అమలు చేయాలని ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, హామీలను అమలు చేయాలని బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తే.. కాంగ్రెసోళ్లు తట్టుకోలేకపోతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన బండ్లగూడ మాజీ మేయర్ శ్రీలతగౌడ్ తన అనుచరులతో కలిసి మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మోసం చేసేవారికే ప్రజలు పట్టం కడతారని ఎన్నికల ముందే చెప్పి అధికారంలోకి వచ్చాడని గుర్తు చేశారు.
రెట్టింపు పెన్షన్లు, రైతుబంధు, దళిత బంధు, రెండు లక్షల ఉద్యోగాలు ఇలా అనేక హామీలను ప్రకటించి ఒక్కటీ అమలు చేయకుండా ప్రజలను 24 నెలలుగా మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల గురించి పట్టించుకోవాలని సూచించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో బట్టల షాపు ప్రారంభోత్సవానికి వెళ్లిన సీఎం పక్కనే ఉన్న అశోక్‌నగర్‌కు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. రైతులు, రైతు కూలీలు, కౌలుదారులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ప్రభుత్వ ఉద్యోగులు.. ఇలా అందరిని మోసం చేశారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే ముఖ్యమంత్రి తనకు తెలిసిన భాషలో మాట్లాడుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం కాదు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ప్రత్యామ్నాయం కాదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన అదిలాబాద్, మెదక్ జిల్లాల మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. 24 నెలల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనను, గత పది సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని గుర్తు చేశారు. మరోసారి బీఆర్‌ఎస్‌వైపు నిలిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తమ వైపు ప్రజలు నిలబడడబే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.. కృష్ణా జలాల నుంచి మొదలుకుని అంతర్రాష్ట్ర వ్యవహారాల్లో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీకి మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాటం తప్పదని హెచ్చరించారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ కౌన్సిలర్ యూనియన్ (టీఏసీసీయూ) 2026 క్యాలెండర్‌ను కేటీఆర్ ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆవిష్కరించారు. తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ కౌన్సిలర్లు తమకు ఎదురవుతున్న పలు ఉద్యోగ సంబంధిత సమస్యలను ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఆయన వాటిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీఎస్టీ కమిషన్ మెంబర్ విద్యాసాగర్, బీఆర్‌ఎస్‌వీ ఉపాధ్యక్షులు తుంగ బాలు, మాజీ బీసీ కమిషన్ మెంబర్ కోటి కిషోర్ సంఘం అద్యక్షులు బొద్దిరెడ్డి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కాముని రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఏ ఒక్క హామీ అమలు చేయలేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



