ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్నందుకు గుర్తింపు
స్టాకహేోం : వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచడోకి ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం లభించింది. వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నందుకు, నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి న్యాయబద్ధంగా, శాంతియుతంగా పరివర్తన కోసం ఆమె సాగించే పోరాటానికి గుర్తింపుగా ఈ బహుమతి లభించిందంటూ ఈ మేరకు స్వీడిష్ నోబెల్
అకాడమీ ఒక ప్రకటన విడుదల చేసింది. గతేడాది కాలంగా మచడో అజ్ఞాతంలో జీవిస్తున్నారని, తనకు ప్రాణహాని వుందని తెలిసినా ఆమె దేశంలోనే ఉన్నారని ఆ ప్రకటన పేర్కొంది.
ఆ నిర్ణయమే లక్షలాదిమంది ప్రజలకు స్ఫూర్తిగా నిలిచిందని తెలిపింది. దేశంలోని ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఆమె, వెనిజులా సమాజం సైనికీకరణను ప్రతిఘటించడంలో ఎన్నడూ వెనుకాడలేదని నోబెల్ కమిటీ పేర్కొంది. ప్రజాస్వామ్యానికి శాంతియుతంగా పరివర్తన చెందడం కోసం ఆమె ధృఢంగా నిలబడ్డారని కమిటీ పేర్కొంది. ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి మొత్తంగా 338 నామినేషన్లు నమోదయ్యాయి. వాటిలో 244 మంది వ్యక్తులు కాగా, 94 సంస్థలు.