Friday, December 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమంత్రి కొండా సురేఖపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

మంత్రి కొండా సురేఖపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

- Advertisement -

నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దాఖలు చేసిన క్రిమినల్‌ పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు మంత్రి కొండా సురేఖపై నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ (ఎన్‌బీడబ్ల్యూ)ను జారీ చేసింది. కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం ఈ కేసు విచారణకు వచ్చింది. నిందితురాలి గైర్హాజరును న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కోర్టుకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. కేటీఆర్‌ దాఖలు చేసిన పరువు నష్టం కేసు (సీసీ నెంబర్‌ 307 ఆఫ్‌ 2025) విచారణ దశకు చేరుకుంది. గురువారం ఆమె గైర్హాజరుకు సంబంధించి న్యాయస్థానానికి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం, మినహాయింపు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. కోర్టు ప్రొసీడింగ్స్‌కు సహకరించకుండా నిరంతరం గైర్హాజరవుతున్న తీరును సీరియస్‌గా తీసుకున్న న్యాయమూర్తి, ఆమెపై నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సాధారణ వారెంట్‌లాగా ఇందులో బెయిల్‌ పొందే హక్కు నిందితులకు ఉండదు. ఈ వారెంట్‌ అమలు చేసి నిందితురాలిని హాజరుపరిచే బాధ్యతను పోలీసులకు కోర్టు అప్పగించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి ఐదో తేదీకి వాయిదా వేసింది. తాజా పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పూర్తిగా అవాస్తవం : కొండా సురేఖ
కొన్ని పత్రికలు, మీడియా చానెళ్లు, వెబ్‌సైట్లలో న్యాయస్థానం నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసినట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని మంత్రి కొండా సురేఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి విచారణ వచ్చే ఏడాది ఫిబ్రవరి ఐదో తేదీన కోర్టుకు హాజరుకావాలంటూ న్యాయస్థానం స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ విషయాన్నిఅందరూ పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -