విద్యార్థిని మృతికి నిరసనగా స్వచ్ఛందంగా బంద్
భువనేశ్వర్ : ఒడిశాలో గురువారం జనజీవనం స్తంభించింది. బాలాసోర్‌లో ప్రొఫెసర్ లైంగిక వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య ఘటనను నిరసిస్తూ స్వచ్ఛందంగా 12 గంటల బంద్‌ను నిర్వహించారు. సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ (ఎంఎల్), కాంగ్రెస్ వంటి 12 ప్రతిపక్ష పార్టీలు ఈ బంద్‌కు మద్దతు ఇచ్చాయి. బంద్ కారణంగా భువనేశ్వర్, కటక్‌తో సహా అన్ని ప్రధాన నగరాల్లో సాధారణ జీవనం ఇబ్బందులకు గురైంది. విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారులను దిగ్బంధించడం, రోడ్లపై టైర్లకు నిప్పు పెట్టడంతో రవాణా తీవ్రంగా ప్రభావితమయింది. ప్రభుత్వ, ప్రయివేటు బస్సులు రోడ్లపైకి రాకపోవడంతో ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఆటోలు, ట్యాక్సీలు నిలిపివేశారు. బస్టాండ్లు, టెర్మినల్స్ నిర్మానుషంగా మారాయి. అలాగే మార్కెట్లు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మాసివేశారు. రైల్వే ఫ్లాట్‌ఫామ్‌లు, రైల్వే ట్రాక్‌లపై కూడా నిరసనకారులు ఆందోళన చేయడంతో రైల్వే సేవలు తాత్కాలికంగా నిలివేశారు.
బంద్‌కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ (ఎంఎల్), ఫార్వర్డ్ బ్లాక్, ఆర్జేడీ, ఎస్‌పీ, ఎన్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనలు నిర్వహించారు. తమ పార్టీ జెండాలను ఊపుతూ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి మహిళలకు భద్రత కరువైందని విమర్శించారు. రాష్ట్రంలో రోజుకు 12 మంది మహిళలు, బాలికలు అఘాయిత్యానికి గురవుతున్నారని, లైంగికదాడి ఘటనలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. భువనేశ్వర్‌లోని ముఖ్యమంత్రి నివాసం వైపు ప్రదర్శనగా వెళుతున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతో నిరసకారులు వాగ్వాదానికి దిగారు. చివరికి వారిని చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.అలాగే పీఎంజీ స్వ్కేర్ సమీపంలో జరిగిన ప్రదర్శనల్లో పాల్గొన్న అనేక మంది కాంగ్రెస్, వామపక్ష కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ బంద్ సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు సురేష్ పాణిగ్రాహి మాట్లాడుతూ ఈ బంద్‌ను ‘ప్రజా ఉద్యమంగా’ అభివర్ణించారు. బంద్‌కు రవాణ సంఘాలు, విద్యావేత్తలు, పౌర సమాజ సంఘాల నుంచి విస్తృత మద్దతు లభించిందని చెప్పారు. ఒడిశా పీసీసీ అధ్యక్షులు భక్త చరణ్‌దాస్ మాట్లాడుతూ ఈ ఘటనలో దోషులను కాపాడ్డానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఒడిషా కాంగ్రెస్ ఇన్‌చార్జీ అజరుకుమార్ లల్లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మాఝీ, కేంద్ర మంత్రి ధర్మేంద ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అది సంస్థాగత హత్యే
లైంగిక వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సీపీఐ(ఎం) నాయకులు బృందాకరత్ తీవ్రంగా స్పందించారు. పీటీఐతో మాట్లాడుతూ అది సంస్థాగత హత్యే అని విమర్శించారు. ‘ఇది సంస్థాగత హత్యే అని నేను చెబుతాను. అధికారంలో ఉన్నవారి తప్పుల ఫలితంగానే ఈ హత్య జరిగింది. నేను ఎందుకు ఈ విధంగా చెబుతున్నాంటే బాధిత విద్యార్థిని ఎబివిపి నాయకురాలు. అధికార బీజేపీకి ఏబీవీపీ చాలా సన్నిహత సబంధాలు కలిగి ఉందనేది మనకు తెలుసు. బాధిత విద్యార్థిని తన ఫిర్యాదులన్నింటీని ముఖ్యమంత్రి కార్యాలయానికి, పోలీసులకు కాపీ చేసింది. ఏమి జరుగుతోందో ఆమె సొంత సంస్థకు తెలుసు. అయినప్పటికీ వారు ఏమీ చేయలేదు. ఇది ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించింది’ అని బృందాకరత్ తెలిపారు. – బృందాకరత్
ఒడిశాలో స్తంభించిన జనజీవనం
- Advertisement -
- Advertisement -