కొన్ని సినిమాలు కథ మాత్రమే చెప్తాయి. కొన్ని కథనానికి ప్రాధాన్యత ఇస్తాయి. కొన్ని సాధారణ ప్రజలు విస్మరించే జీవిత కథలను ఆ కథలలోని పాత్రల జీవన గమనాన్ని సూచిస్తాయి. మనం మన పరిధిలోనే జీవిస్తూ అందులోనే సంచరిస్తూ అదే జీవితం అనుకుంటూ ఉంటాం. కాని ఈ ప్రపంచంలో సాధారణతను త్రోసి అసాధారణమైన జీవన శైలిని ఎన్నుకుని జీవించే వ్యక్తులు ఎప్పుడూ ఉన్నారు. వారి ఉనికిని అజ్ఞానంతోనో, జిజ్ఞాస లేకనో మనం పరిగణలోకి తీసుకోం. కాని ఆ వ్యక్తుల జీవితాలు, వారి ఆలోచనలు మానవజాతి లోని భిన్న కోణాలను వివరిస్తాయి. మనం ఏర్పరుచుకున్న కట్టుబాట్లు, కట్టడులను అతిక్రమించి జీవించే ఆ వ్యక్తుల ఆలోచనలలోని వైవిధ్యం మన అసంతప్తులకు, మన ప్రశ్నలకు కొన్ని సమాధానాలను ఇస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తుల జీవన శైలిని పరిచయం చేసే సినిమాలు బహు తక్కువ. ‘నోమాడ్‌లాండ్’ ఆ లోటును పూరించే సినిమా.
నేటి ఆధునిక ప్రపంచంలో ఏవో కారణాలతో కొందరు తమ వాహనాలనే ఇల్లుగా మార్చుకుని అందులోనే గడుపుతూ సంచార జాతులుగా అమెరికా దేశంలో జీవిస్తూ ఉన్నారని చాలా కొద్ది మందికే తెలుసు. ఆ సంచార జాతుల జీవన విధానాన్ని రికార్డు చేసిన పుస్తకం ‘నోమాడ్ లాండ్- సర్వైవింగ్ అమెరికా ఇన్ ధి ట్వంటి ఫస్ట్ సెంచరి’ దీన్ని రచించింది అమెరికా దేశానికి చెందిన జర్నలిస్ట్ జెస్సికా బ్రూడర్. ఆ పుస్తకాన్ని ఫీచర్ ఫిలింగా తీసే సాహసం చేసారు చైనీయురాలు క్లో ఝావ్. సాహసం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే జెస్సికా బ్రూడర్ రాసిన పుస్తకం నాన్ ఫిక్షణ్. అందులో కథ లేదు. ఇరవై ఒక్క శతాబ్దంలోనూ సంచారుగా జీవిస్తున్న కొందరి అనుభవాలను గ్రంధస్తం చేసారు ఆమె. దాన్ని డాక్యుమెంటరీగా తీయవచ్చేమో కాని సినిమాగా తీయడం పెద్ద ప్రయోగమే. ఆ పనిని విజయవంతంగా పూర్తి చేసారు ఝూవ్. నోమాడ్‌లాండ్ 2021లో, 93వ ఆస్కార్ అవార్డులలో ఆరు విభాగాలలో నామినేట్ అయి, ఉత్తమ చిత్రంగా, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకురాలి విభాగంలో మూడు ఆస్కార్లు అందుకుంది. ఝావ్ ఉత్తమ దర్శకురాలిగా ఆస్కారు అందుకున్న రెండవ స్త్రీగా, మొదటి ఆసియా దేశస్తురాలిగా రికార్డు సష్టించారు. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన ఫ్రాన్సిస్ మెక్ డోర్మండ్ ఈ సినిమా నిర్మాత కూడా. అలా ఒకే సినిమాకు నటనకు, నిర్మాతగా ఉత్తమ చిత్రానికి, ఆస్కార్ అందుకున్న మొదటి మహిళగానూ, నాలుగవ వ్యక్తిగానూ ఈమె రికార్డుకెక్కారు. ఆస్కార్ కాకుండా ఇంకా ఎన్నో అవార్డులు ఈ సినిమాను వరించాయి.
తన పుస్తకం కోసం రచయిత్రి జెస్సికా బ్రుడర్ చాలా మంది సంచారులను ఇంటర్వ్యూ చేసారు. అచ్చంగా వారినే సంప్రదించి ఈ సినిమాలో నటింపజేసారు ఝావ్. అంటే ఒక రెండు మూడు పాత్రలు తప్ప ఇంచుమించు అందరూ సంచారి జాతికి చెందినవారే. తమ పాత్రలను తామే పోషించుకున్నారు. ఈ సినిమాకు జోషువా జేమ్స్ రిచర్డ్శ్ అందించిన సినిమాటోగ్రఫీ పెద్ద బలం. అమెరికా మైదానాలు, పర్వత ప్రాంతాలు జనసంచారం పెద్దగా లేని ప్రదేశాల సౌందర్యాన్ని సరైన సమయాలలో కెమెరాలో బంధించి ఈ సంచారుల జీవితంలోని విస్తారమైన నేపధ్యాన్ని ప్రేక్షకులకు అందించగలిగారు ఆయన.
ఫర్న్ తన భర్తతో నేవడాలోని ఎంపైర్ అనే చిన్న పట్టణంలోని ఓ జిప్సమ్ ప్లాంట్‌లో భర్తతో కలిసి పని చేస్తూ ఉండేది. ఆ ప్లాంట్ మూతపడడంతో దాని మీదే ఆధారపడే ఆ నగరవాసులు చాలా మటుకు మరో ప్రాంతానికి తరలి వెళ్లిపోయారు. ఫర్న్ భర్త కూడా మరణించడంతో ఆమె జీవితం హఠాత్తుగా పెను మార్పుకు గురవుతుంది. తనకున్న కొన్ని విలువైన వస్తువులను అమ్మి ఓ వాన్ కొనుక్కుని అక్కడి నుండి పని వెతుక్కుంటూ, మరో చోటుకు ప్రయాణిస్తుంది ఫర్న్. అమాజాన్ సెంటర్‌లో టెంపరరీగా ఆమెకు ఉద్యోగం దొరుకుతుంది. అది చేసుకుంటూ ఆ వ్యాన్‌లోనే నివసిస్తూ ఉండిపోతుంది. దాన్ని తన నివాసయోగ్యంగా కొన్ని మార్పులతో మార్చుకుంటుంది. ఫర్న్ పనిచేసే చోట లిండా అనే ఓ మహిళ ఆమెకు పరిచయం అవుతుంది. ఫర్న్ వ్యాన్‌లో నివసించడాన్ని గమనించి ఆమెలాగే సంచారిలుగా ఉండే మరికొందరిని లిండా ఫర్న్‌కి పరిచయం చేస్తుంది. బాబ్ వెల్స్ అనే సంచార నాయకుడు ఎడారి ప్రాంతంలో నిర్వహించే కాంప్‌కు ఫర్న్‌ను ఆమె తీసుకుని వెళుతుంది. అక్కడ తనలాగే వ్యాన్‌లలో జీవించే సంచారులను ఫెర్న్ కలుసుకుంటుంది. వాళ్ళ దగ్గర అలా జీవించడానికి కావల్సిన మెళకువలు నేర్చుకుంటుంది. వస్తువులను ఇచ్చి పుచ్చుకోవడం, పరస్పర సహకారం, సహాయం అందించుకోవడం, తోటి సంచారులను మితలుగా చేసుకోవడం. తన పరిధిలో ఉంటూనే వారిలో ఒకరిగా మెలగడం లాంటి విషయాలన్నీ ఆమెకు క్రమంగా అలవడతాయి.
ఒక సారి ఫర్న్ వ్యాన్ టైర్ పంక్చర్ అయిపోతుంది. అక్కడ మరో వ్యాన్ ఉండడంతో సహాయం కోసం ఆ వ్యాన్ యజమానురాలైన స్వాంకీని అడుగుతుంది ఫర్న్. రోడ్‌పై ప్రయాణిస్తూ స్పేర్ టైర్ పెట్టుకోకపోవడం, రాబోయే ప్రమాదానికి తయారుగా ఉండకపోవడం ఫర్న్ తప్పని ఆమెను విమర్శిస్తుంది స్వాంకి. రోడ్డుపై ఒంటరిగా ప్రయాణించడానికి, సంచారిగా జీవించడానికి తనకు తెలిసిన మెళుకువలు ఫర్న్‌కి నేర్పుతుంది. ఇద్దరూ మితలవుతారు. అప్పుడే స్వాంకీ కాన్సర్‌తో బాధపడుతుందని, హాస్పిటల్‌లో అంతమవకుండా చివరి క్షణం దాకా జీవించాలనే కోరికతో సంచారి జీవితాన్ని గడుపుతుందని ఫర్న్ తెలుసుకుంటుంది. బైట ప్రపంచంలో అనవసరమైన బంధాలు, దుఖాలకు దూరంగా ఒంటరిగా జీవించే సంచారీలు కోరుకునే ఆ స్వేచ్చ, ఆనందం ఆమెకు క్రమంగా అనుభవంలోకి వస్తాయి.
మరో కేంప్‌లో ఫర్న్ డేవ్ అనే వ్యక్తిని కలుస్తుంది. అక్కడ డేవ్ అస్వస్థతకు గురవుతే అతనికి సేవలు చేస్తుంది. ఇద్దరూ ఓ రెస్టారెంట్‌లో పని చేస్తూ ఉండగా డేవ్ కొడుకు తండ్రిని వెతుక్కుంటూ వచ్చి తనకు బిడ్డ పుట్టబోతుందని చెప్పి అతన్ని ఇంటికి తీసుకుని వెళ్లిపోతాడు. ఫర్న్ మరో ఉద్యోగానికి మారుతుంది. అక్కడ ఆమె వేన్ చెడిపోతుంది. దాన్ని బాగు చేసుకోవడానికి డబ్బు లేకపోవడంతో తన చెల్లెలింటికి వెళుతుంది ఫర్న్. మొదటి నుండి ఫర్న్ తీవ్రమైన స్వతంత్ర ప్రవత్తి కల స్త్రీ అని ఆమె చెల్లెలు గుర్తు చేస్తుంది. తాను కుటుంబ జీవనానికి సరిపోననే ఆలోచన ఫర్న్‌లో బలపడుతుంది. నిజానికి భర్తపై తనకున్న ఆ ప్రేమే తనను ఓ చోట బంధించేసాయని, ఇప్పుడు భర్త లేకపోవడంతో తాను ఓ చోటుకు పరిమితం అయి ఇక జీవించలేనని ఆమె తెలుసుకుని మళ్లీ ప్రయణం మొదలెడుతుంది. మార్గంలో డేవ్‌ని కలవడానికి అతని కొడుకు ఇంటికి వెళూతుంది. డేవ్ తాను సంచార జీవితానికి కొంత కాలం దూరంగా ఉండదల్చుకున్నానని చెబుతాడు. ఫర్న్ కోరుకుంటే అక్కడే ఉండవచ్చని తాను ఆమెతో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాని చెబుతాడు డేవ్. కాని తనకు ఆ జీవితం సరిపోదని నిశ్చయించుకుని డేవ్ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరిస్తుంది ఫర్న్.
సంచారుల కాంప్‌కు అరిజోనా తిరిగొచ్చిన ఫర్న్‌కు స్వాంకి మరణించిందన్న వార్త తెలుస్తుంది. ఆమె జ్ఞాపకంగా తోటి సంచారులతో పాటు క్యాంప్ ఫైర్‌లో ఓ రాయి వేసి నివాళి అర్పిస్తుంది ఫర్న్. బాబ్‌తో తన భర్త మరణం మిగిల్చిన ఒంటరితనం గురించి చర్చిస్తుంది. తన కొడుకు ఆత్మహత్య తననెంత బాధించిందో బాబ్ ఆమెకు చెప్పి మనసులోని బరువు దింపుకుంటాడు. ఆ సంచారీలందరూ విషాదమయిన నాగరిక జీవితాలను, అవి మిగిలించిన వేదనను దాటుకుని తమను తాము తెలుకునే ప్రయత్నంలో జీవితపు చివరి రోజులని గడుపుతున్నారని ఫర్న్ తెలుసుకుంటుంది.
సంచారులుగా జీవించే వాళ్లలో చాలా మంది వయసు పై బడినవారిగానే కనిపించినా కొందరు నవ యవ్వనులు కూడా ఈ జీవితాన్ని ఆస్వాదిస్తూ కనిపిస్తారు. ఫర్న్ ఓ నవయువకుడిని సంచారిగా చూస్తుంది. అతనితో వస్తు మార్పిడి చేసుకుని సంభాషణ కలుపుతుంది. ఆమె ప్రయాణంలో ఎందరో కొత్త వాళ్లు పరిచయమవుతారు. తన జీవితానుభవానికి ఈ గమ్యంలేని నిరంతర ప్రయాణంలో కలిసి కాసేపు మాట కలిపే తోటి సంచారుల జీవితానుభవాలను జోడించుకుంటుంది. ఈ స్నేహాలలో ఒకరి పట్ల మరొకరు ప్రదర్శించే గౌరవం, ప్రేమలను ఆమె గమనిస్తుంది. నగరాలలో లేని కలుపుగోలుతనం, సహాయం చేసే తత్వం, అరమరికలు లేని స్నేహాన్ని ఆమె ఈ సంచార జీవితంలో ఆస్వాదిస్తుంది. పరిమితులకు కట్టుబడి మసలే సంచారుల సామాజిక జీవితంలో అన్ని రకాల భేధాలకు అతీతమైన సౌభాతత్వం ఆమె అనుభవంలోకి వస్తుంది. జీవితాన్ని అతి సాధారణంగా స్వీకరిస్తూ మరణాన్ని అంతే సహజంగా అంగీకరించగల వారి అనుభవం, పరిపక్వత ఆమెకు ఒక అర్ధపూరిత ప్రయాణానికి మార్గం వేస్తాయి. అందుకే ఆ సంచార జీవితమే చివరి మజిలిగా నిర్ణయించుకుని తన పాత ఇంటికి ఆఖరి సారి తిరిగి వెళ్లి, దాన్ని పూర్తిగా ఖాళీ చేసి రోడ్డుపైకి శాశ్వతంగా వస్తుంది ఫర్న్. బాబ్ చెప్పినట్లు సంచారులకు తుది వీడ్కోలు అంటూ ఉండదు. సంచారులు మళ్లీ కలుద్దాం అన్న పిలుపుతోనే విడిపోతారు. మళ్లీ ఏక్కడో అక్కడ ఒకరికొకరు ఎదురుపడుతూనే ఉంటారు.
సినిమా ఏ హడావిడీ, ఎటువంటి పరుగు లేని సంచార జాతుల జీవన శైలిలాగే మంద్రంగా సాగుతుంది. నచ్చిన చోట కొన్నాళ్లు ఉండడం, అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కావల్సినంత సంపాదించుకోవడం, తమ అవసరాలను పరిమితం చేసుకుంటూ మితంగా ఖర్చు పెట్టుకుంటూ ప్రకతిలో భాగం అయి జీవించడం, వస్తువుల పట్ల అతి ప్రేమను వదిలించుకుంటూ ముందుకు సాగిపోవడం సంచారీల జీవిన విధానం. తమ దగ్గర ఎక్కువగా పోగయిన వస్తువులన్నిటినీ తమ తోటి సంచారులతో ఏర్పడ్డ కాంపులలో బాహాటంగా పంపిణికి పెట్టడం వారి ఆచారం. తమకు కావల్సిన వస్తువులను తోటి సంచారులు అందులనుండి చూసి ఏరుకుంటారు. వ్యాన్ మోయగలిగినంత సామానే వారితో అన్ని చోట్లకు వెళుతూ ఉంటుంది.
అసలు మనుషులు అంత పరిమితంగానే జీవించాలేమో. అనవసరమైన పరుగులతో, అత్యాశలతో జీవితాలను గందరగోళం చేసుకుంటున్నాం. కావలసినంత సంపాదించుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరి అనుభవాల నుండి మరొకరు నేర్చుకుంటూ కావల్సినప్పుడు సమూహంగా, లేనప్పుడు ఏకాంతంగా జీవించే ఆ సంచారుల జీవన శైలిలో నిజాయితీ ఉంటుంది. ఏ విభేధాలు, వైషమ్యాలు లేని స్నేహం కనిపిస్తుంది. పరుగుల జీవితంలో మనిషి పోగొట్టుకున్న ప్రశాంతత గురించి ఆలోచింపజేస్తుంది వారి జీవనవిధానం.
కథేలేని ఈ సినిమాలో మనమూ ఆ సంచారుల జీవితంలోని దార్శనికతను అనుభవిస్తాం. కొన్ని సందర్భాలలో సినిమా కాకుండా డాక్యుమెంటరీ చూస్తున్న భావం కలుగుతూ ఉంటుంది. రొటీన్‌గా మనం చూసే సినిమాల నడుమ కొత్తగా ఉంటుంది ఈ సినిమా. కాని ఫర్న్‌లా ప్రకతిలో భాగంగా కలిసిపోయే జీవన ప్రయాణంలో భాగం అవ్వాలనే కోరికా కలుగుతుంది. ఆస్కార్ పొందిన చిత్రాల నడుమ వైవిధ్యంగా నిలిచే చిత్రం నోమాడ్‌లాండ్. బంధాలకు, అనుబంధాలకు దూరంగా ప్రకతిలో భాగంగా సన్యాసాశ్రమం స్వీకరించాలనే ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక సిద్దాంతాలను ఈ సినిమా మనకు గుర్తు చేస్తుంది కూడా.
- పి.జ్యోతి, 98853 84740



