జపాన్ సముద్రం వైపు 10 మిసైల్స్!
అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాల నడుమ తాజా పరిణామం
సియోల్ : అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా నిర్వహిస్తున్న భారీ సైనిక విన్యాసాల నడుమ ఉత్తర కొరియా బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగించింది. ఉత్తర కొరియా తన పశ్చిమ తీర ప్రాంతం నుంచి సుమారు 10 బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ఈ క్షిపణులు ఈశాన్య దిశగా సుమారు 340 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్ సముద్ర సమీప ప్రాంతంలో పడినట్టు జపాన్ రక్షణ శాఖ తెలిపింది.
ఈ క్షిపణులు సుమారు 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగిరినట్టు జపాన్ అధికారులు వెల్లడించారు. సమీపంలోని విమానాలు, నౌకలకు ఎలాంటి నష్టమూ జరగలేదని తెలిపారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఉత్తర కొరియా క్షిపణులు ప్రయోగించడం ఇది మూడోసారి అని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది.
అమెరికా-దక్షిణ కొరియా కలిసి నిర్వహిస్తున్న ‘ఫ్రీడమ్ షీల్డ్’ అనే పది రోజుల సైనిక విన్యాసాలకు వ్యతిరేకంగా ఉత్తర కొరియా ఈ చర్యకు పాల్పడిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ విన్యాసాల్లో వేలాది మంది సైనికులు పాల్గొంటున్నారు. ఈ విన్యాసాలపై ఉత్తర కొరియా అభ్యంతరం తెలుపుతోంది. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ ఈ విన్యాసాలను తీవ్రంగా విమర్శించారు. సియోల్, వాషింగ్టన్‌లు కొరియా ద్వీపకల్పంలో స్థిరత్వాన్ని నాశనం చేస్తున్నాయని అమెరికా, దక్షిణ కొరియాలపై ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్… మళ్లీ కిమ్ జోంగ్ ఉన్‌తో చర్చలు జరపవచ్చనే ఊహాగానాలు నడుమ ఉత్తర కొరియా తాజా ప్రయోగం జరపడం గమనార్హం. గతంలో ట్రంప్, కిమ్ మూడు సార్లు సమావేశమైనప్పటికీ… అణు నిరాయుధీకరణపై పెద్దగా పురోగతి సాధించలేని విషయం విదితమే.
ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



