– అశ్వారావుపేట ప్రభుత్వ ఆస్పత్రి ఘనత
నవతెలంగాణ – అశ్వారావుపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన సుఖప్రసవం విజయవంతంగా నిర్వహించారు. సాధారణంగా అధిక బరువున్న శిశువులకు శస్త్రచికిత్స (సిజేరియన్) చేయడం ఆనవాయితీ కాగా, వైద్య సిబ్బంది నైపుణ్యంతో 4.5 కిలోల బరువున్న శిశువుకు సాధారణ కాన్పు నిర్వహించడం విశేషం.
పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం తాగ్యాంపూడికి చెందిన ముంగర మమత (భర్త: శివయ్య, స్వగ్రామం అచ్చుతాపురం – అశ్వారావుపేట మండలం)కు శుక్రవారం రాత్రి సుఖప్రసవం జరిగింది. తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
ఈ ప్రసవాన్ని ప్రసూతి వైద్యురాలు డా. మౌనిక పర్యవేక్షణలో నర్సింగ్ ఆఫీసర్ శ్రీమతి ప్రమీల రాణి విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయనే విషయానికి ఈ ఘటన నిదర్శనమని స్థానికులు అభినందించారు.



