు. ”సర్‌! బ్యాంకు మీ సేవకు సిద్ధంగా ఉంది! ఏం కావాలో చెప్పండి” అడిగాడు మేనేజర్‌. ”మా వద్ద ఉన్న విలువైన వస్తువులను మీ బ్యాంకులో డిపాజిట్‌ చేయటానికి వచ్చాము. మా విలువైన వస్తువులు కేవలం మీ వద్ద మాత్రమే భద్రంగా ఉంటాయనే నమ్మకం మాకు ఉంది. మీ బ్యాం కులో ఉంటే ఎవరూ తీసుకెళ్లలేరు! ఈ వస్తువులు మా వద్ద ఉంటే బలవంతంగానో, ఇష్ట పూర్వకంగానో ఎవరికైనా మేమే ఇవ్వాల్సివస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా మా విలువైన వస్తువులు మీ బ్యాంకులో డిపాజిట్‌ చేయటానికి వచ్చాము” అన్నారు వారు. బ్యాంకు మేనేజరు వారు మాటలకు తికమక పడ్డాడు. ఐతే ఆయనికి ఒకటి మాత్రం అర్థమైంది. ఏదో విలువైన వస్తువులు డిపాజిట్‌ చేయటానికి వచ్చారు. అది చాలు అనుకున్నాడు.

అంగీకార సూచకంగా తలూపాడు మేనేజర్‌. వెంటనే వచ్చిన వారు తమ బ్యాగులోని విలువైన వస్తువులు బయటపెట్టారు. అందరూ బయటపెట్టినవి గోల్డ్‌మెడల్స్‌ ఇంకా సర్టిఫికేట్లు! మేనేజర్‌తో పాటుమిగతా సిబ్బంది మరింత జాగ్రత్తగా చూశారు. ఆశ్చర్యం, వారు డిపాజిట్‌ చేయదల్చుకున్నవీ, నోబుల్‌ ప్రైజుగా ఇచ్చిన గోల్డ్‌ మెడల్స్‌, నోబుల్‌ సిర్టిఫికేట్స్‌. అది చూసి మేనేజరు కళ్లు తిరిగి పడిపోయాడు. ఎవరో నీళ్లు చల్లితే లేచి కూర్చున్నాడు. ”ప్రైజులూ, సర్టిఫికేట్లు డిపాజిట్‌ చేయటానికి వచ్చారా? విలువైన వస్తువులంటే ఏమో అనుకున్నాను. ఇదేం బ్యాకో తెలుసా?” అన్నాడు కోపంగా. ”తెలుసు! స్విస్‌ బ్యాంకు అనే వచ్చాము. ఇది మామూలు ప్రైజు కాదు. నోబుల్‌ ప్రైజు. ఇదిగో ఈ మెడల్‌ బంగారంతో చేసింది చూడండి! అంటూ ఒక మేధావి తన మెడల్‌ చూపాడు.
”చాల్చాలు! నోబుల్‌ పతకం బరువు 175 గ్రాములు మాత్రమే! ఇక్కడికొచ్చిన వారి ప్రైజుల బంగారం అంతా కలిపితే ఒక క్వింటాలు కూడా కాదు. మా వద్ద డిపాజిట్‌ చేయాలంటే కనీసం క్వింటాలు బంగారం ఉండాలి! గ్రాముల బరువున్న బంగారాన్ని మేము అసలు చూడనే చూడం. దయచేసి వెళ్లండి!” అన్నాడు మేనేజరు.

అక్కడున్న వారిలో కొందరు ముందుకు వచ్చారు అందులో ఒకాయన ”సర్‌ మాకు నోబుల్‌ శాంతి బహుమతి వచ్చింది. శాంతి బముమతులకు అస్సలు భద్రత లేదు. మొన్నే ఒకావిడ తనకొచ్చిన శాంతి బహుమతిని డోనాల్డ్‌ ట్రంపుకు ఇచ్చింది. ఆమె తనంతట తాను ఇచ్చిందో లేక తానే ఇవ్వాల్సి వచ్చిందో తెలియటం లేదు. అందువల్ల కనీసం శాంతి బహుమతులనైనా డిపాజిట్‌ చేసుకోండి ప్లీజ్‌” అని ప్రాధేయపడ్డాడు. బ్యాంకు మేనేజర్‌కి ఏమి చెప్పాలో తెలియటంలేదు. నోబుల్‌ ప్రైజులు తన బ్యాంకులో డిపాజిట్‌ చేసుకుంటే ట్రంప్‌కు ఆగ్రహం కలుగుతుందేమో అని భయపడుతున్నాడు.
ఇంతలో, టీవీలో వస్తున్న దృశ్యాలు చూసి అంతా హాహాకారాలు చేశారు! నోబుల్‌ ప్రైజ్‌ గ్రహీతల ఇళ్ల మీద అమెరికా పేస్‌ కమెండోలు హెలికాప్టర్లపై దిగుతూ, నోబుల్‌ ప్రైజు గ్రహీతల కుటుంబ సభ్యులను కిడ్నాప్‌ చేసి, వైట్‌హౌస్‌కి తీసుకెళ్లారు.అంతా దిగ్భ్రాంతికి లోనై చూస్తుండగానే ట్రంపు తెరమీదికి వచ్చాడు.

”మొన్న వెనెజులా ప్రతిపక్షనేత మాచాడో తన నోబుల్‌ శాంతి బహుమతిని నాకు ప్రదానం చేయటాన్ని చూసి, ప్రపంచంలోని అన్ని నోబుల్‌ ప్రైజు గ్రహీతలు స్ఫూర్తి పొందారు. తమకు ఫిజిక్స్‌, కెమిస్ట్రి, సాహిత్యం లాంటి విభాగాల్లో వచ్చిన నోబుల్‌ ప్రైజులను నాకు ప్రదానం చేయాలని నిర్ణయించుకుని నోబుల్‌ ప్రైజులతో సహా బయలుదేరారు. కాసేపట్లో వారంతా ఇక్కడికి చేరుకుంటారని వారి కుటుంబ సభ్యులు నాకు చెప్పారు. ప్రపంచంలోని అందరు నోబుల్‌ ప్రైజు గ్రహీతలందర్ని వైట్‌ హౌస్‌లోకి సగౌరవంగా ఆహ్వానించాలని, అమెరికా ఫేస్‌ కమెండోలకు ఆదేశాలు జారీ చేస్తున్నాను!” అని ముగిస్తుండగానే స్విస్‌ బ్యాంకు మీద అమెరికా ఆపాచి హెలికాప్టర్లు వాలాయి. పేస్‌ కమెండోలు వచ్చి నోబుల్‌ ప్రైజు గ్రహీతలకు బేడీలు వేసి, ఏకె 47 మెషిన్‌ గన్స్‌ మెడల మీద పెట్టి హెలికాప్టర్లలోకి ఎక్కించుకుని, నోబుల్‌ ప్రైజులతో సహా తీసుకెళ్లిపోయారు.

  • ఉషాకిరణ్‌
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -